శీతల పవనాలు జోరుగా వీస్తున్నాయి
శిశిరం ముందే వచ్చింది..
కొత్త గొంతుల్ని రాలుస్తూ
కాకులు కూస్తున్నాయి కోయిల గొంతులతో
కాలం నెత్తుటి రుతువును పూసింది
ఆశల చూపుల రెక్కల్ని ఒక్కొక్కటే తుంచి
రేపటి నడకలు నేరుస్తున్న కాళ్ళని నరికి
ప్రజాస్వామ్యాన్ని ప్రవచిస్తున్నది
కాదన్న గొంతులపై బూటు కాళ్ళతో
వీలైతే కొనుగోళ్ళు.. కాదంటే ఈడీ దాడులు
ఆధిపత్య జూదంలో ‘ప్రతినిధులే’ పావులు
అధికార వికృత క్రీడలో విలువలే సమిధలు
ప్రజాస్వామ్య స్తంభాలకు నిలువెత్తు బీటలు
గొంతెత్తిన నిరసనకు
‘దేశద్రోహ’ బహుమానం
హక్కులకై కలబడితే చెరసాలే ‘ఉపా’యం
రాజ్యాంగపు వృక్షానికి సంకుచితపు చీడ
అంతులేని ద్వేషానికి మనువాద ఛత్రచ్ఛాయ
అపరిమిత అధికారం జడలు విప్పి
అల్ప జీవులపై జూలు విదుల్చుతున్నది
విద్వేషమే దేశభక్తి లా విరగబూస్తున్నది
పసిపిల్లల హృదయాల్లో విషం చిమ్ముతూ
చిమ్మచీకట్లు ముసురుకుంటున్న వేళ
అబద్ధాల తారలు ఒక్కొక్కటే మెరుస్తున్నాయి
వక్రీకరణలే వాస్తవాలని ఊరేగుతున్నాయి
సత్యం చెరసాల ఊచల వెనుక
శాంతిసహనాలకు అర్థాలు మారుతున్నై
బహుళత్వం, భిన్నత్వం చిదిమివేయబడినై
శిలా సదృశ ఏకరూపతే ఇప్పుడు దేశభక్తి
పుష్పగుచ్ఛంలో అన్నీ ఒక్క రంగుపూలే
అయినా మిత్రమా!
శిశిరం ఎల్లకాలముండదు
మొడుబారినమానులన్నీ
కొత్త చిగుళ్ళు తొడుగుతాయి
శుక పికాల రావాలతో
ప్రజాస్వామ్యం ప్రతిధ్వనిస్తుంది
చీకట్లను చీలుస్తూ ఇనబింబం
తూర్పునే ఉదయిస్తుంది.
– టి.హరికృష్ణ, 9494037288