యూరియా యాప్ మాకెందుకు
సాఫ్ట్వేర్ ఉద్యోగులం కాము మేం
సాగు చేసే రైతులం
సాలు దోలే మనుషులం
ఆన్లైన్ బుక్ చేసుకొనే
అవకాశం మాకు ఎక్కడిది?
ఇంటర్నెట్ వాడే మనుషులమా!
అక్షరాలు నేర్వక అరక పట్టి దున్ని
వ్యవసాయం చేసే మట్టి మనుషులం
దుకాణాలలో ఎరువులు ఉంటే
నగదుకో అప్పుకో తెచ్చుకుంటాం
ఎరువులకు అందక ఆగమైతున్న రైతు
ఫోను పక్కల పెట్టుకొని
నిద్ర లేకుండా పొద్దున రాతిరి
యాప్ చూసుకునుడే సరిపాయె
ఆన్లైన్ ఫోను ఉన్నోళ్ల ఆత్మఘోష
మడవ మలికి నీళ్లు పెడదామంటే
పారపట్టి పని చేద్దామంటే
పొద్దంతా రాత్రంతా
ఫోను కావలి మనిషి
చదువు రాని మా రైతు బతుకు
సాయమెవ్వడు చేస్తడో
మా తోటి ఉన్నది చిన్న ఫోను
మాట వినిపిస్తే సాలనుకున్నము
ఇన్ని మాయలు ఎరగక పోతిమి
మా రైతుల బతుకు
చితిమంటలు ఎత్తుకుడాయే