బతుకు, బతుకనివ్వు

భూమాత ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చగలదు, కానీ వారి కోరికలు తీర్చలేదన్నారు మహాత్మా గాంధీ. ఈ భూమి సకల జీవులకు ఆది మాత. ప్రతి మొక్కను జంతువును, చరాచరాలన్నిటినీ పోషిస్తుంది. కానీ మానవుని వినాశకర చర్యలు భూమి గుండెలలో భయంకర విస్ఫోటనాలు రేపుతున్నాయి. ప్రకృతితో మానవుడు పడుతున్న ఘర్షణ మూలంగా వినాశకర విలయాలూ ప్రళయాలూ సంభవిస్తున్నాయి. ఈ భూమి మీద ఇక మేమే చివరితరం అన్నట్లు మానవులు విచక్షణారహితంగా వ్యవహరిస్తున్నారు. భూమి ఉపరితలంపైనా, భూగర్భంలో విధ్వంసం సాగిస్తున్నారు. అడవులను నరికివేస్తున్నారు. నదులు, సముద్రాలు, సరస్సులను విషపూరితం చేస్తున్నారు. మానవుల వివేకహీనత వల్ల భూగోళం వేడెక్కిపోతున్నది.
విషపూరిత వైరస్లు పుట్టుకొస్తున్నాయి. భూమిపై ఉన్న సహజవనరులను కోల్పోవడం వల్ల మన ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. ఉదాహరణకు భూమిపై ఉన్న స్వచ్ఛ జలాలను కోల్పోవడం మనం ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి. భూమిపై ఉన్న మొత్తం జలంలో 2.5 శాతం మాత్రమే స్వచ్ఛమైనది, మానవులు వినియోగించుకోగలది. ఇందులోనూ 69 శాతం అంటార్కిటికా, గ్రీన్లాండ్లో మంచు రూపంలో ఉన్నది. ఇక మిగిలిన కొద్దిపాటి నీటిని మనం పొదుపుగా వాడుకోకపోతే మన మనుగడకే ముప్పు వాటిల్లుతుంది.
వ్యవసాయం చేయడం మొదలుపెట్టి 11 వేల ఏండ్లవుతున్నది. మానవులు క్రమంగా అడవులను నరికివేస్తూ వ్యవసాయాన్ని విస్తరించారు. ఈ క్రమంలో వృక్ష జంతు జాలానికి ముప్పు ఏర్పడింది. భూ మండలంలో మూడు శాతం భూభాగం మాత్రమే మానవుల జోక్యం లేకుండా ఉన్నదని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వృక్షాలు లేకపోతే మానవులు కూడా జీవించలేరనేది తెలిసిందే. వ్యవసాయం ఒకప్పుడు జీవనశైలిగా ఉండేది. అన్నదాతలు తాము బతుకుతూ సమాజాన్ని పోషించేవారు. కానీ వ్యవసాయం ఒక పరిశ్రమలా మారిన తర్వాత పర్యావరణానికి ప్రమాదం ఏర్పడింది. యథేచ్ఛగా సాగుతున్న పారిశ్రామికీకరణ కూడా ప్రమాదకరంగా తయారైంది. కొందరు చేసే తప్పిదాలు మొత్తం మానవాళి మనుగడకే ముప్పు తెస్తున్నాయి. గ్రీన్‌హౌజ్ వాయువుల వల్ల ఓజోన్ రక్షణ కవచం దెబ్బతింటే విషకిరణాలు భూమికి చేరి వృక్షజాల కిరణ జన్య సంయోగక్రియను దెబ్బతీస్తాయి. దీనివల్ల శాకాహారం, దానిపై ఆధారపడే జంతుజాలం మొత్తం నశించి మానవాళి కూడా అంతరిస్తుంది. కీటకాలు లేకపోతే పరాగ సంపర్కం జరగక పంటలు కూడా పండవు. ప్రకృతిలో భిన్న జీవరాశుల మధ్య సమతుల్యతను దెబ్బతీస్తే మానవాళి కూడా అంతరిస్తుంది.
భూగోళం వేడెక్కడం వల్ల మంచు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. ఫలితంగా లోతట్టు దీవులు మునిగిపోవచ్చు. పర్యావరణ విధ్వంసం వల్ల రుతువులు గతి తప్పాయి. ఎప్పుడు వానలు పడతాయో, ఎప్పుడు ఎండలు కొడతాయో తెలియని దుస్థితి. భీకర తుపానులు, పెనుగాలులు, వరదలు, కార్చిచ్చులు మొదలైన వైపరీత్యాలు పెరుగుతున్నాయి.
మనిషి దురాశతో చేస్తున్న దారుణాలకు వ్యతిరేకంగా నేడు భూమాత ఆగ్రహిస్తున్నది. ప్రకృతి ఎంత దయామయమైనదో, అంత భయావహమైనది కూడా. మనిషి అవివేకంతో, సర్వభక్షకుడై స్వైరవిహారం సాగిస్తే, సుషుప్తిలో ఉన్నట్టి మరేదో విపత్తు ఒళ్ళువిరిచి, విజృంభించకపోదు. అప్పుడు మనం గడప లోపల గొళ్ళెం బిగించుకు కూర్చున్నా, అది కబళించకమానదు. భూమిపైన డైనోసార్లు లేకుండా పోయినట్టే మానవజాతి నశించిపోయినా ఆశ్చర్యం లేదు. పారాహుషార్ అని ప్రకృతి చేస్తున్న హెచ్చరికను మనమందరం గంభీరంగా యోచించవలసిన తరుణమిది. ప్రపంచ పర్యావరణ దినోత్సవ స్ఫూర్తిని మొక్కుబడిగా కాకుండా, అంతఃకరణ శుద్ధితో అందరమూ గ్రహించాల్సిన సందర్భమిది.
అభివృద్ధిని ఎవరూ వ్యతిరేకించరు. కానీ అది సుస్థిరాభివృద్ధి కావాలి. మనమే కాదు, మన తర్వాత తరాలు కూడా ఆనందంగా జీవించేవిధంగా ఈ భూగోళాన్ని కాపాడుకోవాలి. ఇప్పటికైనా మానవజాతి ప్రకృతితో సవ్యమైన అవిభాజ్యమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పుకోవాలి. ఇకనైనా కళ్ళుతెరిచి ప్రాకృతిక స్థలాల వినాశనాన్ని వెంటనే ఆపాలి. చెట్టూ, చేమ, చేప, గుట్ట, పిట్ట అన్నిటినీ వాటి మానాన వాటిని బతుకనివ్వాలి. అడవుల్లో పర్వత గుహల్లో నివసించే జంతువులూ, చెట్టు మీద గూళ్ళలో ఒదిగిన పక్షులూ సకల జీవరాశులూ క్షేమంగా ఉంటేనే మనిషి క్షేమంగా ఉంటాడనే దృక్పథం మన జీవన గమనాన్ని నిర్దేశించాలి. బతుకమ్మల నాడు పూలను పూజించి, దసరా నాడు పాలపిట్టతో సహా పక్షులను దర్శించుకొని, జమ్మిపూజ చేసి అలాయి బలాయి తీసుకునే తెలంగాణ సంస్కృతిలో ఇమిడి ఉన్న సందేశం ఇదే కదా!
–జోగినపల్లి సంతోష్‌కుమార్,రాజ్యసభ ఎంపీ
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

