ఈ మధ్య మన మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల నోట తెలంగాణలో ‘కోటి మంది మహిళలని కోటీశ్వరులను చేస్తాం’ అనే మాట తరచుగా వినిపిస్తున్నది. స్థానిక ఎన్నికల వేడికి అందరూ ఇదే పల్లవి పాడుతున్నారు. వినడానికి ఎంతో ఉన్నతంగా ఉన్నా వివరాల్లోకి వెళ్తే అది సాధ్యమా? అనిపించక మానదు. రాష్ట్రంలో 1.74 కోట్ల మంది మహిళలు ఉన్నారని జనాభా లెక్కలు చెప్తున్నాయి. వారిలో కోటి మంది వ్యవసాయంతో పాటు వివిధ వృత్తులపై, వ్యాపారాలపై ఆధారపడి ఉండొచ్చు. ప్రభుత్వ పథకాల ద్వారా ఒక్కొక్కరిని ఒక కోటి రూపాయల ఆస్తులకు వారసురాళ్లుగా మారుస్తామని ప్రభుత్వ పెద్దలంటున్నారు.
‘కోటి’ ఆశలు కల్పిస్తున్న ప్రభుత్వాల అసలు రూపమేమిటో ఈ గణాంకాలే చెప్తున్నాయి. దేశంలోని రైతుల ఆదాయాన్ని నాలుగేండ్లలో రెండింతలు చేస్తానని 2018లో ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. 2019లో ఢిల్లీ పీఠాన్ని రెండోసారి ఎక్కడానికి ఈ వాగ్దానం ఆయనకు పనికొచ్చింది గానీ, రైతుల పరిస్థితి మెరుగుపడలేదు. మన దేశంలో రోజుకు 4 వేల మంది రైతులు వ్యవసాయాన్ని వదిలేస్తున్నారని నివేదికలు చెప్తున్నాయి. గత పదేండ్లలో లక్ష మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పులపాలై అన్నదాతలు నగరాలకు వలసపోతున్నారు. దీంతో నగరాల్లో కూలీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ఇదంతా ప్రధానికి తెలియని విషయమేమీ కాదు.
2017లో గ్రామీణ వ్యవసాయ కుటుంబాల సగటు వార్షిక ఆదాయం లక్ష రూపాయలుంటే, 2022 నాటికి అది మరో అరువై వేలు పెరిగింది. ఇందులో సాగు ద్వారా సంపాదించింది సగమేనట. ఒక వ్యవసాయ నివేదిక ప్రకారం.. 2024 నాటికి తెలంగాణలో దాదాపు 92 శాతం సాగుదారులు సగటున లక్షన్నర రూపాయల అప్పు మోస్తున్నారట. అలాంటి ఇంటి ఆడవాళ్లను కోటికి పడగెత్తించడమేమో కానీ, ముందు రైతుల మీది నుంచి ఈ అప్పు భారం దిగిపోవాలి. కుటుంబం అప్పుల భారంతో కుంగిపోతున్న దశలో మహిళను ధనవంతురాలిగా మారుస్తామనడంలో ఔచిత్యమేమీ కనబడటం లేదు. రాష్ట్రంలో ప్రతి సాధారణ కుటుంబం బతుకు గడవడానికి ఎంతో శ్రమిస్తున్నది. పనికి తగ్గ రాబడి, ఖర్చుకు సరిపోయే ఆదాయం లేక నానా ఇబ్బందులు పడుతున్నది. బుక్కెడు కూటి కోసం కోటి తిప్పలు పడుతున్నవారి వర్తమాన పరిస్థితులను వదిలేసి పరమాన్నం పెడుతామని ఆశలు కల్పించడం ఒక రాజకీయ డ్రామా మాత్రమే.
కోటి మంది ఆడవాళ్లను కోటీశ్వరులను చేస్తామన్న హామీకి ఎలాంటి కట్ ఆఫ్ డేట్‌ను ప్రభుత్వం ప్రకటించలేదు. ఏనాటికి ఆ ఆర్థిక స్థాయిని వారు అందుకుంటారో అనే అంచనా ప్రభుత్వం దగ్గర లేదు. దానికి కచ్చితమైన ప్రణాళిక ఇదీ అని జీవోను బయట పెట్టలేదు. ముందుగా ఆ హామీని ఎలా నెరవేర్చుతారో తెలిపేందుకు ఒక రోడ్‌మ్యాప్‌ను ప్రభుత్వం విడుదల చేయాలి. వారు చేపట్టే వృత్తులేమిటి, మార్కెట్లో వారు పోటీని ఎలా తట్టుకుంటారు, వాటి వల్ల వచ్చే వార్షిక లాభమెంత, ఎంతకాలానికి వారు లక్ష్యాన్ని చేరుకుంటారనే విషయాలపై స్పష్టత అవసరం. ఎన్నికల హామీల ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం నిజాయితీగా పంట రుణమాఫీ చేసి ఉంటే రైతులు కొంత బాగుపడేవారు. రైతుభరోసా సక్రమంగా పంపిణీ చేస్తే అప్పుల తిప్పలు తప్పేవి. ఆసరా పింఛన్లు పెంచితే వారి చేతిలో డబ్బులాడేవి. ఉద్యోగ నియామకాలు జరిగితే యువత ఇంటికి ఆర్థిక బలాన్నిచ్చేవారు. ఇవన్నీ పక్కనబెట్టి మహిళలు కోటీశ్వరులవుతారని కొత్త పాట పాడితే ప్రజలు నమ్మరు.
వారం కిందట రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఓ సభలో మాట్లాడుతూ కోటి మంది మహిళలను కరోడ్ పతులను చేస్తామని ప్రజలకు తమ హామీని గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 66 లక్షల మంది స్వయం సహాయక బృందాల్లో ఉన్నారని, ఆ సంఖ్యను కోటికి చేరువ చేస్తామన్నారు. అందుకోసం ఆ సంఘాల్లో చేరే సభ్యుల వయస్సును 18 నుంచి 15 ఏండ్లకు తగ్గిస్తామని, అర్హత వయస్సును 60 నుంచి 65 ఏండ్లకు మార్చుతామన్నారు. కానీ, బ్యాంకింగ్ నియమాల ప్రకారం 18 ఏండ్ల లోపు వారికి అప్పు ఇవ్వరాదు. అదేరకంగా 60 ఏండ్లు పైబడినవారు కూడా వయసు రీత్యా గృహ రుణం మినహా ఇతర అప్పులను పొందే అర్హత కోల్పోతారు.
స్వయం సహాయక బృందాలకు రుణాల ద్వారా బస్సులను అందజేసి, సౌర విద్యుత్తు ఉత్పాదక సామగ్రిని అప్పగించి విద్యుదుత్పత్తి చేయించి, వాటిద్వారా వచ్చే ఆదాయంతో సంఘ సభ్యులను ఐశ్వర్యవంతులుగా మార్చుతామని ప్రభుత్వం అంటున్నది. రాష్ట్రంలో కొత్త పెట్రోల్ పంప్‌లను మహిళలకు కేటాయిస్తామని ఓ ఎమ్మెల్యే అన్నారు. ఈ నిర్ణయాలు కేంద్ర పెట్రోలియం శాఖ పరిధిలో ఉంటాయి. కొత్త ఔట్లెట్ల కేటాయింపుపై ఇప్పటికే కొన్ని విధివిధానాలున్నాయి. వాటిని పక్కనపెట్టి కేంద్రం ఇందుకు సహకరిస్తుందని చెప్పలేం. వాస్తవానికి స్వయం సహాయక బృందాలకు సంబంధించిన నిర్ణయాలన్నీ కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తీసుకుంటుంది. కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం కోరుకున్న మార్పులు తానే చేపట్టడం వీలు కాదు. గంపగుత్తగా ఈ గ్రూపుల్లో రాష్ట్రంలోని స్త్రీల వివరాలున్నందున వీరందరిని కోటీశ్వరులుగా మార్చుతామని ప్రభుత్వం తేలిగ్గా అనేసింది. కానీ, ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టుకుంటుందో చూడాలి.
– బద్రి నర్సన్ 9440128169