Telangana | తెలంగాణపై చెరగని సంతకం
పాలకులు వస్తుంటారు, పోతుంటారు. కానీ, కొంతమందే ప్రజల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకుంటారు.
పాలకులు వస్తుంటారు, పోతుంటారు. కానీ, కొంతమందే ప్రజల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకుంటారు. అనితర సాధ్యమనుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేయడమే కాకుండా, తెలంగాణ వస్తే ఏమొస్తుందని అనుకున్నామో వాటిని కండ్లముందే ఆవిష్కరించారు, తెలంగాణ చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్నారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. ఒక వ్యక్తి కాని, వ్యవస్థ కాని గొప్ప పేరు సంపాదిస్తే వాళ్లను తక్కువగా చూపించి, వారిపై బురద చల్లాలని కొందరు కుయుక్తులు పన్నుతూనే ఉంటారు. మరీ ముఖ్యంగా రాజకీయాల్లో.
Telangana | కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని మరిపించి.. కాళేశ్వరంలో అవినీతి అంటూ సీఎం రేవంత్‌రెడ్డి సహా మంత్రులు కేసీఆర్‌పై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కొత్తగా గెలిచాం, ప్రజలకు ఏమైనా మంచి పనులు చేద్దాం అన్న సోయిని మరిచి, ఎదురుదాడికి దిగేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ హయాంలో ఓ వైపు అభివృద్ధి, మరో వైపు సంక్షేమంలో ముందుకు సాగుతుండగా.. గోరంత సమస్యలను కొండంతగా చూపించి, విష ప్రచారం చేయడం మూలంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఎదురుదెబ్బ తగిలింది. ‘మనం మంచి చేస్తున్నాం కదా, వాళ్లు చెడుగా చెప్పినంత మాత్రాన అయ్యేదేమున్నది, ప్రజలు వాళ్ల మాటలు నమ్ముతారా’ అని అనుకోవడం మూలంగా జరగరాని నష్టం జరిగింది బీఆర్ఎస్కు, తెలంగాణకు. చెడుతో సమాంతరంగా మంచి కూడా ప్రచారం చేస్తూనే ఉండాలని అంటారు రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్.
అయితే ఎవరెన్ని విమర్శలు చేసినా సత్యం ఎన్నటికీ సత్యమే అవుతుంది. తెలంగాణలో వందేండ్లలో జరగని అభివృద్ధి కేసీఆర్ పాలనలో 9 ఏండ్లలోనే జరిగిందనేది వాస్తవం. రైతుబంధు స్థానంలో రైతు భరోసా ఇస్తామని చెప్పి చేతులెత్తేసిన రేవంత్ సర్కార్ రూ.2 లక్షల రుణమాఫీ అంటూ ఇప్పుడు ఊదరగొడుతున్నది. వాస్తవానికి కేసీఆర్ పాలనలో రెండుసార్లు రుణమాఫీ జరిగింది. మొదటిసారి 35.31 లక్షల మంది రైతులకు రూ.16,144 కోట్లు, రెండవసారి 22.98 లక్షల మంది రైతులకు రూ.13,000 కోట్ల పంట రుణాలు మాఫీ అయ్యాయి. రేవంత్ సర్కార్ రూ.లక్ష వరకు రుణమాఫీ అంటూ ఆంక్షలు పెట్టి రైతుల సంఖ్యను కుదిస్తున్నది. 11.42 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.6098 కోట్ల రుణాన్ని మాత్రమే మాఫీ చేసింది. ‘మూడు రంగుల జెండా పట్టి సింహమోలే కదిలినాడు.. మా రేవంతన్న’ అంటూ మురిసి ఓట్లేసిన వారు నేడు కంగుతింటున్నారు.
రోహిణి కార్తె వచ్చింది. గతంలో ఈపాటికే రైతుబంధు డబ్బులు పడ్డాయా? అని రైతులు ఫోన్ల వైపు చూసేవారు. ఎలాంటి మెసేజ్ వచ్చినా ఖాతాలో డబ్బులకు సంబంధించి మెసేజ్ వచ్చిందేమో అని చూసేవారు. కానీ, కాంగ్రెస్ పాలనలో ఇప్పటివరకు రైతుబంధు పైసలు జమకాలేదు. రైతు బిడ్డ కేసీఆర్ అహర్నిశలు రైతుల బాగోగుల గురించే అలోచించేవారు. తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల గురించి కాబట్టి, వాటిని అమలు చేయడానికి శాయశక్తులా కృషి చేశారు. కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా రైతులకు మాత్రం రైతుబంధు ఆపలేదు. వానకాలం, యాసంగిలో పంట సాగు సమయంలో రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమచేసేవారు. కేసీఆర్ పాలనలో పురుడుపోసుకున్న రైతుబంధు, రైతు బీమా పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయి. అయితే మాటలు కోటలు దాటుతున్నాయి కాని చేతలు గడప దాటనట్టుంది రేవంత్ పాలన. కరెంటు, సాగునీటి కష్టాలకు తోడు పంట పెట్టుబడి సాయం అందని ద్రాక్షగానే మిగిలింది. గత యాసంగి సీజన్ రైతుబంధు వానకాలంలో విడుదల చేశారు. ఇక వానకాలం రైతు బంధు ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఏడు నెలల్లోనే ఏం కోల్పోయామో ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. నిరుద్యోగుల ఆందోళనలు షురూ అయ్యాయి. గడీల పాలన, దొరల పాలన, మద్యం ఏరులై పారుతుందంటూ ఊదరగొట్టిన యూట్యూబ్ చానళ్ల దుష్ప్రచారాన్ని ప్రజలు నేడు అసహ్యించుకుంటున్నారు.
ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి పదేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో ఒకసారి అవలోకనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రత్యేక రాష్ట్రం కోసం పదవిని త్యజించి, పిడికెడు మందితో ఉద్యమాన్ని ప్రారంభించి, ప్రతిఒక్కరిని ఉద్యమంలోకి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌ది. నాటి ఉద్యమంలో నేటి ముఖ్యమంత్రి రేవంత్ పాత్ర సున్నా. బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పదవిని పట్టుకొని వేలాడారు. ఈ రోజు నీతులు చెప్తున్న కాంగ్రెస్ నాయకులు నాడు అసువులు బాసిన అమరులకు కనీసం నివాళి కూడా అర్పించలేకపోయారన్న విషయాన్ని మరిచిపోరాదు. కేసీఆరే లేకుంటే, తెలంగాణ సాధించుకోకుంటే నేడు కొలువుతీరిన నాయకు లు ఎక్కడ ఉండేవారో. తెలంగాణను సాధించి, కేసీఆర్‌తో పాటు మిగతా వారికి సైతం ప్రత్యేక గుర్తింపు ఇచ్చిన విషయం మరువరాదు.
‘తెలంగాణ వస్తే కారు చీకట్లే, కరెంటు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు. మీకు పాలన చేత కాదు’.. ఇలా ఒక్కటేమిటి పోతూ పోతూ సమైక్య పాలకులు ఇక్కడి ప్రజల్లో ఆందోళన, అలజడి రేపుతూ వెళ్లారు. అయితే ఏడాది పాటు కరెంటు కష్టాలు ఉంటాయని, తర్వాత మూడు నాలుగేండ్లలో 24 గంటల కరెంటు సరఫరా చేసుకుంటామని కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే మొదట్లోనే చెప్పారు. అన్నట్టుగానే 24 గంటల కరెంటు సరఫరా చేసి సరికొత్త చరిత్ర సృష్టించారు కూడా.
తెలంగాణలో గతంలో తాళిని సైతం కుదువ పెట్టి పెట్టుబడులు సమకూర్చుకున్న రైతుల దయనీయ జీవితాలు పల్లెపల్లెన కనిపించేవి. అలాంటి పరిస్థితుల్లో చీకట్లను చీల్చుకుంటూ వచ్చే ఉషోదయపు వెలుగులా కేసీఆర్ రైతులకు అండగా నిలిచారు. రైతు బంధు పథకం రైతులకు కొండంత అండగా నిలిచింది. రైతుబంధు ద్వారా తెలంగాణలో లక్షల మంది రైతులకు కోట్లాది రూపాయలు అందించారు. అలాగే వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు అందించారు. రైతు కుటుంబాలకు అండగా ఉండటానికి పక్కా ప్రణాళికతో దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బీమా పథకాన్ని కేసీఆర్ ప్రారంభించారు. రైతు మరణిస్తే వారం రోజుల్లో నామినీకి రూ.5 లక్షల బీమా వచ్చే విధంగా చేశారు. అధికారుల చుట్టూ తిరగకుండా, నయాపైసా ఖర్చు లేకుండా భూమి పట్టా చేసుకునే వీలు ధరణితో కలిగింది. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్, నల్గొండ జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు తీరాయి. ప్రాజెక్టుల ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందించారు. రైతు సమస్యలను చర్చించి, పరిష్కరించడానికి రైతు సమన్వయ సమితిలు ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వందలాది రైతు వేదికలు నిర్మించారు. నీటి తీరువాను రద్దు చేయడంతో పాటు పంట ధాన్యాలకు మద్దతు ధర అందించారు. ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ధాన్యం నిలువ కోసం పెద్దఎత్తున గోదాములను నిర్మించారు. బిందు సేద్యంతో పాటు, పాలీహౌజ్, గ్రీన్‌హౌజ్‌ల నిర్మాణం కోసం కృషి చేశారు. వరి దిగుబడిలో పదేండ్లలోనే పంజాబ్‌కు దీటుగా నిలిచింది తెలంగాణ.
‘సంపద పెంచు, ప్రజలకు పంచు’ అనే నినాదంతో కేసీఆర్ ముందుకు సాగారు. ఉమ్మడి పాలనలో పింఛన్ రూ.200 మాత్రమే ఉండగా, వితంతువులు, వృద్ధులకు రూ.2016, దివ్యాంగులకు రూ.4016 అందించి పేదల గుండెల్లో నిలిచిపోయారు కేసీఆర్.
తెలంగాణ రాకతో సింగరేణి దశ దిశ మారిపోయింది. సింగరేణి టర్నోవర్ రూ.12 వేల కోట్ల నుంచి రూ.33 కోట్లకు చేరింది. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమానికి నిదర్శనంగా జాతీయ అవార్డులు వచ్చాయి. గురుకుల పాఠశాలలను గణనీయంగా పెంచడంతో పాటు డైట్ చార్జీలు పెంచి విద్యార్థులకు ప్రోత్సాహం అందించారు. మన ఊరు- మన బడి ద్వారా పాఠశాలల అభివృద్ధి, ఐటీ పరిశ్రమలు, జిల్లాకు ఒక వైద్య కళాశాలల ఏర్పాటు, కంటి వెలుగు, డయాలసిస్ సౌకర్యం, బస్తీ, పల్లె దవాఖానలు, కేసీఆర్ పోషకాహార కిట్లు, హైదరాబాద్ నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, 4 లక్షల మంది గిరిజనులకు పోడు పట్టాలు, అన్ని హంగులతో సచివాలయం, యాద్రాద్రిని గొప్ప క్షేత్రంగా తీర్చిదిద్దడం, అనాథలకు చేయూత ఇలా ఎన్నో కార్యక్రమాలకు కేసీఆర్ శ్రీకారం చుట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణను దేశంలోనే నెం.1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన కేసీఆర్ తెలంగాణపై చెరగని సంతకం చేశారు.
– జీడిపల్లి రాంరెడ్డి 96666 80051
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
చండ్రుగొండలో నీట మునిగిన పంట పొలాలు
BJP leader’s son dies by suicide | బీజేపీ నేత కుమారుడు ఆత్మహత్య.. భార్య వేధింపులపై వీడియో
విద్యార్థులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి : శశిధర్ శర్మ
Vocational Trainers | 12 నెలల జీతాల్లేవ్.. సెక్రటేరియట్ ముందు ఒకేషనల్ ట్రైనర్ల ఆందోళన.. వీడియో
Cancer | క్యాన్సర్‌ను నయం చేస్తామంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

