PM Modi | కేజ్రీపై మారని మోదీ తీరు
2019 పార్లమెంట్ ఎన్నికల్లో 303 సీట్లు గెలుపొందిన బీజేపీ.. తాజా ఎన్నికల్లో 240కి పడిపోవడంతో ‘అబ్ కీ బార్ చార్ సౌ పార్' అన్న ప్రధాని మోదీ శూన్య ప్రగల్భాలను కమలం పార్టీ మర్చిపోవాలని భావిస్తున్నది.
PM Modi | 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 303 సీట్లు గెలుపొందిన బీజేపీ.. తాజా ఎన్నికల్లో 240కి పడిపోవడంతో ‘అబ్ కీ బార్ చార్ సౌ పార్’ అన్న ప్రధాని మోదీ శూన్య ప్రగల్భాలను కమలం పార్టీ మర్చిపోవాలని భావిస్తున్నది. తన నిరంకుశ లక్ష్యాలను పంచుకోనటువంటి రెండు ప్రాంతీయ పార్టీల మద్దతుపై బీజేపీ సర్కారు ఆధారపడి ఉంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా 22 ఏండ్ల తన రాజకీయ జీవితంలో మొదటిసారి ప్రధాని మోదీ శాసించే స్థితికి దూరమయ్యారు. గతంలో ఎన్నడూ లేని ప్రస్తుత పరిస్థితుల్లో తన నిరంకుశ పాలనా శైలిని సర్దుబాటు చేసుకోగలరా? అన్నది ప్రశ్న.
ముఖ్యమంత్రిగా గానీ, ప్రధానిగా గానీ ఇదివరకు ఎన్నడూ చెప్పనిది, చేయనిది చేసేందుకు కూడా వెనుకాడరని ఈ స్థితి సూచిస్తున్నది. ఎందుకంటే, ఈ 22 ఏండ్లలో రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలిన ప్రతీసారి ఆయన స్పందన ఆవేశపూరితంగానే ఉన్నది.గడిచిన 22 ఏండ్లలో తన లక్ష్యానికి అడ్డువచ్చిన ప్రతిఒక్కరిపై ఆయన కోపాన్ని ప్రదర్శించారు.
2001లో గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్యాతో మొదలైన ఈ పరంపర కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా, మానవ హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాద్, గుజరాత్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆర్బీ శ్రీకుమార్ వరకు కొనసాగింది. ఈ క్రమంలో తన రాజకీయ ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను మోదీ వినియోగించారు. ఇప్పుడు మోదీ అత్యంత దుర్మార్గంగా తన కోపాన్ని ఆప్‌పై, ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్‌పై ప్రదర్శిస్తున్నారు.
2014లో ఢిల్లీలోని ఏడు లోక్‌సభ సీట్లను గెలుచుకున్న బీజేపీ.. ఆ తర్వాత 2015లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన అనంతరం కేజ్రీవాల్‌పై మోదీకి ఆగ్రహం మొదలైంది. 2019, 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ ఢిల్లీలోని అన్ని ఎంపీ సీట్లను బీజేపీ గెలుచుకున్నప్పటికీ కేజ్రీవాల్‌పై ఉన్న కోపం మాత్రం తగ్గలేదు. 2015 నుంచి ఈ తొమ్మిదేండ్లలో ఢిల్లీ సర్కార్‌ను అప్రతిష్టపాలు చేసే, ఆప్‌ను దేశ రాజధానిలో అధికార పీఠానికి దూరం చేసే మోదీ ప్రయత్నాలు ఏ మాత్రం ఆగలేదు. 2021లో ఢిల్లీ ప్రభుత్వం మద్యం పాలసీలో మార్పులు చేయడంతో మోదీ తనకు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అవకాశాన్ని పొందారు.
ఏటా ఢిల్లీ ఆదాయంలో 15-30 శాతం మద్యంపై విధిస్తున్న పన్నుల రూపంలో వస్తున్నది. అయితే దేశంలోని అత్యధిక పేద కుటుంబాలు మద్యం సేవించడాన్ని అసహ్యించుకుంటున్నాయి. ఢిల్లీలో 1970ల చివరి నుంచి మద్యం అమ్మకాలపై ప్రభుత్వ గుత్తాధిపత్యం నడుస్తున్నది. అంతేకాదు, మంత్రి, చట్టసభ సభ్యులు, ఆ శాఖ అధికారులకు అందే ముడుపులకు సంబంధించి ప్రధాన వనరులలో ఇది కూడా ఒకటి. అందువల్ల, ప్రభుత్వ గుత్తాధిపత్యానికి చరమగీతం పాడి, బహిరంగ వేలం ద్వారా మద్యం వ్యాపారాన్ని నిర్వహించాలని ఆప్ సర్కార్ నిర్ణయించుకున్నది. దీంతో ప్రజల దృష్టిలో ఆప్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు ఇదే మంచి సమయమని భావించిన మోదీ ప్రభుత్వం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నది.
2022 తొలి అర్ధ భాగంలో మోదీ తరఫున ఢిల్లీ ప్రధాన కార్యదర్శి నరేష్ కుమార్ మొదటగా ఆయుధాన్ని ఎక్కుపెట్టారు. అప్పటి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాకు నరేష్ కుమార్ లేఖ రాశారు. ఎక్సైజ్ మంత్రి సిసోడియా తీసుకున్న ఏకపక్ష నిర్ణయాల ఫలితంగా ఖజానాకు రూ.580 కోట్లకు పైగా నష్టం జరిగిందని ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా, లైసెన్స్ ఫీజులో తగ్గింపు, జరిమానాలపై మినహాయింపు ఇచ్చినందుకు గానూ మద్యం వ్యాపారులు, నిర్వాహకుల నుంచి ఢిల్లీ ప్రభుత్వం, ఆప్ నాయకులు ముడుపులు అందుకున్నారని అందులో పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని గోవా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేయడానికి ఉపయోగించారని ఆయన ఆరోపించారు. ఆప్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, రాజ్యసభ ఎంపీ జైలు శిక్ష అనుభవించడానికి మోదీ ప్రభుత్వం సృష్టించిన ఈ లేఖే పునాది.
అభియోగాలు మోపబడిన వ్యక్తుల నియంత్రణలో ఉన్న ఇళ్లు, కార్యాలయాలను ఈడీ తన ఆధీనంలోకి తీసుకున్నది. సోదాల పేరిట వాటిని తలకిందులు చేసింది. అయినప్పటికీ ఆప్ నేతలకు వ్యతిరేకంగా ఒక్క చిన్న ఆధారాన్ని కూడా సంపాదించలేకపోయింది. సంజయ్ సింగ్ బెయిల్
విచారణ సమయంలో సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని ప్రస్తావించింది.
మామూలుగా అయితే ఏ దర్యాప్తు సంస్థ అయినా ఆప్ నేతలపై ఉన్న కేసును చాలా కాలం క్రితమే మూసివేసేది. కానీ, నేషనల్ హెరాల్డ్ కేసులో ఆధారాలను సమర్పించడంలో విఫలమైన నాటి ఈడీ డైరెక్టర్ తీవ్ర పరిణామాలను ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు లేని కారణంగా సుబ్రమణ్యస్వామి వేసిన కేసును అప్పటి ఈడీ డైరెక్టర్ రాజన్ కటోచ్ మూసివేశారు. ఆ తర్వాత మోదీ అతన్ని పదవి నుంచి తొలగించారు.
అప్పటి నుంచి మోదీకి అనుగుణంగా పని చేయడంలో విఫలమైతే ఏం జరుగుతుందో ప్రతి ఈడీ అధిపతికి తెలుసు. దీని నుంచి ఇతరులు కూడా పాఠం నేర్చుకున్నారు. కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు వెలువరించిన నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు తొందరపాటుతో కొట్టివేయడం దీనికి ఒక వివరణ. కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు కాగానే ఈడీ ఢిల్లీ హైకోర్టుకు పరుగెత్తింది. మీడియాలో ఎత్తిచూపినట్టుగా రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును చదవకముందే, ఆ తీర్పు కాపీలను అందుకోకముందే, ఉద్దేశపూర్వకంగా న్యాయమూర్తి సుధీర్ కుమార్ జైన్ వారి వాదనను అంగీకరించారు. మద్యం వ్యాపారుల నుంచి అందుకున్నట్టు చెప్తున్న నగదుకు సంబంధించి మెటీరియల్ సాక్ష్యాలను సంపాదించడంలో విఫలమైన ఈడీ దక్షిణాది మధ్యవర్తులుగా పేర్కొంటున్న వ్యక్తులను ఆశ్రయించడంలో ఆశ్చర్యమేమీ లేదు.
కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేస్తుందనే భయంతో అదే నేరం కింద అతన్ని అరెస్టు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సీబీఐని తెరపైకి తీసుకొచ్చింది. చివరగా ఇద్దరు ప్రధాన ఇన్ఫార్మర్లు మాగుంట రాఘవ రెడ్డి, ఢిల్లీ వ్యాపారి దినేష్ అరోరా. సిసోడియాను అరెస్టు చేసిన సమయంలో అరోరా పోలీసుల అదుపులోనే ఉన్నాడు. తను చేసిన నేరాలకు గానూ క్షమాపణ పొందేలా హామీ తీసుకున్న తర్వాత అతను ఈడీ కోసం అప్రూవర్‌గా మారాడు. మాగుంట శ్రీనివాసులు, రాఘవ ఇద్దరిపై మొదట ఈడీ అభియోగాలు మోపింది. రాఘవరెడ్డి, దినేష్ అరోరాల వాదనలు ఎంత విశ్వసనీయంగా ఉన్నాయో ఈ కథనాన్ని చదివేవారు స్వయంగా నిర్ణయానికి రావచ్చు. 2023 అక్టోబరు 4న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో క్షమాపణ పొంది, అప్రూవర్‌గా మారిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇప్పుడు ఏపీకి చెందిన టీడీపీ ఎంపీగా ఉన్నారు.
కేజ్రీవాల్‌తో పాటు ఇతర ఆప్ నాయకులపై ఈడీ నమోదు చేసిన కేసు విచిత్ర లక్షణం ఏమిటంటే.. ఇంతకుముందు జరిగిన ప్రతి విచారణలోనూ ఏ కోర్టు అయినా సరే వారికి వ్యతిరేకంగా సాక్ష్యాలను సేకరిస్తున్నామనే కారణాన్ని చూపుతూ బెయిల్‌ను ఈడీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నది. వారిని విడుదల చేయడం అసాధ్యం కాకపోయినా, ఈ పరిణామాన్ని చాలా కష్టతరంగా మారుస్తున్నది. అయితే ఈడీ చెప్తున్నదే నిజమైతే.. కొత్త మద్యం పాలసీ వల్ల ప్రభుత్వం కోల్పోయిన ఎక్సైజ్ ఆదాయం, మద్యం వ్యాపారుల నుంచి ఆప్ పొందిన ముడుపుల గురించి కచ్చితమైన వివరాలతో లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాకు ప్రధాన కార్యదర్శి నరేష్ కుమార్ ఎలా లేఖ రాయగలిగారు? 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కోసం గోవాకు తరలించిన డబ్బు ఎంత?
ఆమోదయోగ్యమైన వివరణ
దీనికి రెండు సమాధానాలు మాత్రమే ఉన్నాయి. నరేష్ కుమార్ లేఖలో ఉన్న విషయం మోదీ ప్రభుత్వం సృష్టించిన కట్టుకథ. లేదా అందులో ఉన్న సమాచారం సరిపోదని, అస్పష్టంగా ఉందని, ప్రత్యక్ష సాక్ష్యాధారాలతో దాన్ని బలపరచాల్సిన అవసరం ఉందని ఈడీ భావించి ఉండవచ్చు. వీటిలో మొదటిది చాలా ఆమోదయోగ్యమైన వివరణ.
కొత్త మద్యం పాలసీ వల్ల ఎక్సైజ్ డ్యూటీ ఆదాయానికి నష్టం వాటిల్లలేదు సరికదా ఆదాయం రెట్టింపు అయింది. గత విధానం ప్రకారం.. మద్యం విక్రయానికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం హోల్‌సేలర్, రిటైలర్‌గా ఉండేది. తయారీదారుకు వారి ఎక్స్ ఫ్యాక్టరీ ధరకు 5 శాతం చెల్లించి, మద్యంపై ప్రభుత్వం నియంత్రణను తీసుకుంది. రిటైల్ అవుట్లెట్లకు సరఫరా చేసే వరకు రవాణా, నిల్వ ఖర్చులను కూడా ప్రభుత్వమే భరించేది. రిటైల్ అవుట్లెట్లు కూడా ప్రభుత్వ నియంత్రణలోనే ఉండేవి. ఈ బ్యూరోక్రాటిక్ గుత్తాధిపత్యం అనేక లోపాలను కలిగి ఉండేది.
కొత్త పాలసీ ద్వారా ఏడాదికి ప్రభుత్వానికి పన్నులు, లైసెన్ల రూపంలో రూ.10 వేల కోట్ల కంటే ఎక్కువ ఆదాయం వస్తుందని.. తన పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ అధికారి హిందుస్థాన్ టైమ్స్‌తో చెప్పారు. ఇది గత మూడేండ్ల సగటు ఆదాయం రూ.5,500 కోట్ల కంటే దాదాపు రెట్టింపు.
చివరగా ఆప్ నేతలకు వ్యతిరేకంగా సాక్ష్యాలను సేకరించడానికి ఈడీ గడిపిన కాలంలో.. మీడియాలో ఎవరూ అన్నింటికంటే ముఖ్యమైన ప్రశ్నను అడగలేదు. హోల్‌సేలర్లు, రిటైలర్ల ఎంపిక రెండూ బహిరంగ వేలం ద్వారా జరిగినప్పుడు.. అసలు అక్కడ అవినీతి జరగడానికి ఆస్కారం ఎక్కడ ఉంది? ఆప్ నేతలను జైలులో పెట్టిన నాటి నుంచి ఈ ప్రశ్నను ఏ వార్తాపత్రిక గానీ, టీవీ వ్యాఖ్యాత గానీ అడగలేదు. భారతీయ మీడియాపై ఇదొక చెరగని మచ్చ.
(‘ది వైర్’ సౌజన్యంతో)
-ప్రేమ్ శంకర్ ఝా
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
- Tags
- AAP
- Aravind Kejriwal
- cbi
- Pm Modi
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
France Riots: పారిస్‌లో 350 మందికిపైగా అరెస్టు.. అల్లర్లను నియంత్రించలేకపోయామన్న మంత్రి
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

