ఒక దేశంలో జరిగిన సంఘటన మరొక దేశంలో ఆర్థిక ప్రభావాన్ని చూపుతుంది. గల్ఫ్ ప్రాంతంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఇరాన్-గల్ఫ్ ఉద్రిక్తతలు, చమురు సరఫరా మార్గాల్లో ఏర్పడిన ప్రమాదాలు, సముద్ర మార్గాల్లో అస్థిరత వంటి అంశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ఈ ప్రభావం నుంచి భారతదేశం కూడా మినహాయింపు కాదు. ఆయిల్ ధరల పెరుగుదల నుంచి రైతుల పంట ధరల పతనం వరకు అనేక రంగాలు ఈ సంక్షోభంతో కుదేలవుతున్నాయి.
పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, వస్తువుల ధరలు పెరుగుతాయి. దీనివల్ల ద్రవ్యోల్బణం మరింత ఎక్కువవుతుంది.
మన దేశం ఉపయోగించే ఎల్ఎన్జీ, ఎల్పీజీలో పెద్ద భాగం గల్ఫ్ దేశాల నుంచే వస్తున్నది. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ పరిస్థితులు ఏర్పడితే ఈ సరఫరా వ్యవస్థ వెంటనే ప్రభావితమవుతుంది. సముద్ర మార్గాల్లో ప్రమాదాలు, షిప్పింగ్ ఖర్చులు పెరగడం లేదా సరుకు రవాణా ఆలస్యం కావడం వల్ల గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. దీనివల్ల దేశంలోని అనేక పరిశ్రమలు దెబ్బతింటాయి. ఫర్టిలైజర్ ప్లాంట్లు, కెమికల్ ఇండస్ట్రీలు, పవర్ ప్లాంట్లు వంటి రంగాలు గ్యాస్‌పై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. ఈ రంగాలకు సరఫరా తగ్గితే ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. చివరికి వ్యవసాయ రంగంపై కూడా దీని ప్రభావం పడుతుంది. ఫర్టిలైజర్ తయారీ తగ్గిపోతే మార్కెట్లో ఎరువుల కొరత ఏర్పడుతుంది. ఫలితంగా ఎరువుల ధరలు పెరుగుతాయి. చివరకు వ్యవసాయ ఉత్పత్తి ఖర్చు పెరిగి ఆహార ధాన్యాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది.
చమురు ధరలు పెరిగినప్పుడు భారతదేశానికి ఒక ముఖ్యమైన సమస్య రూపాయి విలువ తగ్గడం. భారత్ తన అవసరాల కోసం భారీగా చమురు దిగుమతి చేసుకుంటున్నది. చమురు ధరలు పెరిగితే మరింత
ఎక్కువ డాలర్లు అవసరం అవుతాయి. దీంతో డాలర్‌కు డిమాండ్ పెరిగి రూపాయి విలువ క్రమంగా తగ్గుతుంది. రూపాయి విలువ తగ్గితే విదేశాల నుంచి దిగుమతి చేసే ప్రతి వస్తువు ఖరీదవుతుంది.
గల్ఫ్ దేశాలు భారతదేశానికి ఒక అత్యంత ముఖ్యమైన ఎగుమతి మార్కెట్. భారత్ నుంచి పంపే మొత్తం ఎగుమతుల్లో దాదాపు 17 శాతం గల్ఫ్ ప్రాంతానికి వెళ్తాయి. ముఖ్యంగా బాస్మతి బియ్యం, టెక్స్టైల్స్, ఫుడ్ ప్రొడక్ట్స్, ఎలక్ట్రానిక్స్, నిర్మాణ సామగ్రి వంటి అనేక వస్తువులు గల్ఫ్ దేశాల్లో మంచి డిమాండ్ కలిగి ఉంటాయి. అయితే ప్రస్తుతం ఆ ప్రాంతంలో యుద్ధ పరిస్థితులు ఏర్పడితే సముద్ర మార్గాలు ప్రమాదకరంగా మారుతాయి.
గల్ఫ్ దేశాల మరో ముఖ్యమైన అంశం అక్కడ పనిచేస్తున్న లక్షలాది భారతీయులు. గల్ఫ్ ప్రాంతంలో నిర్మాణ రంగం, సేవా రంగం, ఆయిల్, గ్యాస్ పరిశ్రమల్లో పెద్ద సంఖ్యలో భారతీయ కార్మికులు పనిచేస్తున్నారు. వారు ప్రతి సంవత్సరం తమ కుటుంబాలకు పంపే డబ్బు భారత ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమైన ఆదాయం. 202425 సంవత్సరంలో విదేశాల నుంచి భారత్‌కు వచ్చిన మొత్తం రెమిటెన్సెస్ దాదాపు 135 బిలియన్ డాలర్లు. ఇందులో గణనీయమైన భాగం గల్ఫ్ దేశాల నుంచే వచ్చింది. గల్ఫ్ ప్రాంతంలో జరిగే యుద్ధ ప్రభావం చమురు ధరల నుంచి ప్రారంభమై ఎగుమతులు, ఉద్యోగాలు, కుటుంబాల ఆదాయం వరకు అనేక స్థాయుల్లో భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
గల్ఫ్ సంక్షోభం ప్రభావం కేవలం పెద్ద పరిశ్రమలపైనే కాకుండా రైతులపై కూడా పడుతున్నది. ముఖ్యంగా దక్షిణాది కొబ్బరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ర్టాలు కొబ్బరి సాగుకు ప్రసిద్ధి. ఈ రాష్ర్టాల నుంచి గల్ఫ్ దేశాలకు పెద్ద మొత్తంలో కొబ్బరి ఎగుమతి అవుతుంది. యుద్ధం కారణంగా ఎగుమతులు నిలిచిపోవడంతో కోట్లాది రూపాయల విలువైన కొబ్బరి కంటెయినర్లు ముంబై, చెన్నై, తూత్తుకూడి పోర్టుల్లోనే నిలిచిపోయాయి. యుద్ధం తాత్కాలిక సమస్యలా కనిపించినా దీని ప్రభావం చాలాకాలం ఉంటుంది. స్టాక్ మార్కెట్లో అస్థిరత పెరుగుతుంది. పెట్టుబడిదారులు కొత్త పెట్టుబడులు పెట్టడానికి భయపడతారు. విమానయాన రంగానికి కూడా భారీ నష్టం వాటిల్లుతుంది.
కార్ల్ వాన్ క్లాజ్‌విట్జ్ అనే జర్మన్‌లోని ప్రష్యన్ సైనిక కమాండర్ ‘యుద్ధం అనేది రాజకీయాలను ఇతర మార్గాల ద్వారా కొనసాగించడమే’ అని అన్నాడు. ఈ వాక్యం ప్రపంచ రాజకీయాల సారాంశాన్ని చెప్పేస్తుంది. దేశాలు తమ రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలను సాధించడానికి యుద్ధాన్ని ఒక సాధనంగా ఉపయోగిస్తాయి. కానీ యుద్ధం ప్రారంభించిన దేశాలు చివరికి సాధారణ ప్రజల జీవితాలను నాశనం చేస్తాయి. యుద్ధం అనేది కేవలం సైనికుల మధ్య జరిగే పోరాటం మాత్రమే కాదు, అది సామాన్య ప్రజల జీవన విధానాన్ని పూర్తిగా మార్చే సంఘటన.
– మహేంద్ర తోటకూరి