నేల తల్లి పురుడోసుకున్నాక
పండంటి పంటను
రైతు చేతిలో పెట్టింది
చిగురేసిన మొక్కల్ని
ఎరువేసిన చేతులు
తనివితీరా తడుముతుంటే
రైతురాజ్యం పులకించింది
ధాన్యరాశి కుప్పలన్నీ ధనరాశులై
దర్శనమిస్తుంటే
కర్షక హర్షం నింగినంటింది
సుభిక్షిత రాజ్యమేలుతుంటే
దుర్భిక్షం చేతులు ముడిచింది
కరువన్న పదం కరువైనాక
ఏకరువలన్నీ అంతరించాక
మట్టి మనిషి అరచేతిలో
భాగ్యరేఖ మెరుస్తూ కనిపించింది
తటాకపు తొనికిసలన్నీ
పదనిసలై కంకి నాట్యమాడుతుంటే
ఏపెత్తు పైరు కులుకుతూ
హొయలుపోతా గాలికి ఊగింది
తక్కువైందనే చింత
సమసిపోయి కనుమరుగైనాక
పల్లె ముంగిట సిరుల పంట
తిష్ట వేసుకొని కూర్చుంది
అరువన్న మాట ఆవిరైనాక
ఆరుకాలాల అదృష్టం
నీడలా వెంట నడిచింది
కష్టపడాలి గానీ
కష్టాల మెడలు వంచే తీరు
నింపాదిగా వుంది..
-నరెద్దుల రాజారెడ్డి
96660 16636