Lok Sabha Elections | సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ అభివృద్ధికి ఆటంకం
భారత పార్లమెంటు ఎన్నికల కథ మార్చి 16న మొదలైంది. భారత ఎన్నికల కమిషన్ 18వ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ 70 రోజుల కిందట ప్రకటించగా శనివారం ఆరో దశ పోలింగ్ ముగిసింది.
Lok Sabha Elections | భారత పార్లమెంటు ఎన్నికల కథ మార్చి 16న మొదలైంది. భారత ఎన్నికల కమిషన్ 18వ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ 70 రోజుల కిందట ప్రకటించగా శనివారం ఆరో దశ పోలింగ్ ముగిసింది. చివరి ఏడో దశ పోలింగ్ జూన్ 1న ముగిస్తే రెండు రోజుల తర్వాత 4వ తేదీ ఉదయం ఓట్ల లెక్కింపు మొదలై దాదాపు అదే రోజు ఫలితాలన్నీ వెలువడతాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ జూన్ 4 వరకూ కొనసాగుతుంది. దేశంలో 142 కోట్లకు పైగా జనాభా ఉంటే, 97 కోట్ల మందికి పైగా ఓటర్లున్నారు. అయితే సాధారణ ఎన్నికల ప్రక్రియ రెండున్నర నెలలకు పైగా సాగడం భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఎలాంటి వింత మార్గంలో పయనిస్తున్నదో సూచిస్తున్నది. మండు వేసవిలో జనం ఓట్లు వేయడం ఒక ఎత్తయితే, ఇంత సుదీర్ఘకాలం పాటు కొత్త కార్యక్రమాలు ప్రకటించకుండా, ప్రారంభించకుండా ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారడం ఇబ్బందికరమైన అంశమే.
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేర్కొనే ఇండియాలో ఎన్నికల బందోబస్తుకు వెళ్లే సాయుధ బలగాల తరలింపు కోసమే ఆరు దశలకు పైగా పోలింగ్‌తో ఇంతటి సుదీర్ఘ ప్రక్రియను అమలు చేయక తప్పడం లేదని కేంద్ర ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. సమాచారం క్షణాల్లో ఖండాలు దాటి ప్రసరించే డిజిటల్ యుగంలో కూడా దాదాపు 80 రోజులకు పైగా సాగే ఈ ఎన్నికల యజ్ఞం హేతుబద్ధంగా లేదనే బలమైన వాదన నేడు వినిపిస్తున్నది. ఇండియా తర్వాత ఎక్కువ మంది ఓటర్లున్న అమెరికాను ప్రపంచంలో అతిగొప్ప ప్రజాతంత్ర రాజ్యంగా పిలుస్తారు. 18వ శతాబ్దం చివరలో స్వాతంత్య్రం సంపాదించుకున్న అమెరికాలో 1789 నుంచి ఆచరణలోకి వచ్చిన రాజ్యాంగం స్వల్ప మార్పులతో ఇప్పటికీ అమలులో ఉన్న మాట నిజమే. అయితే మారుతున్న కాలానికి, రూపుదిద్దుకుంటున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఎన్నికల ప్రక్రియలో, పద్ధతుల్లో గణనీయ మార్పులు వచ్చాయి.
అమెరికా రాజ్యాంగం ప్రకారం ప్రతి లీప్ సంవత్సరం నవంబర్ మాసంలో మొదటి సోమవారం తర్వాత వచ్చే మంగళవారం రోజున అక్కడి అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఇలాంటి కొన్ని పద్ధతులు మనకు వినడానికి వింతగా కనిపించినప్పటికీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నటికీ మారని కొన్ని విలువలకు ఇవి అద్దం పడుతున్నాయి. ఎన్నికల ప్రజాస్వామ్యంలో అత్యంత కీలక దశ అయిన ఓట్ల లెక్కింపు పోలింగ్ రోజున ఆ ప్రక్రియ ముగిసిన వెంటనే అమెరికాలో మొదలవుతుంది. అమెరికాలోనే కాదు, అనేక ఐరోపా, ఆసియా దేశాల్లో కూడా ఇదే పద్ధతిని పార్లమెంటు, అధ్యక్ష ఎన్నికల్లో పాటిస్తున్నారు. మనకేమో మొదటి దశ పోలింగ్ ముగిసిన 45 రోజులకు ఫలితాలు వెలువడతాయి.
బీజేపీకి సొంతంగా మెజారిటీ వస్తుందా? రాదా? అనేదే ఎడతెగని చర్చనీయాంశం!: జాతీయ ప్రధాన స్రవంతి న్యూస్ టెలివిజన్ చానళ్ల నుంచి ప్రాంతీయ వార్తా చానళ్ల వరకూ, ఇంకా వందలాది యూట్యూబ్ చానళ్ల వరకూ మూడో దశ పోలింగ్ పూర్తికాక ముందునుంచే పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై చర్చోపచర్చలు, అంచనాలు, విశ్లేషణలతో ప్రజలకు అయోమయంతో కూడిన వినోదం పండిస్తున్నాయి. మొన్న మార్చిలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచే ఇప్పుడు కేంద్రంలో సొంత మెజారిటీతో ఎన్డీయే సర్కారుకు నాయకత్వం వహిస్తున్న బీజేపీ వరుసగా మూడోసారి కూడా సాధారణ మెజారిటీకి అవసరమైన 272 స్థానాలు (మొత్తం 543లో) దక్కించుకుంటుందా? సొంత మెజారిటీ రాకుంటే తన కూటమిలో భాగస్వాములైన జేడీయూ, జేడీఎస్, ఎల్జేపీ, ఎన్సీపీ, శివసేన చీలికవర్గాల మద్దతుతో బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేయక తప్పదా? అనే విషయంపైనే వివిధ టీవీ చానళ్ల సంపాదకులు చర్చల మీద చర్చలు జరిపిస్తూ ఎన్నికల నిపుణులతో అంచనాలను చెప్పించడం కొత్త ట్రెండ్‌గా మారిపోయింది.
2004, 2009 ఎన్నికల్లో వరుసగా మెజారిటీ సీట్లు సాధించిన యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ (యూపీఏ) పదేండ్లు నాయకత్వం వహించిన కాంగ్రెస్ పార్టీకి ఆ ఎన్నికల్లో వచ్చినవి వరుసగా 145, 206 లోక్‌సభ సీట్లే. అనూహ్యరీతిలో బీజేపీ 2014, 2019 పార్లమెంటు ఎన్నికల్లో సాధారణ మెజారిటీకి అవసరమైన సీట్ల కంటే కాస్త ఎక్కువే (282, 303 స్థానాలు) సంపాదించడంతో దేశంలో కొత్త ధోరణికి తెర తీసినట్టయింది. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం 1984 డిసెంబర్ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ 415 సీట్లతో భారీ మెజారిటీ సాధించింది.
ఆ తర్వాత వరుసగా 1989, 1991, 1996, 1989, 1999, 2004, 2009 పార్లమెంటు ఎన్నికల్లో ఏ జాతీయ పార్టీకి మ్యాజిక్ ఫిగర్‌గా పరిగణించే 272 స్థానాలు రాలేదు. కిందటి రెండు లోక్‌సభ ఎన్నికల్లో త్రిశంకు లోక్‌సభకు అవకాశం లేకుండా ప్రజలు తీర్పు ఇవ్వడంతో ఈసారి హంగ్ తప్పదా? బీజేపీ చచ్చీచెడీ సింపుల్ మెజారిటీ సాధిస్తుందా? అనేదే మీడియాలో, బయటా ఆసక్తికర అంశాలుగా మారాయి. ఎలక్షన్ కన్సల్టింగ్ సంస్థ ఐపాక్ మాజీ అధినేత ప్రశాంత్ కిశోర్ ఈ ఎన్నికల్లో బీజేపీకి 400 లేదా 370కి మించి సీట్లు రావడం అసాధ్యమంటూనే సాధారణ మెజారిటీ ఈ పార్టీ ఖాయంగా సాధిస్తుందని ఎన్నో మాసాలుగా జోస్యం చెప్తున్నారు.
కాంగ్రెస్ పార్టీకి 70 సీట్లు సాధ్యమేనా? లేక పదేళ్ల తర్వాత ‘సెంచరీ’ చేస్తుందా?: బీజేపీ సాధించే పార్లమెంటు సీట్లపై పైన చెప్పినవిధంగా అంచనాలు సాగుతుంటే, ప్రధాన ప్రతిపక్ష హోదా కిందటి రెండు ఎన్నికల్లో దక్కించుకోలేని జాతీయపక్షం ‘కాంగ్రెస్ పార్టీ ఎన్నికల స్కోరు’పై మరో రకమైన అంచనాలు సాగుతున్నాయి. 2019 పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న రోజున జాతీయ టీవీ చానళ్లలో మాట్లాడిన పూర్వ ఎన్నికల విశ్లేషకుడు, స్వరాజ్ ఇండియా నేత యోగేంద్ర యాదవ్ ‘వరుసగా రెండోసారి కనీసం వంద సీట్లు కూడా దక్కించుకోలేక చతికలపడిన కాంగ్రెస్ ఇక చచ్చిపోవాలి. అది నిక్కుతూ నీలుగుతూ బతికుంటే దేశంలో బీజేపీకి సరైన రాజకీయ ప్రత్యామ్నాయం రాకుండా అది అడ్డుపడుతూనే ఉంటుంది’ అని వ్యాఖ్యానించి సంచలనం సృష్టించారు. అయితే మరి ఏ కారణం చేతనోగాని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభించినప్పటి నుంచీ ఈ పార్టీ ఆధ్వర్యంలో సాగుతున్న ‘ఇండియా కూటమి’ శ్రేయోభిలాషిగా యోగేంద్ర మారారు.
ఆయన ప్రస్తుత పార్లమెంటు ఎన్నికలపై శుక్రవారం ఒక జాతీయ చానల్ చర్చలో పాల్గొంటూ ‘తన తుది అంచనా ఫలితాల’ను వెల్లడించారు. బీజేపీకి కిందటి రెండు ఎన్నికల్లో వచ్చిన విధంగా సొంతంగా మెజారిటీ 2024లో రాదని, అయితే తన ఎన్డీయే మిత్రపక్షాలకు వచ్చిన సీట్లతో బీజేపీకి వచ్చిన స్థానాలను కలిపితే సాధారణ మెజారిటీకి అవసరమైన బలం సమకూరుతుందని యోగేంద్ర అంచనా వేశారు. అలాగే, ఎవరూ జోస్యం చెప్పడానికి సాహసం చేయని రీతిలో ఆయన ఈసారి కాంగ్రెస్ పార్టీకి 85 నుంచి వంద సీట్లు వస్తాయని, ‘ఇండియా’ కూటమి పార్టీలకు వచ్చే సీట్లు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు ఏ మాత్రం సరిపోవని కూడా అంచనా వేశారు. అయితే, కాంగ్రెస్ పార్టీ వరుసగా మూడోసారి కూడా ‘సెంచరీ’ చేసే అవకాశం లేదని, ఈ పార్టీ అగ్రనేత అసలు లక్ష్యం తన బలం 52ను 70 సీట్లుకు పెంచుకోవడమేనని అనేక మంది రాజకీయ పండితులు సాధికారికంగా చెప్తున్నారు. ఏదేమైనా, దాదాపు రెండున్నర నెలల సుదీర్ఘ జాతీయ ఎన్నికల ప్రక్రియ కారణంగా అనేక మంది ఎన్నికల నిపుణులు, విశ్లేషకులు తగినన్ని సంఖ్యా వివరాల ఆసరా లేకుండానే తమ అంచనాలు ప్రచారంలో పెట్టుకోవడానికి అవకాశం వచ్చింది.
– నాంచారయ్య మెరుగుమాల
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

