PM Modi | మోదీకి గ్యారెంటీ ఉందా?
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒక ఆసక్తికరమైన చర్చను లేవనెత్తారు. అదేమిటంటే.. ‘బీజేపీ నియమం ప్రకారం 75 ఏండ్లు దాటిన వారికి ఎలాంటి బాధ్యత అప్పగించరు.
PM Modi | పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒక ఆసక్తికరమైన చర్చను లేవనెత్తారు. అదేమిటంటే.. ‘బీజేపీ నియమం ప్రకారం 75 ఏండ్లు దాటిన వారికి ఎలాంటి బాధ్యత అప్పగించరు. 2024 ఎన్నికల్లో మోదీ తిరిగి అధికారంలోకి వస్తే ఏడాదిన్నర తర్వాత 75 ఏండ్లకు చేరుకుంటారు. పార్టీ నిబంధనల ప్రకారం మోదీని తప్పిస్తారు కదా! మరి మోదీ గ్యారెంటీ అని ఎన్నికల్లో ప్రధాని మోదీ ఇస్తున్న గ్యారెంటీలకు ఏడాదిన్నర తర్వాత ఎవరు గ్యారెంటీ?’ అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. అలాంటి నిబంధన ఏదీ లేదని బీజేపీ నాయకులు తప్పించుకున్నప్పటికీ.. ‘75 ఏండ్లు దాటినవారికి బాధ్యతలు అప్పగించం’ అని అంతకుముందు అమిత్ షా ప్రకటించిన వీడియోను ఆప్ ప్రచారంలోకి తీసుకువచ్చింది.
బీజేపీ 240 సీట్లకే పరిమితం కావడంతో రాజ్యాంగం బతికిపోయింది కానీ, ఎన్నికల ప్రచారంలో మోదీ, మీడియా చెప్పినట్టు ఒకవేళ 400 సీట్లు కనుక దాటి ఉంటే.. విపక్షం భయపడినట్టు రాజ్యాంగం కూడా ప్రమాదంలో పడేది. ఒకవేళ 75 ఏండ్ల నిబంధన ఆ పార్టీలో ఉన్నప్పటికీ రాజ్యాంగాన్నే ప్రమాదంలో పడేయగల వారికి దాన్ని తుంగలో తొక్కడం పెద్ద కష్టమేమీ కాదు. 75 ఏండ్ల నిబంధన ఎలా ఉన్నా.. వచ్చే ఎన్నికలకు మోదీ, అమిత్ షా ముఖాలతోనే బీజేపీ పోరాడుతుందా? కొత్త ద్వయం వస్తుందా? అనే చర్చ అయితే రాజకీయ వర్గాల్లో సాగుతున్నది. ఎంత గొప్ప నాయకుడైనా కావచ్చు, ఎంత చరిష్మాఅయినా ఉండవచ్చు. కాలం ప్రజల్లో మార్పు తీసుకువస్తుంది.
రెండు సార్లు బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చిన మోదీ చరిష్మా ఎంత ఎత్తుకు ఎదగాలో అంత ఎదిగింది. ఇప్పుడు కిందకు పడుతోంది. ఇక కిందకు దిగడమే తప్ప పైకి వెళ్లే అవకాశం లేదు. కొండలాంటి 303కు చేరుకున్న తర్వాత ఇప్పుడు 240కి పడిపోయింది. 2029లో ఇంకా కిందకు దిగడమే తప్ప పైకి వెళ్లడం ఉండదు.
అదే సమయంలో కాంగ్రెస్ 2019 కంటే ఇప్పుడు రెట్టింపు మెట్లు ఎక్కింది. వచ్చే ఎన్నికలకు దేశంలో ఎంతో కొంత బీజేపీ కిందకు దిగడం, కాంగ్రెస్ పైకి ఎదిగే అవకాశాలున్నాయి. మోదీ రెండోసారి గెలిచిన తర్వాత బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ సైతం తప్పులను ఎత్తి చూపలేని పరిస్థితి. మోదీ చివరికి తనను తాను దైవంగా భావించారు. తల్లి గర్భంలో అందరి మాదిరిగా జన్మించలేదు, ఏదో సాధించడానికి మానవ జన్మ ఎత్తినట్టు చెప్పుకొన్నారు.
ఎన్టీఆర్ తనను తాను దైవాంశ సంభూతునిగా భావించేవారు. తన కాళ్లు పట్టుకొని మొక్కినవాళ్లే బాబు నాయకత్వంలో 1995 వెన్నుపోటులో తనను అధికారం నుంచి దించేయడంతో కుమిలిపోయిన ఎన్టీఆర్‌కు తాను మానవ మాత్రుడినేనని అర్థమైంది. సరిగ్గా మోదీకి సైతం తాను తీవ్రంగా దుయ్యబట్టిన చంద్రబాబు, నితీశ్ కుమార్ల మద్దతుతో ప్రధాని పదవి చేపట్టవలసి రావడంతో తానేమీ దైవాన్ని కాదని, తానూ మనిషినేనని అర్థమైంది.
18వ లోక్‌సభ ప్రారంభ సమావేశాల్లో ప్రధాని మోదీ ఐదు దశాబ్దాల కిందట ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి మోదీ పదేండ్ల పాలనలో అంతకుమించిన అప్రజాస్వామిక చర్యలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేశారు. ప్రత్యర్థులపై ఈడీతో దాడులు చేయించడం, దాడులకు లొంగిపోయి పార్టీలో చేరితే స్వచ్ఛ భారత్, లొంగకపోతే జైలుపాలు చేయడం షరా మామూలైపోయింది. ఇవి ప్రజాస్వామ్యానికి మాయని మచ్చలు కాక కీర్తి కిరీటాలా?
నోట్లను రాత్రికి రాత్రే రద్దుచేసి కోట్లాది మంది ప్రజలను రోడ్డు పాలు చేయడం, ఎంతోమంది మరణానికి కారణం కావడం ప్రజాస్వామ్యానికి మచ్చనా? విజయమా? ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో మీడియాపై ఆంక్షలు విధించారు. మోదీ హయాంలో మీడియాను కొనేశారు. ఎన్డీటీవీ తనను వ్యతిరేకిస్తోందని అదానీతో ఆ ఛానల్నే కొనిపించారు. ఆంక్షలు విధించడం అప్రజాస్వామికమే, మరి వ్యతిరేకంగా రాస్తున్నారని ఛానల్నే కొనేసి దొడ్లో కట్టేసుకోవడం ప్రజాస్వామికమా? ధృవ్రాఠీ అని ఒక యూ ట్యూబర్ ఉత్తరాదిలో సృష్టించిన తుఫాన్ మామూలుగా లేదు.
ఎగ్జిట్‌పోల్‌లో ప్రధాన మీడియా మొత్తం బీజేపీకి 400కు పైగా సీట్లు ఇవ్వగా.. ధృవ్ రాఠీ లాంటి యూట్యూబర్స్ జనాభిప్రాయాన్ని ఎంతోకొంత ప్రపంచానికి తెలిపారు. మీడియాను తమ వారితో కొనిపించి గొంతు నొక్కడం అప్రజాస్వామికం కాదా? 240 సీట్లతో బ్రేక్ పడి ప్రజాస్వామ్యం బతికిపోయింది. కానీ, మీడియా చెప్పినట్టు 400 సీట్లు వచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది.
240 సీట్లకు బీజేపీ పరిమితం కావడంతో 2029 ఎన్నికలకు ఆ పార్టీ ఎవరి ముఖచిత్రంతో వెళ్తుందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతున్నది. ఆర్ఎస్ఎస్ సైతం బీజేపీకి కొత్త ముఖం కావాలని పట్టుబట్టే అవకాశం ఉన్నది. ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలని కోరుకుంటుంది. అధికారంలోకి రావడానికి మోదీ కంటే మెరుగైన ఛాయిస్ కోసం బీజేపీ, దాని మాతృ సంస్థ ఆలోచించడం సహజం. వచ్చే ఎన్నికలకు చాలా సమయం ఉందనిపించవచ్చు. అధికార పక్షమైనా, విపక్షమైనా తమకు ప్రజలు ముఖ్యం, వచ్చే ఎన్నికలు కాదని పైకి చెప్పవచ్చు. కానీ, ప్రతి రాజకీయ పక్షం, రాజకీయ నాయకుడు నిరంతరం ఆలోచించేది, వ్యూహాలు పన్నేది, పనిచేసేది రాబోయే ఎన్నికల కోసమే.
అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతున్నాయి. మోదీకి ప్రత్యామ్నాయంగా నితిన్ గడ్కరీ పేరు బాగా ప్రచారంలోకి వస్తున్నది. ఆర్ఎస్ఎస్ మనిషి, మచ్చలేని నాయకునిగా ఆయనకు పేరున్నది. జాతీయ రహదారుల నిర్మాణం ద్వారా దేశంలో గడ్కరీ మంచిపేరు సంపాదించుకున్నారు. 240 సీట్ల కంటే కిందకు దిగడం కన్నా మోదీకి బదులు గడ్కరీ లేదా మరో నాయకుని నాయకత్వంలో మెజారిటీ సాధించే ప్రయత్నం చేద్దామనే ఆలోచన బీజేపీకీ రావచ్చు. వచ్చే ఎన్నికల కోసమే నిరంతరం పనిచేసినా.. నాయకుడు ఎవరనేది ఇప్పుడే తేల్చక పోవచ్చు. ఎన్నికలకు ఏడాది ముందు కొత్త ముఖంతో బీజేపీ ఎన్నికలను ఎదుర్కొనే అవకాశం లేకపోలేదు.
– బుద్దా మురళి
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

