చిలీ అధ్యక్ష ఎన్నికల్లో మితవాద అధికార కూటమిపై వామపక్ష అభ్యర్థి గాబ్రియెల్ బోరిక్ విజయం లాటిన్ అమెరికా దేశాల్లో వస్తున్న కొత్త మార్పుకు మరో సంకేతం. విద్యార్థి ఉద్యమాల నుంచి ఎదిగిన బోరిక్ అతిపిన్న వయసులో చిలీ అధ్యక్ష పదవికి ఎన్నికైన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ఈ ఎన్నికల్లో అమెరికా అనుకూల అధికారపక్షం కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారాన్ని హోరెత్తించింది. అరాచకం రాజ్యమేలుతుందని నిందలు వేసింది. అయినా ఎదుర్కొని, సంక్షేమ పాలన అందిస్తానన్న హామీతో బోరిక్ గెలుపొందటం విశేషం. లాటిన్ అమెరికాలో ప్రజానుకూల ప్రభుత్వాలను అర్ధంతరంగా గద్దె దింపిన హింసాత్మక చరిత్ర అమెరికాకు ఉన్నది. ఈ అనుభవాల దృష్ట్యా.. బోరిక్ ప్రభుత్వ భవిష్యత్తుపై అనేక భయాలున్నాయి. అయితే, ప్రజల ఆకాంక్షలే ఆయనకు రక్షణ కవచం. ‘భయంపై ఆశ విజయం సాధించింద’న్న బోరిక్ ప్రసంగం ఇందుకు నిదర్శనం.
దశాబ్దకాలంగా ఉద్యమాలతో చిలీ అట్టుడికింది. 2018లో పినెరో ప్రభుత్వం పెంచిన మెట్రోచార్జీలను తగ్గించాలంటూ ప్రారంభమైన విద్యార్థి ఉద్యమం.. రాజ్యాంగాన్ని తిరగ రాయాలన్న ప్రజాపోరాటంగా రూపుదాల్చింది. ఆ నేపథ్యంలో నవంబర్ 21న రాజ్యాంగ పరిషత్తుతోపాటు, పార్లమెంటు ఉభయ సభలకు, స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. రాజ్యంగ పరిషత్తుకు వామపక్ష వాదులే మెజారిటీ సంఖ్యలో ఎన్నికయ్యారు. ఆ క్రమంలోనే డిసెంబర్ 19న అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. మితవాద క్రిస్టియన్ సోషల్ ఫ్రంట్ అభ్యర్థి జోస్ ఆంటోనియో కాస్ట్, లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థి బోరిక్ హోరాహోరీగా తలపడటంతో ఎవరికీ మెజారిటీ రాలేదు. మలిదశ పోటీలో బోరిక్ విజయం సాధించటంతో, ఉదారవాద రాజకీయాలు ఓటమి పాలయ్యాయి.
అమెరికా ఆర్థిక, రాజకీయ భల్లూకపు పట్టులో లాటిన్ అమెరికా దశాబ్దాలుగా విలవిలలాడుతున్నది. అగ్రరాజ్య అనుకూల పక్షాలను ఎదిరించి నిలిచే క్రమంలో చిలీది రక్తసిక్త చరిత్ర. సామ్యవాది సాల్వెడార్ అలెండీ 1973లో అధికారం చేపట్టి అనేక విప్లవాత్మక సంస్కరణలు చేపట్టారు. వాటిని సహించని స్థానిక పెట్టుబడిదారీ వర్గం సీఐఏ సహకారంతో అలెండీని హత్య చేయించింది. తర్వాత సైనిక నియంత పినోషెట్ రెండు దశాబ్దాల పాలనలో ఆర్థిక అంతరాలు తారస్థాయికి చేరాయి. విద్య, వైద్యం, సంక్షేమం ప్రజలకు అందకుండా పోయా యి. 90ల తర్వాత వచ్చిన పాలకులు కూడా అమెరికా కనుసన్నల్లోనే నడవటంతో తీవ్ర సంక్షోభం నెలకొన్నది. ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో బోరిక్ గెలుపు ఆశాకిరణం. వెనిజువెలా, బొలీవియా, నికారుగ్వా, హోండూరస్లలో ప్రజలు ఇప్పటికే వామపక్షాలకు జై కొట్టారు. ఇప్పుడు చిలీ కూడా అదే దారిని ఎన్నుకున్నది. ప్రపంచంలో ఒక వైపు జాతీయవాద పార్టీలు ఊపందుకుంటున్న తరుణంలో దక్షిణ అమెరికా ప్రజలు భిన్నమార్గం ఎంచుకోవడం ఆసక్తికరం. ప్రపంచానికి లాటిన్ అమెరికా ఇస్తున్న సందేశం ఏమిటో!