అంతరిక్షాన్ని అతిథిగా చేసుకొని
మానవుడు రహస్యాలను రాబట్టినా
కడలి గర్భాన్ని సైన్స్ కవ్వంతో చిలికి
సిరుల గుట్టును రట్టు చేసినా
పుడమి తల్లి పొతిళ్లలోని పుటలను
తిరిగేసి భవితకు బాటలు వేసినా
మనిషి మాత్రం మూఢ నీడల్లో నలుగుతూ
అనుమానపు కొవ్వొత్తయి కరుగుతున్నాడు
కాలం నూతన రెక్కలు కట్టుకొని
లేడి పిల్లలా పరుగెడుతుంటే
సనాతన ముసుగును కప్పుకొని
మానవుడు నేల చూపులు చూస్తున్నాడు
జీవిత గమనాన్ని గ్రహగతులతో ముడిపెట్టి
తిరోగమనానికి తివాచీలు పరుస్తున్నాడు
మానవత్వాన్ని మంటల్లో కాల్చేసి
గుడి చుట్టూ బొంగరంలా తిరుగుతున్నాడు
జన్మకర్తల జీవిత గాలిపటాలను గాలికొదిలేసి
కనిపించని దేవుళ్లకు నైవేద్యాలు పెడుతున్నాడు
అవసరాల అంతస్థులను పెంచుకుంటూ
సన్మార్గపు సడుగును వదిలి కత్తుల
మొనలపై శత్రువులను వేలాడదీస్తున్నాడు
చమట చుక్కలను చిందించకుండా
చిలక జోస్య వంతెనపై నడుస్తున్నాడు
పరులపై విషపు వలలను విసురుతూ
గవ్వల జాతకాన్ని ఘనంగా నమ్ముతున్నాడు
హస్త రేఖలను అస్తమానం నమ్ముతూ
మనిషి తన అస్తిత్వాన్ని కోల్పోతున్నాడు…