‘అనువుగాని చోట అధికులమనరాదు’ అన్నాడు శతకకారుడు వేమన. ఈ వాక్యాన్ని బలంగా పట్టుకున్నవాడు పది మందిలో ఎన్నటికీ పలుచన కాడు. ఎవరి శక్తిసామర్థ్యాలు వారికి తెలిసి ఉండాలి. లేని హెచ్చులకు పోవడం వల్ల అసలుకే ఎసరొచ్చే ప్రమాదం ఉన్నది. ‘కాకి-హంస’ కథ ఇదే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నది.
ఒకానొక సముద్రతీరంలో ఒక కాకి ఉండేది. ఎంగిలి మెతుకులు తింటూ బలంగా తయారైంది. సాటి కాకులతో పోలిస్తే కాస్త బలిష్ఠంగా ఉండటంతో.. తనను మించిన బలవంతులు లేరని విర్రవీగేది. ఒకసారి ఆ సముద్ర తీరానికి మానస సరోవరం నుంచి కొన్ని హంసలు వలస వచ్చాయి. సముద్ర తీరంలో సేదతీరుతూ హాయిగా కాలం గడపసాగాయి. కాకి దృష్టి ఆ హంసలపై పడింది. వాటి అందమైన రూపం చూసి కన్ను కుట్టింది. అంతలోనే, అవి తనకన్నా బాగా ఎగరలేవని సమాధాన పరుచుకుంది. అక్కడితో తృప్తి పడకుండా.. నేరుగా వాటి దగ్గరికే వెళ్లి తన శక్తియుక్తుల గురించి గొప్పలు చెప్పడం మొదలుపెట్టింది.
‘నేను ఆకాశంలోకి ఎగిరితే.. ఎన్ని యోజనాలైనా ఎగరగలను. వేగాన్ని పెంచుతూ, తగ్గిస్తూ, గింగిరాలు కొడుతూ రకరకాల గతులతో ప్రయాణించగలను. ఒక్కసారి రెక్కలు విదిలించానంటే నన్ను అందుకోవడం ఎవరితరం కాదు. దమ్ముంటే నాతో పందానికి రండి’ అని హంసల దగ్గర డంబాలు పలికింది కాకి. వాయసం మాటలకు హంసలు విరగబడి నవ్వాయి. ‘మా బలంతో నీకు పోలికా! హంసలకు దీటురాగల కాకులు ఈ లోకంలో ఉన్నాయా?’ అన్నాయి. హంసల మాటలను లెక్కచేయలేదు కాకి. తనతో పోటీలో నెగ్గి నిరూపించుకోవాలని సవాలు చేసింది.
కాకికి బుద్ధి చెప్పాలనుకున్నాయి హంసలు. పక్షుల గుంపులోంచి ఓ బుజ్జి హంస బయటికి వచ్చింది. కాకితో పందానికి తాను సిద్ధమని పలికింది. ఆ చిట్టి హంసను చూసి కాకి నవ్వుకుంది. దీన్ని ఓడించి హంసలకన్నా.. కాకులే గొప్పగా ఎగరగలవని లోకానికి చాటి చెప్తాను అనుకున్నది. రెండూ పోటీకి సిద్ధపడ్డాయి. సముద్రం ఒడ్డున ఓ బండపై నుంచి ఒక్కసారిగా రివ్వున గాల్లోకి ఎగిరాయి. హంస నిదానంగా రెక్కలను ఆడిస్తూ.. ప్రశాంతంగా ఎగరసాగింది. కాకి మాత్రం బలమంతా కూడదీసుకొని మెరుపు వేగంతో రెక్కలూపుతూ దూసుకుపోసాగింది. హంస మాత్రం సమవేగంతో ప్రయాణిస్తున్నది.
వెనక్కి తిరిగిచూసిన కాకి.. హంస చాలా దూరంగా ఉండటాన్ని గమనించింది. దాన్ని ఆటపట్టించాలనుకున్నది. వేగంగా వెనక్కి వచ్చి.. ‘ఏం బుజ్జి హంసా! నన్ను దాటుకొని వెళ్లడం నీకు చేతనవుతుందా!’ అంటూ గేలి చేసింది. అంతటితో ఆగకుండా రకరకాల విన్యాసాలు చేయడం మొదలుపెట్టింది. హంస ముక్కును తన ముక్కుతో గిల్లసాగింది. తన గోళ్లతో హంస రెక్కలను పీకింది. హంస మాత్రం ఏమీ పట్టనట్టు నిదానంగా ఎగురుతూనే ఉంది.
కాసేపటికి కాకి వంట్లో నీరసం మొదలైంది. రెక్కల్లో శక్తి క్షీణించసాగింది. బలమంతా కూడదీసుకొని రెక్కలు ఆడిస్తున్నది. ఎక్కడైనా ఆగుదామని కిందికి చూస్తే చుట్టూ సముద్రమే! వాలడానికి చెట్టు లేదు, పుట్ట లేదు. హంస మాత్రం నిదానంగా వేగం పెంచుతూ పైపైకి ఎగరసాగింది. బడాయిలకు పోయి ప్రాణాల మీదికి తెచ్చుకున్నాను అనుకుంది కాకి. రెక్కలు ఆడించకపోతే.. సముద్రంలో పడటం ఖాయం. పోనీ, వెనక్కి వెళ్దామన్నా.. తీరం చేరతానన్న నమ్మకం లేదు. తనకు ప్రాణభిక్ష పెట్టాల్సిందిగా హంసను వేడుకుంది కాకి. ‘నిన్ను మించిన పక్షి లేదన్నావే!’ అని దెప్పిపొడిచింది హంస. కాకి సిగ్గుతో తలదించుకున్నది. ‘నా శక్తి తెలుసుకోకుండా అనవసరంగా నీతో పందానికి దిగాను. నన్ను మన్నించి కాపాడు’ అని వేడుకున్నది కాకి. సొమ్మసిల్లి సముద్రంలో పడబోతున్న కాకిని తన కాళ్లతో పట్టుకొని తీరానికి తిరిగొచ్చి.. ఒడ్డున విసిరింది.
ప్రగల్భాలు పలికే వాళ్లకు ఏనాటికైనా గర్వభంగం తప్పదు. ఎదుటివారి శక్తిసామర్థ్యాలను అంచనా వేయడంతోపాటు, వ్యక్తిగత బలాబలాలు కూడా తెలుసుకొని మసలుకోవాలి. సజ్జనుడికి ఉండాల్సిన లక్షణాల్లో ఇదీ ఒకటి.