దిగజారిన ప్రచారం
ఎన్నికల ప్రచారం ఎలా ఉండకూడదు అనడానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాలే ఓ ఉదాహరణగా నిలుస్తాయి. ఆయన స్థాయికి అవి ఏమాత్రం తగవని చెప్పడం చిన్నమాట అవుతుంది. ఇదివరకటి అటల్ బిహారీ వాజపేయీ తరహాలో కాకుండా ఈసారి బీజేపీ ప్రచారం నిండా మోదీయే పరుచుకున్నారు.
ఎన్నికల ప్రచారం ఎలా ఉండకూడదు అనడానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాలే ఓ ఉదాహరణగా నిలుస్తాయి. ఆయన స్థాయికి అవి ఏమాత్రం తగవని చెప్పడం చిన్నమాట అవుతుంది. ఇదివరకటి అటల్ బిహారీ వాజపేయీ తరహాలో కాకుండా ఈసారి బీజేపీ ప్రచారం నిండా మోదీయే పరుచుకున్నారు. అసాధారణమైన రీతిలో బీజేపీ మ్యానిఫెస్టోకు ‘మోదీ గ్యారంటీ’ అని పేరుపెట్టారు. ఒక్కమాటలో చెప్పాలంటే మోదీ మంత్రాన్నే బీజేపీ నమ్ముకున్నది. ఆయన కూడా ఎక్కడ చూస్తే అక్కడ తానే అన్నట్టుగా దేశమంతటా తిరుగుతూ సుడిగాలి ప్రచారం నిర్వహించారు. మార్చి 16 నుంచి మే 30వ తేదీ వరకు ఆయన 206 బహిరంగ సభలు, రోడ్ షోలలో 150 గంటల పాటు ప్రసంగించి, 80 ఇంటర్వ్యూల్లో వెయ్యి ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఇదొక రికార్డు అని కూడా అంటున్నారు. మోదీ ప్రచారంలో ఈ రాశికి తగ్గ వాసి కొరవడటం, చౌకబారుతనం పదేపదే తొంగిచూడటంపై దేశ ప్రజానీకం విస్మయానికి గురైంది.
అయితే ఏడు దశల ఎన్నికల్లో ఒక్కో విడత ముగుస్తున్నకొద్దీ మోదీ ప్రచార స్థాయి ‘ఆకాశంబున నుండి.. శంభుని శిరంబందుండి శీతాద్రి’ అన్నట్టుగా దిగజారుతూ వస్తున్న సంగతి గమనించవచ్చు. ఎన్నికలకు ముందు నాటి అంచనాలు పోలింగ్ సరళిని బట్టి తారుమారు అవుతుండటమే అందుకు కారణమనే మాట బలంగా వినిపించింది. బీజేపీ ఓడిపోతున్నదనే జోస్యాలు అంతకంతకూ ఊపందుకోవడం మొదలైంది. ముఖ్యంగా బీజేపీకి కంచుకోట లాంటి ఉత్తరాదిలోనే ఎదురుగాలులు వీస్తున్నాయనే విశ్లేషణలు పెరుగుతూ పోతుంటే మోదీలో నిస్పృహ కట్టలు తెంచుకుంటున్నట్టు కనిపించింది.
పదేండ్ల కాలంలో తాను సాధించిన విజయాల గురించి గానీ, మళ్లీ అధికారమిస్తే రాబోయే రోజుల్లో సాధించే ఘనకార్యాల గురించి గానీ ప్రధాని మాట్లాడలేదు. ఆయన ప్రసంగాలన్నీ విపక్షాలను లక్ష్యంగా చేసుకునే సాగిపోయాయి. కాంగ్రెస్‌ను పెద్ద బూచిగా చూపడం కొంచెం శృతి మించింది. మతపరమైన భావజాలం కట్టలు తెంచుకుంది. కాంగ్రెస్ గెలిస్తే వారసత్వ పన్నులు వేస్తారనీ, అందరి సొమ్ము పోగుచేసి కొందరికే ఇస్తారనీ, రాజస్థాన్ ప్రచారంలో ఓటర్లను మోదీ హెచ్చరించారు. ఆ తర్వాత ఏకంగా కాంగ్రెస్‌వారు మహిళల మెడల్లోనుంచి మంగళసూత్రాలూ లాగేసుకుంటారు అనేదాకా పోయారు. అధిక సంతానం కలిగి ఉండేవారు, సరిహద్దులను దాటి వచ్చేవారు అంటూ ఒకవర్గాన్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు. దీనిపై దుమారం చెలరేగింది. విపక్షాలు ఒత్తిడి తేవడంతో ఎన్నికల సంఘం సుతిమెత్తగా అయినా మందలించక తప్పలేదు. ఈ పరనింద ఇలా కొనసాగిస్తూనే ఆత్మస్తుతిలో పడిపోయారు. ‘నన్ను దైవం పంపింది’ అనే దగ్గర మొదలుపెట్టి ‘నేనే దేవుణ్ణేమో’ అనేదాకా వెళ్లిపోయారు. జాతిపిత గాంధీజీ గురించి తాజాగా చేసిన వ్యాఖ్య ఈ పతనావస్థకు పరాకాష్ఠ.
అటెన్‌బరో దర్శకత్వంలో 1982లో విడుదలైన ఆంగ్ల చిత్రం గాంధీ వల్లనే మహాత్మునికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని ప్రధాని స్థాయి వ్యక్తి అనడం ఏ రకంగానూ ఆమోదయోగ్యం కాదు. శోభస్కరం అంతకంటే కాదు. భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో గాంధీ నిర్వహించిన పాత్ర ఏమిటో కొత్తగా చర్చించాల్సిన విషయం కానేకాదు. ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు, అనుయాయులు అసంఖ్యాకంగా ఉన్నారు. ఒక మండేలా, ఒక మార్టిన్ లూథర్‌కింగ్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన మార్గాన పయనించి చరితార్థులైనవారెందరో చరిత్రకు సుపరిచితమే. ‘ఇలాంటి ఒక మానవుడు రక్తమాంసాలతో ఈ భూమ్మీద నడిచాడా’ అని రాబోయే తరాలు విస్తుపోతాయని ప్రముఖ శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ అర్పించిన నివాళి జగత్ప్రసిద్ధం. గాంధీజీ ఈ దేశంలో, ఆ మాటకు వస్తే ప్రపంచంలో చర్చాంశం కాకుండా ఎన్నడూ పోలేదు. కానీ ఈ దేశ పరిపాలనా వ్యవస్థ శిఖరస్థానంలో ఉన్న మోదీ దీంతో విభేదిస్తుండటం విస్మయం కలిగిస్తున్నది. ఆయనకు సొంత అభిప్రాయాలు ఉండొచ్చు. లేదా బీజేపీ భావజాలంలో అదొక భాగమై ఉండొచ్చు. కానీ ప్రభుత్వాధినేతగా బహిరంగంగా వ్యాఖ్యానించడం మాత్రం సమర్థనీయం కాదు. వివాదాల జోలికి పోని సౌమ్యుడిగా పేరున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పినట్టుగా మోదీ ప్రసంగాలు ప్రధాని పదవి హుందాతనాన్ని దిగజార్చేవిగా ఉన్నాయనేది అక్షరసత్యం.
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

