తెలంగాణ ఉద్యమానికి నాడు సిద్దిపేట ఉద్యమ సద్ది కట్టింది. కేసీఆర్ ఇచ్చిన ‘జై తెలంగాణ’ పిలుపుకు పులకించి నిండు మనసుతో దీవించింది. సరిగ్గా అలాంటి దృశ్యం ఆవిష్కరించడానికి మునుగోడుకు అవకాశం లభించింది. అందుకే దేశాభివృద్ధికి స్ఫూర్తిని ఇచ్చేలా గొప్ప తీర్పుకు మునుగోడు సిద్ధమైంది. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా పేరు మార్చుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి జాతీయ రాజకీయాల్లోకి అడుగులు వేస్తున్న శుభ తరుణంలో మునుగోడు ఫలితం తొలి బోణీ ముహూర్తాన్ని ఖరారు చేసింది. దేశ గతిని సమున్నతంగా, సుసంపన్నంగా తీర్చిదిద్దే సాహసోపేతమైన సంకల్పంలో భాగం పంచుకోబోతున్నది. ఉద్యమాలు, పోరాటాల గడ్డ అయిన మునుగోడు మట్టి స్వభావమే తిరుగుబాటు తత్వం. దేశ రాజకీయాలను భ్రష్టు పట్టిస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థలను, సమాఖ్య స్ఫూర్తిని ధ్వంసం చేసే కుట్రలను తెలంగాణ గడప దాకా తెచ్చిన దృష్టాంతాలను మునుగోడు నిశితంగా గమనించింది. ప్రజల అండతో, ప్రజాస్వామ్య పరి పుష్టి కలిగిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టే దుస్సాహసం చేసిన పాపులు ఇపుడు ఇదే తెలంగాణ గడ్డపై జైలు పాలైన ఉదంతాన్ని మనసులో పెట్టుకొంది. దేశంలోని తొమ్మిది రాష్ర్టాలలో ప్రభుత్వాలు కూలిపోయేదాకా పగ బట్టినది చాలక నిక్షేపంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సర్కారుపై కన్ను కుట్టిన వైనంపై మునుగోడు కన్నెర్ర చేసింది. తననే ఆలంబనగా చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఏదో సాధించాలనుకునే ఢిల్లీ గద్దల తలంపులకు నిలువెత్తునా తలుపులు మూసేందుకు నడుం బిగించింది.
తమ కష్టాల్లో ఏనాడూ పాలు పంచుకోకుండానే అప్పనంగా తమ భుజాలపై ఎక్కే పన్నాగాన్ని పటా పంచలు చేసేందుకు తయారైంది. మునుగోడు మొదట్నుంచీ రాష్ట్రంలో, దేశంలో ఏం జరుగుతుందో ఓ కంట కనిపెడుతున్నది. ఓ చెవిన వింటున్నది. నిత్యావసరాల ధరలు, గ్యాస్ బండల బాదుడు మొదలుకొని కట్టే బట్టలు, చేనేతలపై దాకా దేనిని వదలని పన్నుల జులుంపై ఆగ్రహ జ్వాలగా రగులుతోంది. బాయికాడ మీటర్లే కాదు, ఇంటి మీటర్ల పైనా ఏదో భారపు పిడుగు పొంచి ఉందని తెలుసుకుని అప్రమత్తమైంది. లెక్కకు అందని పన్నులతో వెన్ను విరగ్గొడుతున్న పార్టీ ఏదో, తమకు అన్నింటా శ్రీరామ రక్షగా ఉంటున్న పార్టీ ఏదో పూర్తిగా స్పష్టత తెచ్చుకుంది. తమకు అనేక సంక్షేమ పథకాలు అందించిన ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపేందుకు ఆతురతతో వేచి చూస్తున్నది. టీఆర్ఎస్ పార్టీని అవలీలగా గెలిపించి దేశ రాజకీయాలలో నూతన అధ్యాయానికి నాంది పలికి బీఆర్ఎస్ నుదుటన వీర తిలకం దిద్దేందుకు మునుగోడు సిద్ధమైంది!
– ఇల్లెందుల దుర్గాప్రసాద్ 94408 50384