Hanuman | తెలంగాణ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. వరంగల్ జిల్లా గీసుకొండలో తయారైన ఎత్తయిన హనుమాన్ విగ్రహాన్ని అమెరికాలోని డెలావేర్లో ప్రతిష్టించారు. 25 అడుగులు, 45 టన్నుల బరువైన ఈ విగ్రహాన్ని ఏకశిలపై చెక్కారు. తెలంగాణ నుంచి తరలించిన విగ్రహాన్ని హిందూ టెంపుల్ అఫ్ డెలావేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హిందూ టెంపుల్ ఆఫ్ హాకెస్సిన్లోప్రతిష్టించారు. ఇది అమెరికాలో ఏర్పాటు చేసిన అతిపెద్ద ఏకశిల హనుమాన్ విగ్రహం.
భారతదేశం ఎత్తయిన హనుమంతుని విగ్రహాలకు నిలయం అయినప్పటికీ, డెలావేర్ హిందూ దేవుడి ఎత్తయిన విగ్రహానికి నిలయంగా మారడం గొప్ప విషయం. భారతదేశంలోనే అత్యంత ఎత్తయిన హనుమాన్ విగ్రహాలు శ్రీకాకుళంలో 176 అడుగులు, విజయవాడ సమీపంలోని 135 అడుగులు కాగా భారతదేశం వెలుపల ఉన్న ఎత్తయిన హనుమంతుని విగ్రహం ఉత్తర అమెరికాలో ఉన్నది. ఇది కెనడాలోని అంటారియోలో 50 అడుగుల మంగళ్ మూర్తి హనుమాన్ విగ్రహం.
1996లో హాకెస్సిన్ ఆలయానికి శంకుస్థాపన జరిగినప్పటి నుంచి డెలావేర్‌లోని దేవాయలంలో హనుమంతుని విగ్రహం ఏర్పాటు చే యాలనుకున్నారు. హాకెస్సిన్ మహాలక్ష్మి దేవాలయమైనప్పటికీ ఇప్పుడు హనుమంతుడు కూడా అక్కడ పూజలందుకుంటున్నాడు. డేలావేర్‌లో హనుమాన్ విగ్రహం ప్రతిష్టాపనతో హాకెస్సిన్ కూడా అమెరికాలోని ప్రసిద్ధ హనుమాన్ దేవాలయాల సరసన చేరింది. అక్కడి కాలిఫోర్నియా టోరన్స్ పంచముఖ హనుమాన్ దేవాలయం, మౌంట్ మడోన్నా సెంటర్లోని సంకట్ మోచన్ హ నుమాన్ దేవాలయం, మేరీల్యాండ్‌లోని సంకట్ మోచన్ మహాబలి దేవాలయాల వరుసలో హాకెస్సిన్ చేరినట్టయింది.
-భాస్కర్ పిన్న
డెలావేర్, యూఎస్ఏ