కాకతీయుల సామంతులలో మల్యాల వంశీయులు చాలా బలవంతులు.వీరిలో చౌండసేనాని, కాట సేనాని వంటివారు ప్రసిద్ధులు. కాటసేనాని కాకతి గణపతిదేవుని సామంతుడిగా ఉన్నాడు. ఇతడు కొండిపర్తిలో వేయించిన శాసనం ఉమ్మడి వరంగల్లు జిల్లాలో ఉన్నది. శాసన కాలం శ.సం.1162 = క్రీ.శ. 1241, శార్వరి నామ సంవత్సరం, ఫాల్గుణ శుద్ధ ఏకాదశి, శనివారం.
శాసనంలో మల్యాల వంశ వర్ణన, కాటసేనాని తల్లిదండ్రులు ఆచమ, సబ్బసేనానులు,వీరు దుర్జయ కుల సంభవులని పేర్కొనబడింది. కాటయసేనాని కొండిపర్తిలో రుద్రేశ్వర, కేశవ దేవరలకు ఆలయాలు నిర్మించి, దేవరల పూజాదికాలకు దానాదులను సమర్పించి శాసనం వేయించాడు. కాటయ ఈ ఆలయాలను నిర్మించేనాటికే కొండిపర్తిలో ప్రోలేశ్వరాలయం ఉన్నది. కాటసేనాని దానికి ప్రాకారాన్ని నిర్మించాడు.రుద్రేశ్వరాలయానికి మూడు నివర్తనాల భూమిని, పోలేశ్వర, కేశవ దేవర ఆలయాలకు రెండు నివర్తనాల భూమిని దానంగా సమర్పించాడు. ఈ భూములు బెల్లమ చెరు వు కింద నీటిపారుదల సౌకర్యం కలిగి ఉన్న వి. ఇంకా 30 నివర్తనాల వర్షాధార భూమిని ఈ ఆలయాలలో దేవరల అంగరంగ భోగాలకు సమర్పించినాడు.
శాసనంలో కాట చమూపతి ప్ర తాపాక్రాంత దిక్చక్ర హరిదశ్వ ఇవాపరహ, సకోట గెల్పాత, పెడముట్టు గండ, ఉద్దండ యుద్ధాంగణ పండితిమ్నా… అని వర్ణించబడినాడు. అతడి భార్య కాచమ. ఈమె పతివ్రతా గుణాభిరామ. ఈమె పాదముద్రలు తనపై పడటం వల్ల భూమి రత్నగర్భ అయిందట. ఆమె పాద తాడ నం భూమికి దోహదమయ్యిందని, ఇంకా ఆమె అంగుష్ఠ కాంతులు ఆమె పాదపీఠాన్ని సేవిం చే స్త్రీల సీమంతములందు సింధూరంగా భాసిస్తున్నాయట. కాట సేనాని నిర్మించిన దేవాలయ వర్ణన చాలా అద్భుతంగా ఉన్నది.‘ప్రాకారో జయతి త్రికూట మభిత స్థస్తేన నిమ్మా పితః/ సుఖిష్యేః క్రమశీషణ కరైరు పచితో నీలోపలైః కల్పితః/‘ ‘యశ్చా లక్షిత సంధి బంధ కథనా దేక శిలా తక్షకైః సంతక్షేవ మహీయసీమివ శిలాం యత్నాత్సముత్తారితః
దేవాలయ వాస్తు విశేషాలను తెలిపే శ్లోకమిది. నల్లసరపు రాళ్ళను నున్నగా చేసి, స్తంభాలను, దూలాలను, ప్రాకారాన్ని నిర్మించిన శిల్పుల ప్రతిభ అపురూపమైం ది. ఆలయ గోడల్లో రాళ్ళు ఒకదానిపై ఒకటి పేర్చినట్లు కనిపించక, ఒకే రాయిని కుడ్యరూపంలో నిర్మి ంచినట్లు కనిపించడం ఆనాటి శిల్పుల అసాధారణ మేధా సంపత్తికి, వారి శిల్పకళాచాతుర్యానికి నిదర్శనం.
– భిన్నూరి మనోహరి