అది 2006.. సెప్టెంబర్ 20. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి సమావేశంలో వెనెజువెలా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. ‘ఆ దయ్యం తాలూకు దుర్వాసన ఇంకా ఉంది’ అని వ్యాఖ్యానించారు. ముందురోజు అక్కడినుంచి మాట్లాడిన అమెరికా అధినేత జార్జ్‌బుష్‌ను, ఆయన విధానాలను ఉద్దేశించి ఆయన ఈ మాట వాడారు. తర్వాత కాలంలో ప్రాచుర్యం పొందిన ఈ విమర్శ.. నేటి అమెరికాకు సరిగ్గా సరిపోతుంది. ట్రంప్ అధికారం నుంచి దిగిపోయి ఏడాదిన్నర గడిచిపోయింది. కానీ, ‘ఆ దయ్యం తాలూకు దుర్వాసన’ అమెరికాను వదలటం లేదు. దీనికి తాజా నిదర్శనం మహిళలకు ఉన్న గర్భవిచ్ఛిత్తి హక్కును తొలగిస్తూ ఆ దేశ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు.
తమ శరీరంపై తమకే హక్కు ఉంటుందని, గర్భాన్ని నిలుపుకోవటం, తొలగించుకోవటం అనేది పూర్తిగా తమకు సంబంధించిన విషయమన్న అమెరికా మహిళల నినాదాన్ని అమెరికా సుప్రీంకోర్టు 1973లో అంగీకరించింది. గర్భవిచ్ఛిత్తిపై మహిళలకు రాజ్యాంగబద్ధమైన హక్కును కల్పిస్తూ తీర్పు ఇచ్చింది. 50 ఏండ్లు గడిచిపోయా యి. సమాజం, ఆలోచన ధోరణులు, హక్కులు మరింత విస్తృతం కావాలి. కానీ, ప్రపంచంలోనే అత్యంత పురాతన ప్రజాస్వామ్యంగా పేరొందిన అమెరికా మాత్రం దశాబ్దాల వెనక్కి తిరోగమిస్తున్నది. దీనికి కారణం.. ఆ దేశ న్యాయవ్యవస్థ రాజకీయపార్టీల వారీగా చీలిపోవటం. ట్రంప్ అధికారంలో ఉన్న నాలుగేండ్లలో, మితవాద సిద్ధాంతాలకు ప్రాతినిధ్యం వహించే తమ రిపబ్లికన్ పార్టీ సానుభూతిపరులకు అధికసంఖ్యలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించారు. నేడు సుప్రీంకోర్టులో మితవాద జడ్జీలదే మెజారిటీగా ఉన్నది. ట్రంప్ దిగిపోయినా కూడా ఆయన సంకుచిత, జాత్యహంకార, అప్రజాస్వామిక ధోరణులు కొనసాగుతున్నాయి. దాంట్లో భాగమే గర్భవిచ్ఛిత్తిపై నిషేధం.
సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి రిపబ్లికన్ల పాలనలో ఉన్న పలు రాష్ర్టాలు గర్భవిచ్ఛిత్తిపై నిషేధం విధిస్తూ చట్టాలు తెచ్చాయి. ఈ రాష్ర్టాల్లో ఉన్న మహిళలు అబార్షన్ చేయించుకోవాలంటే అందుకు అనుమతించే డెమోక్రాట్ల పాలనలో ఉన్న రాష్ర్టాలకు వెళ్లాలి. అంటే.. మహిళల శరీరంపై హక్కులను ఘనత వహించిన అమెరికా సుప్రీంకోర్టు తమ చట్టసభలకు అప్పగించిందన్నమాట. ఇతర ప్రాంతాలకు వెళ్లలేని పేదలుంటారు, వెళ్లినా వారు వెనక్కి వచ్చిన తర్వాత వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే ప్రమాదం ఉంది, వీటన్నింటి ఫలితంగా రహస్యంగా, ప్రమాదకర పద్ధతుల్లో అబార్షన్ చేయించుకునే పరిస్థితులు తలెత్తవచ్చు. ఇంకా దారుణం ఏమంటే, లైంగికదాడి వల్ల గర్భం వచ్చినా కూడా దాన్ని తొలగించుకుంటే ఆ బాధిత మహి ళ ఇప్పుడు అమెరికాలో నేరస్థురాలు అవుతుంది. మహిళలకు ఇంతకంటే అవమానం ఉంటుందా? అమెరికా ప్రజలు ఈ తిరోగమనాన్ని తిప్పికొట్టాలి. లేకపోతే ఈ హక్కుల హననం ఆగిపోదు. స్వేచ్ఛకు, సమాన అవకాశాలకు, ప్రజాస్వామిక సంప్రదాయాలకు కేంద్రంగా వర్ధిల్లిన అమెరికా.. ఆ వారసత్వాన్ని, ఆ ఘన చరిత్రను నిలబెట్టుకోవాలి.