ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చూపించిన ప్రభావం సామాన్యమైనది కాదు. ఆంధ్రాలో కాంగ్రెస్ మాటే వినబడకుండా చేశారు. రాష్ట్ర విభజన తర్వాత మూడుసార్లు ఎన్నికలు జరిగితే ఒక్కచోట కూడా డిపాజిట్ రానంత ప్రభావాన్ని ఆయన చూపించారు. విభజన సమయంలో కిరణ్‌కుమార్‌రెడ్డి కాకుండా మరెవరు సీఎంగా ఉన్నా కాంగ్రెస్‌కు ఈ దుస్థితి దాపురించేది కాదు. ఉమ్మడి రాష్ట్రంలో చివరి ముఖ్యమంత్రిని ఎంపిక చేయడంలో ఆ పార్టీ నాయకత్వం చేసిన తప్పు తెలంగాణలో ముఖ్యమంత్రిని ఎంపిక చేయడంలోనూ చేసింది. కాంగ్రెస్‌వాది కాదు, ఆ పార్టీ లక్షణాలు లేవు, సన్నిహిత మీడియా రాసినట్టుగా భారీ మొత్తంలో కాంగ్రెస్ కోసం ఖర్చు చేశారని హైకమాండ్ రేవంత్‌ను ముఖ్యమంత్రిగా చేసి ఉండవచ్చు.
బీజేపీ వల్ల కాంగ్రెస్ కొంతవరకు బతికిపోయింది కానీ బీజేపీ తన సహజ లక్షణాన్ని చూపించి ఉంటే తెలంగాణలో ప్రధానంగా బీఆర్ఎస్-బీజేపీల మైదానంగా మారి ఉండేది. కాంగ్రెస్ మూడవ స్థానంలోకి వెళ్లేది. బీఆర్ఎస్ను అణచివేయడం ద్వారా తెలంగాణ మైదానం కాంగ్రెస్-బీజేపీల మైదానంగా నిలబడుతుందని అనుకొని బీజేపీ ఇంతకాలం కాంగ్రెస్‌కు పరోక్షంగా అండగా నిలిచింది. అదే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు (అప్పటి గవర్నర్) బీజేపీ నాయకురాలు తమిళి సై తానే సీఎంను అన్నట్టు అధికారం చలాయించారు. తెలంగాణ ప్రభుత్వానికి అడుగడుగునా అడ్డంకులు కల్పించారు. చివరకు శాసనమండలి సభ్యులుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సిఫార్సులను తిరస్కరించారు. అనంతరం తమిళ సై చర్యను కోర్టు కూడా తప్పుపట్టింది. అలాంటిది ఇప్పుడు గవర్నర్ ఊసే వినిపించడం లేదు.
కాంగ్రెస్ మీద ప్రేమ కన్నా బీఆర్ఎస్ మీద వ్యతిరేకత, ఈ పార్టీ బలహీనపడితే ఆ స్థానంలో తాము నిలువాలి అనేది ఇప్పటివరకు బీజేపీ అనుసరించిన వ్యూహం. దానికోసమే కాంగ్రెస్ పట్ల సానుకూల ధోరణితో ఆ పార్టీ నేతలు వ్యవహరించారు. ఏమీ లేనిచోట లిక్కర్ కుంభకోణం అంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను, డిప్యూటీ సీఎంను జైలుపాలు చేసి ‘ఆప్’ను ఓడించిన బీజేపీ తెలంగాణలో ఏ కుంభకోణంపై కూడా స్పందించడం లేదు. కుంభకోణాలపై సీరియస్ అయితే, కాంగ్రెస్ బలహీనపడితే బీఆర్ఎస్కే లాభమని కమలనాథులు మౌనంగానే ఉంటున్నారు. ఏ ఆధారం లేని కేసులో జైలు పాలు చేసినప్పుడు.. వీడియోలుతో సహా పట్టుపడిన ఓటుకు నోటు కేసులో బాధ్యులపై ఎలాంటి చర్య తీసుకోవడం లేదు.
ఇతర పార్టీల్లో ఉన్నప్పుడు వారి అవినీతిని బయటపెట్టి, ఈడీతో దాడులు చేయించి వారిని బీజేపీలో చేర్చుకోవడం కేంద్ర పాలకుల రాజకీయ వ్యూహం. బెంగాల్, ఒడిశా ముఖ్యమంత్రులను అలాగే బీజేపీలో చేర్చుకున్నారు. తెలంగాణకు వచ్చేసరికి కాంగ్రెస్ సీఎంను బలహీనపరిస్తే బీఆర్ఎస్కు ప్రయోజనం..అది బీజేపీకి ఇష్టం లేదు.
బీజేపీ నుంచి ఇంతటి సహకారం అందుతున్నప్పటికీ కాంగ్రెస్ సీఎం రేవంత్‌రెడ్డి నిలబడలేకపోతున్నారు. గతంలో సాధారణంగా పాలకులు తప్పు చేస్తే మీడియాలో విమర్శిస్తూ రాసేవారు. కానీ చిత్రంగా ఇప్పుడు రేవంత్‌రెడ్డి బలహీనపడుతున్నాడు, అతనిని బలపర్చండి అని మీడియా రాస్తున్నది. కాంగ్రెస్ సీనియర్లు, ఆ పార్టీ పరిశీలకులు, హై కమాండ్ రేవంత్ రెడ్డిని బలపరచాలి అని మీడియా రాస్తున్నది. ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులపై మీడియా మండిపడుతూ రేవంత్‌రెడ్డికి మద్దతుగా నిలువకపోతే సహించేది లేదని వార్నింగ్ ఇస్తున్నది. కాంగ్రెస్ సీనియర్లను చులకన చేస్తూ ఇలాంటి రాతలు రాయించడం మానుకోకపోతే సహించేది లేదని ఆ పార్టీ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హెచ్చరించారు. మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత సీఎం రేవంత్‌రెడ్డి, అతని సోదరులు చేస్తున్న అక్రమాలపై మీడియా సమావేశంలో ఆరోపణలు చేశారు.
ఆ ఆరోపణల్లో నిజానిజాల గురించి ఎవరూ మాట్లాడడం లేదు. కానీ వెంటనే కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తీసేయాలని ఆంధ్రా మీడియా డిమాండ్ చేస్తున్నది. కొండా సుస్మిత ఆరోపణల్లో నిజానిజాలను మాత్రం పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయాలని తమ జీవితకాలమంతా పోరాడిన ఆ మీడియా ఇప్పుడు రేవంత్‌రెడ్డికి అండగా నిలిచింది. కాంగ్రెస్ అంటే ఆంధ్ర మీడియాకు కోపం పోయి ప్రేమ పుట్టుకువచ్చిందని కాదు. ఆంధ్ర మీడియా అభిమానిస్తున్నది కాంగ్రెస్‌ను కాదు.. రేవంత్‌రెడ్డిని. ఆంధ్రా మీడియా రేవంత్‌లో తెలంగాణ చంద్రబాబును చూసుకుంటున్నది. 1995 లో ఎన్టీఆర్‌ను వెన్నుపోటుతో దించినప్పడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు తొలుత బాబు వైపు ఉండి, ఓ 12 మంది శాసనసభ్యులతో కలిసి మళ్లీ ఎన్టీఆర్ వైపు వెళ్లారు. ఎన్టీఆర్ నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బాబును వీడి ఎలా వస్తారని దగ్గుబాటిని ఒక సీనియర్ జర్నలిస్టు నిలదీశారు. వెన్నుపోటు పొడిచిన నాయకుడిని నిలదీయకుండా, తిరిగి వెనక్కి వచ్చిన వారిని నిలదీసింది అప్పటి మీడియా.
ఇప్పుడు మీడియా కాంగ్రెస్‌ను భ్రష్టుపట్టిస్తున్న వారికి అండగా నిలుస్తూ ఒరిజినల్ కాంగ్రెస్ వారిని నిలదీస్తున్నది. ఎన్నికలకు ముందు ఇదే టెక్నిక్ అమలుచేసి రేవంత్‌రెడ్డికి పోటీ లేకుండా చేశారు. ఒకసారి పారిన వ్యూహం మళ్లీ పనిచేస్తుందని అనుకుంటున్నారు.
బీజేపీ పరోక్ష మద్దతు, ఆంధ్రా మీడియా ప్రత్యక్ష మద్దతు ఇస్తున్నప్పటికీ పరిపాలనా వైఫల్యాల వల్ల కాంగ్రెస్ రోజురోజుకూ బలహీనపడుతున్నది. అన్నివర్గాల నుంచి వ్యతిరేకతను మూటకట్టుకుంటున్నది. బీజేపీ నియమించిన గవర్నర్, ఆ పార్టీ మీడియా అండగా నిలిచినా పాలనా సామర్థ్యం లేకపోవడం వల్ల అధికారంలోకి వచ్చి మూడేండ్లు కావస్తున్నా ఇంకా బూతుల మీద ఆధారపడి రాజకీయం చేస్తున్నారు. కానీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఫలానా పని చేశామని చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఉమ్మడి రాష్ట్రంలో కానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత కానీ గతంలో ఎప్పుడూ లేనివిధంగా రిటైరైన ప్రభుత్వ ఉద్యోగులకు బెనిఫిట్స్ చెల్లించడం లేదు. కోర్టు తీర్పు చెప్పినా చెల్లించే పరిస్థితి లేదు. ఆంధ్రాలో కాంగ్రెస్‌కు అడ్రస్ లేకుండా కిరణ్‌కుమార్‌రెడ్డి సాధించిన విజయానికి చేరువలో తెలంగాణలో రేవంత్ రెడ్డి కృషి సాగుతున్నది.
బీజేపీ చేయి వదిలేస్తే కిరణ్‌కుమార్‌రెడ్డి సాధించిన విజయం తెలంగాణలో రేవంత్‌రెడ్డి సాధించడం పెద్ద కష్టం కాదు. ఆరు హామీల అమలు లేదు, సరైన ప్రణాళిక లేదు, రాష్ర్టాన్ని అధోగతిపాలు చేశారు. ఢిల్లీ పోతే జేబులు కొట్టేవాడిని చూసినట్టు చూస్తున్నారు, ఎక్కడా ఇజ్జత్ లేదని స్వయంగా రేవంత్‌రెడ్డి ప్రకటించారు. తన అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడానికి మతలబు ఏందో అసలు విషయం రేవంత్ చెప్పరు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా వెల్లడించదు. రేవంత్‌రెడ్డి వ్యవహారశైలి తెలంగాణ పరువు తీసే విధంగా ఉన్నది. సీఎం ఆర్థికంగా బలపడ్డారు, మీడియా మద్దతుపరంగా బలంగా ఉన్నారు. కానీ కాంగ్రెస్‌ను బలహీనపరిచారు. తెలంగాణ ప్రతిష్టను, ఆర్థిక స్థితిని బలహీనపరిచారు. ‘వెంట్రుకలు ఉన్న అమ్మడు ఏ కొప్పు అయినా వేయగలదు’ అన్నట్టు భారీ సొమ్ములు ఉన్నవాళ్లు ఏ పార్టీలోనైనా సర్దుకోగలరు.
-బుద్దా మురళి