మోదీ ఎదురుదాడి పని చేస్తుందా?
ప్రధాని మోదీ పట్ల ప్రజల విశ్వాసం తగ్గటం 2024 లోక్‌సభ ఎన్నికల నుంచే మొదలై ‘సర్' పేరిట కోట్లాది మంది ఓట్లను మాయం చేయడంతో పుంజుకుంటుండగా, ఆయన తన విమర్శకులపై ఎదురుదాడి ప్రారంభించారు.
ప్రధాని మోదీ పట్ల ప్రజల విశ్వాసం తగ్గటం 2024 లోక్‌సభ ఎన్నికల నుంచే మొదలై ‘సర్’ పేరిట కోట్లాది మంది ఓట్లను మాయం చేయడంతో పుంజుకుంటుండగా, ఆయన తన విమర్శకులపై ఎదురుదాడి ప్రారంభించారు. ఆ పని పోలీసు అణచివేత రూపంలో విజయవంతంగా సాగుతున్నది గానీ, ప్రజల విశ్వాసం మరింత సన్నగిల్లుతున్నది. ఆయన మాత్రం అధికార దాహాన్ని తగ్గించుకోవటం, ధోరణిని మార్చుకోవడం చేయడంలేదు.
ఆయనతోపాటు తన పార్టీ అయిన బీజేపీ మాతృసంస్థ సంఘ్ పరివార్ కూడా ఈ ఎదురుదాడిలోకి ప్రవేశించాయి. ఆ కార్యక్రమం ఏ విధంగా సాగుతున్నదో చూసి, అది ఏ మేరకు విజయవంతం కాగలదో విచారించాలి. ‘సర్’ పట్ల విమర్శలు, నిరసనలు నిరుటి నుంచే మొదలయ్యాయి. వాటిని పై ముగ్గురు అప్పుడు అంతగా లెక్కచేయలేదు. తమ వ్యూహం ప్రకారం ఆ దొంగ ఓట్లతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తూ పోయి అంతటితో సంతృప్తి చెందారు. ప్రతిపక్షాలకు ప్రజల్లో కొంతకాలం నమ్మకం పోతుండటం బీజేపీకి కలిసివచ్చి, వారి నిరసనలకు అంతగా బలం చేకూరలేదు.
సర్ విషయమై ఎన్నికల సంఘం సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాల వార్తలు ఇటీవల వెల్లడి కావడం, దానిపై కాక్రోచ్ల రంగప్రవేశంతో అందుకు ఒకేసారి ఊపు వచ్చిం ది. ఆ వార్తలు అందరికీ దిగ్భ్రాంతికరం కావడం ఒకటైతే, నీట్ పేపర్ లీక్ ఆందోళనను పురస్కరించుకొని కాక్రోచ్ల పట్ల యువత, ప్రజలకు గురి కుదరటం మరొకటి అయింది. ఆ విధంగా వచ్చిన ఊపులో కాంగ్రెస్ తదితర ప్రతిపక్షాలు కూడా భాగస్వాములై, మొత్తం మీద దేశమంతటా పెద్ద కదలికను తెచ్చాయి. దీనంతటి పర్యవసానంగా వ్యక్తిగతంగా మోదీతోపాటు ఆయన ప్రభుత్వం, అధికారపక్షం, సంఘ్ పరివార్, సుప్రీంకోర్టు సైతం ఉక్కిరిబిక్కిరి కాసాగాయి.
ఇటువంటి పరిస్థితి సాధారణ సమయాల్లో ఎదురుకావటం వేరు. వచ్చే సంవత్సరం పలు అసెంబ్లీలకు ఎన్నికలు జరగనుండగా ముందుకు రావడం వేరు. 2029 లోక్‌సభ ఎన్నికలకు ముం దు ఇవి మధ్యంతర ఎన్నికల వంటివి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ అతి ప్రతిష్ఠాత్మకంగా మారింది. 2027 ఆరంభంలో జరుగనున్న మొదటి ఎన్నికలు అక్కడనే. ఉత్తరప్రదేశ్‌ను బీజేపీ, సంఘ్ పరివార్లు తమకు పెట్టని కోటగా పరిగణిస్తాయి.
పశ్చిమాన గుజరాత్, తూర్పున అస్సాం వంటిదే అది కూడా. పైగా రామమందిరం ఉన్నది అక్కడ. 80 లోక్‌సభ సీట్లతో యూపీ, 40తో బిహార్ మోదీ అధికారానికి అతి కీలకం. అటువంటిది యూపీ స్థానాలు 2024లో గణనీయంగా తగ్గి భయపెట్టాయి. 2019 నాటి 62 సీట్లు 2024లో 33కు పడిపోయాయి. దేశమంతటా కలిపి 2019లో వచ్చిన సొంత మెజారిటీ కాస్తా కోల్పోయారు. 303 స్థానాలు కాస్తా 240కి తగ్గడం వారిని భయపెట్టడం సహజం.
‘సర్’ పన్నాగాల వెనుక ఈ పరిణామాలన్నీ ఉన్నందువల్లనే, 2029 ఎన్నికలు వారందరికీ అత్యంత ప్రతిష్టాత్మకం అయ్యాయి. ఇంకా చెప్పాలంటే జీవన్మరణ సమస్య వంటిదన్నమాట. ఆ సమస్య నుంచి గట్టెక్కేందుకు తెలివిగా ‘సర్’ పథకాన్ని రూపొందించి అంతే తెలివిగా అమలు పరుస్తున్న సమయంలో అందుకు భంగకరం కాగల గత కొద్ది నెలల పరిణామాలను మోదీ ప్రభుత్వం, బీజేపీ, సంఘ్ పరివార్ సహించలేకపోయాయి. ఉద్యమం ఉధృతంగా సాగుతుండిన వారాల్లో తీవ్రమైన అణచివేతకు పాల్పడటం వారి ఎదురుదాడిలో మొదటి భాగమైంది.
ఉద్యమ ఉధృతి వేర్వేరు కారణాల వల్ల ప్రస్తుతం కాస్త మందగించడంతో తమ ఎదురుదాడిలో రెండవ భాగాన్ని మొదలుపెట్టారు. అది నిరసనకారులపై వ్యతిరేక ప్రచారాల రూపంలో ప్రస్తుతం సాగుతున్నది. ‘కాక్రోచ్లు, ఇతరత్రా యువతీ యువకులను అరాచకవాదులు, దేశద్రోహులు, పాకిస్థాన్ ఏజెంట్లు, వారికి విదేశాల నుంచి నిధులు అందుతున్నాయి’ అని అన్నారు.
భారతదేశం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందడాన్ని సహించలేని విదేశాలు అందుకు భంగం కలిగించేందుకు ఇదంతా జరిపిస్తున్నాయని, ఇదంతా కమ్యూనిస్టులు, ముస్లిముల కుట్రగా ఆరోపించారు. ఇలాంటి ప్రచారాలను వీరంతా నిస్సిగ్గుగా మొదలుపెట్టారు. ఈ మాటలు కిందిస్థాయి శ్రేణులతో అనిపించడం వేరు. కానీ సాక్షాత్తు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సైతం ఈ ఎదురుదాడి సాగిస్తున్నారు. దానిని బట్టి వారెంత ఒత్తిడికి లోనవుతున్నారో గ్రహించవచ్చు. ఇది అంతటివారే మొదలుపెట్టడంతో తర్వాత స్థాయి నాయకులు, కార్యకర్తలకు ఆవేశాలు పుట్టుకొస్తున్నాయి. అందరూ మౌఖికమైన ఎదురుదాడికి పరిమితం కాకుండా, రచనలు, వీధి ప్రదర్శనలు, సభలు కూడా జరుపుతున్నారు.
ఇంతకూ వ్రతం చెడినా ఫలం దక్కుతుందా? అనేది అసలు ప్రశ్న. వ్రతమన్నది ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, ఎన్నికల సంఘం నియమ, నిబంధనలు, నైతికతకు కట్టుబడటం. ఇంకా చెప్పాలంటే వారు హిందూ ధర్మమని, భారతీయ సంస్కృతి అని విసుగులేకుండా చేసే వల్లింపుల ప్రకారం వ్యవహరించడం. వారు తమ అధికార పరిరక్షణ కోసం చేస్తున్న చేష్టలన్నీ వీటన్నింటికీ భంగకరమైనవే. వ్రతం చెడటమన్నది అదే. ఆ విధంగా పతనమైనా కనీసం ఫలం దక్కడమంటే వచ్చే సంవత్సరపు అసెంబ్లీల ఎన్నికలు, తర్వాత 2029లో లోక్‌సభ ఎన్నికలు గెలిచే అధికారాన్ని దక్కించుకోవడం.
ఇందులో రెండు పార్శాలున్నాయి. ఒకటి ప్రభుత్వాధికారం కాగా, రెండవది ప్రజల్లో విశ్వసనీయత, గౌరవ మర్యాదలు. ఈ రెండూ ఇటీవలి పరిణామాల వల్ల దేశంలోనే గాక యావత్తు ప్రపంచంలో ప్రశ్నార్థకమయ్యాయి. అధికారం మాట ఎట్లున్నా రెండవది మాత్రం ఇక తిరిగి రాగల అవకాశం కన్పించడంలేదు. ఓటరు లిస్టుల అవకతవకలు, వాటి ఆధారంగా గెలువటాలు, ప్రశ్నించిన వారిని క్రూరంగా అణచివేయడం అందరినీ నిర్ఘాంతపరచగా, విశ్వగురువు ప్రతిష్ట ఒక్కసారిగా మట్టిలో కలిసిపోయింది, పాతాళానికి కుంగిపోయింది.
ఇప్పుడు ప్రచారాల ఎదురుదాడులు పరిస్థితిని మెరుగుపర్చకపోగా, మోదీ గౌరవ ప్రతిష్టలు, విశ్వసనీయతను మరింత దెబ్బతీస్తున్నాయి. 1975లో ఎమర్జెన్సీని విధించిన ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమర్శలకు జడిసి వెనుకడుగు వేశారుగానీ, నరేంద్రమోదీ అంతకుమించిన విమర్శలను కూడా లెక్కచేయడంలేదు. ప్రతీ ఎమర్జెన్సీ దినం రోజున మోదీ, తన పార్టీ, సంఘ్ పరివార్ ఇందిరాగాంధీ అప్రజాస్వామికత, నియంతృత్వాన్ని ఖండించడం ఒక విచిత్రం.
ఈ విధంగా మోదీ ప్రతిష్ట అయితే తిరిగిరాని విధంగా చారిత్రకంగానే మంటగలువగా, కనీసం రానున్న ఎన్నికలనైనా గెలువగల అవకాశాలేమిటన్నది రెండవ ప్రశ్న. అనగా వ్రతం చెడినా ఫలం దక్కడమన్నమాట. ఇప్పుడు కనిపిస్తున్న పరిస్థితుల మధ్య అది కూడా అనుమానాస్పదంగా తోస్తున్నది. అనగా, ఎదురుదాడి వ్యూహం పని చేయకపోగా ఎదురుతిరగడమన్నమాట. అట్లా భావించడమెందుకో చూడాలి.
అన్నింటికన్నా ముందు చెప్పుకోవలసింది, పైన అనుకున్నట్టు మోదీ పట్ల ప్రజలు, యువతరం విశ్వసనీయత దెబ్బతినడం. తాత్కాలికంగా కాకుండా దీర్ఘకాలికమన్నట్టు. ఇది ఒక్కసారిగా జరిగితే ఇక ఆయన చేస్తున్నాననే అభివృద్ధి వగైరాలు అంతగా లెక్కలోకి రావు. హిందూత్వ, జాతీయవాదం, ముస్లిముల పేరిట జరిగే ప్రచారాల ప్రభావం గతంలో వలె ఉండదు. ఈ రెండు సూచనలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. నిరసనకారులు న్యాయబద్ధమైన డిమాండ్లు, పూర్తిగా శాంతియుత నిరసనలను తొక్కివేస్తూ ఎదురుదాడికి పాల్పడటం అందరి మనస్సులు, మేధస్సులపై చెరగని గాయాన్ని, ముద్రలను వేస్తున్నది. ఇంతకాలం మద్దతుదారులుగా ఉండిన వారు సైతం బీజేపీకి దూరమవుతుండటం ఒక ప్రమాద సూచీ. దొంగ ఓట్లతో గెలువజూసే వారిని ఎవరూ గౌరవించరు, ఆమోదించరు. యువతరం ధిక్కరించిన ఏ పాలకులూ నిలువలేరు. తమకు రకరకాల ముద్రలు వేయజూడటం యువతీ యువకులను తీవ్రంగా గాయపరుస్తున్నది. కనుక, ఎదురుదాడి అనే బీజేపీ అసమర్థపు వ్యూహం పని చేయగల అవకాశం కనిపించడంలేదు.
-టంకశాల అశోక్
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

