సమాఖ్యవాదం పునరుద్ధరణ
గాయిగత్తర లాంటి ఎగ్జిట్ పోల్స్‌ను పొరపాటున విశ్వసించినవారికి 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు షాకిచ్చాయి. ఇవి గత మోదీ సర్కార్ తెరపైకి తీసుకొచ్చిన కథనాలను కొనసాగించాయి. ఈ తప్పుడు అంచనాలను ఎంతగానో సమర్థించిన చాలామంది పండితులు (విశ్లేషకులు) ఇప్పుడు వాస్తవ ఫలితాలను కూడా విశ్లేషించేందుకు సిద్ధమైపోయారు.
గాయిగత్తర లాంటి ఎగ్జిట్ పోల్స్‌ను పొరపాటున విశ్వసించినవారికి 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు షాకిచ్చాయి. ఇవి గత మోదీ సర్కార్ తెరపైకి తీసుకొచ్చిన కథనాలను కొనసాగించాయి. ఈ తప్పుడు అంచనాలను ఎంతగానో సమర్థించిన చాలామంది పండితులు (విశ్లేషకులు) ఇప్పుడు వాస్తవ ఫలితాలను కూడా విశ్లేషించేందుకు సిద్ధమైపోయారు. వారు చెప్తున్న ప్రధాన విశ్లేషణ ఏమిటంటే.. సామాజిక న్యాయం, కులగణన గురించి ఇండియా కూటమి ఎక్కువగా ప్రచారం చేయడం, తెలివైన మిత్రులు, ప్రాంతీయ పార్టీలతో జట్టుకట్టడం, కుల సమీకరణాలను అనుసరించి బలమైన నేతలను బరిలోకి దించడమే అందుకు కారణమని పేర్కొంటున్నారు.
సామాజిక న్యాయం ఆవశ్యకతను గుర్తించడంతో పాటు రాజ్యాంగ మనుగడ గురించిన భయాందోళనలు ఈ ఎన్నికల్లో కీలకపాత్ర పోషించాయనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. దాంతో పాటు వివిధ రాష్ర్టాల్లోని స్థానిక అంశాలు కూడా ముఖ్య భూమికను పోషించాయి. అయితే తర్వాతి ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేసినా ఓటర్లు ఇచ్చిన స్పష్టమైన సందేశాన్ని గుర్తించాలి. ఆ సందేశం ఏమిటంటే.. ఆర్థిక సమస్యల ప్రాముఖ్యం. నిరుద్యోగం, చాలీచాలని వేతనాలు, స్వయం ఉపాధి ద్వారా లభించే ఆదాయం సరిపోకపోవడం, నిత్యావసరాల ధరల పెరుగుదల వంటి ప్రధాన సమస్యలను మోదీ ప్రభుత్వం తన విధానపరమైన నిర్ణయాల్లో, ఎన్నికల ప్రచారాల్లోనూ సమర్థవంతంగా విస్మరించింది. అయినప్పటికీ సామాన్యులకు జీవనాధారమైన కూడు, గూడు తదితర సమస్యలు దేశంలోని మెజారిటీ ప్రజల జీవితాలను పీడిస్తూనే ఉన్నాయి.
ఈ తరుణంలో ప్రతిపక్ష ఇండియా కూటమి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ.. యూపీ వంటి హిందీ రాష్ర్టాల్లో చేసిన వాగ్దానాలు ఎంతో కీలకంగా మారాయి. మోదీ ప్రభుత్వంతో పాటు, ప్రధాన స్రవంతి మీడియా సంస్థలు ఏకరువు పెట్టిన బీజేపీ విధానాల తరహాలో కాకుండా విపక్ష పార్టీలు సామాజిక న్యాయంతో పాటు జీవనోపాధి, ఉపాధి సమస్యలపై దృష్టి సారించాయి. వారి వాగ్దానాలు చాలామంది ఓటర్లలో నిస్సందేహంగా ప్రతిధ్వనించాయి.
మౌలిక పరివర్తన..: యువత, మహిళలు, రైతులు, కార్మికులకు న్యాయం చేయడంపై దృష్టి సారిస్తామని, దాంతో పాటు సామాజిక న్యాయం ద్వారా ఆయా వర్గాల గౌరవాన్ని పెంపొందిస్తామని కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో ప్రధానంగా ప్రస్తావించింది. ప్రజలకు సరుకులు, సేవలను అందించడాన్ని రాష్ట్రం లేదా అత్యున్నత నాయకుడు ఇచ్చే ‘బహుమతి’గా చూడకుండా మానవ హక్కుల, ప్రత్యేకించి సామాజిక ఆర్థిక హక్కువైపుగా మళ్లడమనేది చాలా ముఖ్యమైన మార్పు. ఇది కచ్చితంగా ఆర్థిక విధానంలో మౌలిక పరివర్తనను సూచించే అంశం.
ఆర్థిక విధాన చట్రంలో రెండు మార్పులు చేయడం తక్షణ అవసరం. వాటిలో మొదటిది.. పనిహక్కును విస్తరించడం ద్వారా ప్రతిఒక్కరికీ సామాజిక, ఆర్థిక హక్కులపై భరోసా కల్పించడం (ఉపాధిహామీ పథకానికి అధికంగా నిధులు కేటాయించడం, పట్టణ ఉపాధిహామీ పథకాన్ని ప్రవేశపెట్టడం). సుమారు 10 కోట్ల మందికి అరకొరగా అందుబాటులోకి వచ్చిన లేదా అందకుండా ఉండిపోయిన ఆహార హక్కును, ప్రభుత్వ విద్య ద్వారా విద్యా హక్కును కల్పించడం, సామాజిక హక్కుకు భరోసా ఇవ్వడం, ముఖ్యంగా వృద్ధులు, ఇతర కారణాల వల్ల పని చేయలేనివారికి కనీస వేతనంలో సగాన్ని సార్వత్రిక పెన్షన్ల రూపంలో అందించడం. దాంతో పాటు ఆరోగ్య హక్కుకు హామీ ఇవ్వడం.
రెండోది.. నిస్పృహకు గురవుతున్న కోట్ల మంది యువకుల ఆకాంక్షలను తీర్చడానికి ఉద్యోగాలను సృష్టించడం. ఇది ప్రాథమిక ఆర్థిక లక్ష్యం కావాలి. అందుకు ప్రభుత్వ ఉద్యోగాల విస్తరణ అవసరం. ముందుగా ఖాళీలను భర్తీ చేయాలి. తాత్కాలిక ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి. గత దశాబ్దంలో తీసుకున్న విధానపరమైన నిర్ణయాల వల్ల దెబ్బతిన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకోవాలి. అప్పులు, నూతన సాంకేతికత, మౌలిక వసతులు, శిక్షణ, మార్కెటింగ్ సహాయంతో కూడిన సమగ్ర ప్యాకేజీని వాటికి అందించాలి. వ్యవసాయ రంగంలో కూడా సంక్షోభం కొనసాగుతున్నది. రైతుల న్యాయబద్ధమైన డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కొత్త ప్రభుత్వం కొలువుదీరాక ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో వాటిపై సమగ్రంగా చర్చించాలి. వీటితో పాటు వాతావరణ మార్పుల ప్రభావం, అధిక ఉష్ణోగ్రతలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది.
మోదీ సర్కార్ తీసుకొచ్చిన నూతన సంక్షేమవాదం గురించి చాలా చర్చ జరిగింది. కానీ, అందులో స్థాయిలో గానీ, సారంలో గానీ పెద్దగా మార్పులేమీ లేవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను ఎప్పటినుంచో అందిస్తున్నాయి. దేశంలో కొనసాగుతున్న పేదరికం, అట్టడుగున ఉండే మానవాభివృద్ధి సూచికల కారణంగా ఇవి అవసరమే. మోదీ ప్రభుత్వం తన పథకాలు, విధానాలను పూర్తిగా కొత్తవిగా ప్రచారం చేసింది. కానీ, వాస్తవానికి అవన్నీ పాత పథకాలకు కొనసాగింపు లేదా విస్తరణ మాత్రమే. వాటినే ప్రధానమంత్రి బహుమతులుగా ప్రచారం చేస్తున్నారు. అందుకు బదులుగా ఆ పథకాలను పౌరుల హక్కులను నెరవేర్చేవిగా ప్రచారం చేయాలి. ఉదాహరణకు ఉచిత ఆహార పథకం (రేషన్) సుమారు 80 కోట్ల మందికి ముఖ్యమైన బహుమతి అని టాంటాం వేశారు. కానీ, ఈ పథకం గత యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిందే. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందిస్తున్న ఆహార పదార్థాలను గతంలోనే సబ్సిడీ కింద గోధుమలు కిలో రూ.2, బియ్యం కిలో రూ.3 లెక్కన అందించారు. కాబట్టి, ఇది అంత పెద్ద తేడా కాదు.
గత దశాబ్ద కాలంగా కనిపిస్తున్న అప్రజాస్వామిక కేంద్రీకరణకు భిన్నంగా అసలైన సమాఖ్యవాదం పునరుద్ధరణే ఈ ఎన్నికల ఫలితంగా సంభవించే ప్రధానమైన మార్పు. సాధారణ ప్రజలను ప్రభావితం చేసే అనేక ప్రజా సేవలను అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. కేంద్ర ప్రభుత్వ జోక్యం, నియంత్రణ, పక్షపాతం లేకుండా ఆ సేవలను అందించడమే కీలకం ఇప్పుడు.
(ది హిందూ సౌజన్యంతో )
– జయతీ ఘోష్
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

