ఏ సమస్యకైనా సరే మూలం ఏమిటో సక్రమంగా అర్థమైతే తప్ప సరైన పరిష్కార మార్గం లభించదు. ముఖ్యంగా శాంతిభద్రతలకు సంబంధించిన ఏదైనా సమస్య వెలుగులోకి వచ్చినప్పుడు తక్షణమే పరిష్కారం చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, పోలీస్‌శాఖ మీద ఉంటుంది. లేదంటే ఆ సమస్య మరింత ముదిరి శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగించే ప్రమాదకర స్థాయికి చేరుతుంది. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బీ సుమతి అర్ధరాత్రి వేళ.. రోడ్డు మీద.. ఒక సాధారణ మహిళ మాదిరిగా నిల్చున్న సందర్భంలో ఆమెకు ఎదురైన చేదు అనుభవాలు ఇటువంటి ప్రమాదాన్నే హెచ్చరిస్తున్నాయి. ఆమె ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారో తెలియదు కానీ, అర్ధరాత్రి వేళ ఆమె పెద్ద ‘సాహసమే’ చేశారు! మన దేశంలో సాధారణ మహిళలు సర్వసాధారణంగా ఇటువంటి సాహసాలు చేయరు.
ఎప్పుడైనా ఏ మహిళ అయినా అర్ధరాత్రి వేళ ఒంటరిగా బయటకు వచ్చి, బస్సు కోసమో, ట్యాక్సీ కోసమో, స్నేహితుల కోసమో, బంధువుల కోసమో ఎదురుచూడాల్సిన తప్పనిసరి పరిస్థితి వస్తే, అది ఎంత నరకమో, దుర్భరమో పోలీస్ కమిషనర్ హోదాలో ఉన్న సుమతి అర్థం చేసుకొని ఉంటారు. అర్ధరాత్రి వేళ ‘పోకిరీ’ల మాదిరిగా తనకు తారసపడ్డ ఆ నలభై మంది తాను నిల్చున్నప్పుడు తనతో అలా మాట్లాడటానికి, తాను నడుస్తున్నప్పుడు తనను వెంబడించడానికి గల కారణం ఏమిటో కూడా రూఢీ అయి ఉంటుంది! ఇప్పటికే ఒకసారి 18 మంది ప్రాణాలను బలిగొన్న బాంబ్‌బ్లాస్ట్ జరిగిన దిల్సుఖ్నగర్ లాంటి అత్యంత కీలకమైన, సున్నితమైన ప్రాంతంలో పోలీస్ గస్తీ ఎంత అధ్వానంగా ఉన్నదో, రాత్రి డ్యూటీలో ఉండే పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అవగతమై ఉంటుంది.
ప్రతిరోజూ నిశిరాత్రిలో ఆ సువిశాల రోడ్ల వెంట ఏమి జరుగుతున్నదో, కొంతమంది యువకులు తనతో ప్రవర్తించిన తీరును బట్టే ఆమె అర్థం చేసుకొని ఉంటారు. ఆమె లోకం పోకడ తెలియని అమాయకురాలు ఏమీ కాదు కదా! పైగా పెద్దపెద్ద నక్సలైట్ల లొంగుబాట్ల ఇష్యూనే హ్యాండిల్ చేసిన, కరుడుగట్టిన నేరస్తులకు సైతం చుక్కలు చూపించిన ట్రాక్ రికార్డ్ ఉన్న పోలీస్ ఆఫీసర్ ఆమె! ఆ అర్ధరాత్రి వేళ.. ఒక సాధారణ మహిళగా తనకు ఎదురైన చేదు అనుభవాలు, అందుకు గల కారణాలను ఆమె ప్రభుత్వానికి అధికారికంగా నివేదించారో లేదో తెలియదు.
శాంతిభద్రతలతో ముడిపడిన హోంశాఖ బాధత్యలను కూడా తానే స్వయంగా పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికైనా ఇటువంటి ఆలోచన వచ్చిందో లేదో, ఆయనకు అంత తీరిక ఉన్నదో లేదో తెలియదు. కానీ, దిల్సుఖ్నగర్ లాంటి రద్దీ ప్రాంతాల్లో కూడా మహిళలు ఒంటరిగా బస్సుల కోసం ఎదురు చూసే పరిస్థితిని కల్పించలేకపోతున్నందుకు ఏ ప్రభుత్వమైనా సిగ్గు పడాలి. తమ ఏలుబడిలో ఒక మహిళా పోలీస్ కమిషనర్‌కు ఇటువంటి పరిస్థితి ఎదురైన నేపథ్యంలోనైనా ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా పరిగణించాలి. ఎందుకంటే, సాక్షాత్తు పోలీస్ కమిషనర్ సుమతికి ఎదురైన అనుభవం ప్రభుత్వ ప్రతిష్టకు కూడా మచ్చ తెచ్చేదే!
దిల్సుఖ్నగర్ అనేది ఆషామాషీ సెంటర్ కాదు. అదొక హైవే. హైదరాబాద్‌ను ఇతర రాష్ర్టాలతోనూ కనెక్ట్ చేసే మార్గం. వ్యాపార, వాణిజ్య కూడలి. పలు కార్పొరేట్ హాస్పిటల్స్, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు, హాస్టల్స్ కేంద్రీకృతమైన ప్రాంతం. అనేక సుప్రసిద్ధ దేవాలయాలు ఉన్న రహదారి. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా అనేకమంది ప్రయాణికులు ఆర్టీసీతోపాటు ప్రైవేట్ వాహనాల్లో రాకపోకలు సాగిస్తుంటారు.
కుటుంబాలతో కలిసి రోడ్డు మీదనే నిలబడి తాము ఎక్కాల్సిన బస్సు కోసం ఎదురుచూస్తుంటారు. దూరప్రాంతాల నుంచి వచ్చేవారు ఆ పరిసరాల్లోనే బస్సు దిగి, ఆటోలు, ట్యాక్సీల్లో ఇండ్లకు వెళ్తుంటారు. అలాంటి ఆ ప్రాంతంలో ముఖ్యంగా దిల్సుఖ్నగర్ బస్టాండ్ నుంచి కొత్తపేటలో నిర్మాణంలో ఉన్న టిమ్స్ హాస్పిటల్ వరకు కొంతకాలంగా ‘అసాంఘిక కార్యక్రమాలు’ పెరుగుతున్న విషయాన్ని మీడియా వెలుగులోకి తెస్తూనే ఉన్నది. ఫ్యామిలీతో కలిసి ఆ మార్గంలో వెళ్లే వారికి అదొక ఇబ్బందికర వాతావరణమే. ఒకవైపు, పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు తిరుగుతున్నా.. అక్కడ నేర సామ్రాజ్యం విస్తరిస్తుండటం అత్యంత ఆందోళనకరం. పోకిరీలు, ట్రాన్స్జెండర్లు, ప్రాస్టిట్యూట్స్ చెలరేగిపోతున్నా.. పెట్రోలింగ్ వాహనాల్లో తిరిగే పోలీసులు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదన్నదే ప్రశ్న.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నది. హైదరాబాద్‌లో రహదారుల వెంట లక్షకు మించి సీసీ కెమెరాలు, వాటన్నింటినీ అనుసంధానిస్తూ, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసింది. నగరం నలుమూలలా ఏమి జరిగినా క్షణాల్లో పసిగట్టే సాంకేతికతను పోలీసు యంత్రాంగం అందిపుచ్చుకున్నది. మహిళలకు భద్రత కల్పించాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం షీ టీమ్‌లను ఏర్పాటు చేసింది. ఆ ప్రయోగం సత్ఫలితాలనిచ్చింది. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చింది. కానీ నేడు బస్సు కోసం ఎదురుచూస్తున్న మహిళ వద్దకు వెళ్లి ‘వస్తావా? రేటెంత? ఎక్కడికి వెళ్దాం?’ అని అడిగే ధైర్యం ‘పోకిరీ’లకు ఎలా వస్తున్నది? ఎక్కడ, ఏ వీధిలో, ఏ చిన్న ఫంక్షన్ జరిగినా, ఎక్కడ గృహప్రవేశం ఉన్నా, ఎక్కడ షామియానా కనిపించినా క్షణాల్లో అక్కడ వాలిపోయి, వేలు, లక్షలాది రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసే ధైర్యం ట్రాన్స్జెండర్లకు ఎవరు ఇస్తున్నారు?
ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కార్లు ఆగిన వెంటనే, ట్రాన్స్‌జెండర్స్ గుంపు అక్కడకు చేరి, కారు అద్దాల మీద టపీటపీమని కొడుతున్నా, అక్కడే ఉండి చూస్తున్న పోలీసులు ఎందుకు స్పందించడం లేదు? సీసీ కెమెరాల్లో అవన్నీ సాక్ష్యాల రూపంలో నమోదవుతున్నా ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు? నగరంలో విస్తరిస్తున్న ఈ దందాలు శాంతిభద్రతలు ఘోరంగా క్షీణిస్తున్నాయనడానికి నిదర్శనం కాదా?
ఒక మహిళ ఒంటరిగా బస్టాండ్ వద్ద నిల్చోలేని పరిస్థితి, కనీసం ఇంటి వద్ద కూడా ప్రశాంతంగా ఫంక్షన్ చేసుకోలేని భయానక వాతావరణం ఒక దిక్కు ఏర్పడుతుంటే.. అది శాంతిభద్రతల వైఫల్యం కాదా? నగర పౌరులకు భద్రత కల్పించే విషయంలో ఎందుకింత నిర్లిప్తత? చెట్ల చాటునో, గోడల చాటునో నక్కి ట్రాఫిక్ ఉల్లంఘన ఫొటోలు తీయడం, దారి కాచి చలాన్లు వసూలు చేసే నైపుణ్యం కలిగిన పోలీసులకు నిత్యం పౌరులు ఎదుర్కొంటున్న ఇలాంటి సమస్యలు పట్టవా?
హైదరాబాద్ నగరంలో దాదాపు తొమ్మిది లక్షల సీసీ కెమెరాలు ఉన్నా, వాటిలో రికార్డు అవుతున్న అంశాలను ఎప్పటికప్పుడు క్షుణ్నంగా పరిశీలించాలన్న ధ్యాస కానీ, అసాంఘిక ప్రవృత్తి, చీకటి నేరాలకు అడ్డాగా మారుతున్న ప్రాంతాలను గుర్తించి, వాటిని అరికట్టేందుకు ఏం చేయాలన్న ఆలోచన కానీ పోలీసు యంత్రాంగానికి ఎందుకు రావడం లేదు? ఇంత సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా పోలీసులు అంత నిర్లిప్తంగా ఎందుకు ఉంటున్నారు? సభ్యసమాజం తలదించుకొనేలా నడివీధుల్లో జరుగుతున్న బాగోతాలను అరికట్టే విషయంలో పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నరో అర్థం చేసుకోవడానికి స్వయంగా పోలీస్ కమిషనర్ సుమతికి ఎదురైన అనుభవమే నిదర్శనం.
ఇలాంటి పరిస్థితి సర్కార్ వైఫల్యం కాదా? ఇందుకు హోంశాఖను పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి నైతిక బాధ్యత తీసుకోవద్ద్దా? ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని, మహిళల, పౌరుల భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్న ఈ సంస్కృతిని కూకటివేళ్లతో పెకిలించేందుకు ప్రయత్నించకపోతే, మరెన్నో కీచక దృశ్యాలు, ఘోరమైన నేరాలను చూడాల్సి వస్తుంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కి డ్యామేజ్ అయితే, సురక్షిత నగరం కాదని ముద్ర పడితే అది రాష్ర్టానికి ప్రమాదం.
– కందిబండ కృష్ణప్రసాద్ 91827 77010