మైనారిటీల ప్రాతినిధ్యం
ప్రపంచంలోని మూడో అతిపెద్ద ముస్లిం జనాభాకు భారత్ నెలవు. ఈ కారణంగా దేశంలో ముస్లింలు రెండో అతిపెద్ద మతవర్గంగా ఉన్నారు. మైనారిటీల్లో ప్రథమ స్థానంలో ఉన్న ముస్లింలు జమ్ముకశ్మీర్‌లో మెజారిటీగా ఉండటం తెలిసిందే.
ప్రపంచంలోని మూడో అతిపెద్ద ముస్లిం జనాభాకు భారత్ నెలవు. ఈ కారణంగా దేశంలో ముస్లింలు రెండో అతిపెద్ద మతవర్గంగా ఉన్నారు. మైనారిటీల్లో ప్రథమ స్థానంలో ఉన్న ముస్లింలు జమ్ముకశ్మీర్‌లో మెజారిటీగా ఉండటం తెలిసిందే. అక్కడ ముస్లింలే ముఖ్యమంత్రులు కావడం ఆనవాయితీగా వస్తున్నది. కొన్ని ఇతర రాష్ర్టాల్లోనూ ముస్లింలు ముఖ్యమంత్రులయ్యారు. ఇప్పటివరకు మన దేశానికి ముగ్గురు ముస్లింలు రాష్ట్రపతులుగా కూడా చేశారు. మనదేశ లౌకిక ప్రజాస్వామ్య వారసత్వానికి ప్రతీకలుగా వీటన్నిటి గురించి గొప్పగా చెప్పుకోవడం జరుగుతుంది. పార్లమెంటులోనూ ఈ ప్రధాన అల్పసంఖ్యాక వర్గంవారి ప్రాతినిధ్యం గణనీయంగానే ఉండేది. అయితే ఇటీవలి కాలంలో అది చాలావరకు తగ్గిపోయింది. తాజాగా ఎన్నికైన 18వ లోక్‌సభలో ముస్లిం ఎంపీల సంఖ్య 24కు అంటే 4.4 శాతానికి పడిపోయింది. 20 కోట్ల జనాభా కలిగి ఉండి దేశ జనాభాలో సుమారు 15 శాతం మేర ఉన్న ఈ వర్గానికి జాతీయ చట్టసభలో బలం ఆరు దశాబ్దాల కనిష్టానికి పడిపోవడం గమనార్హం. 1980వ దశకంలో వారి ప్రాతినిధ్యం గరిష్ఠంగా 8.33 శాతానికి చేరుకున్నది.
హిందూత్వ రాజకీయాలతో బీజేపీ పైపైకి ఎదుగుతున్న నేపథ్యంలో పార్లమెంటులో ముస్లిం సభ్యుల సంఖ్య నానాటికీ తీసికట్టు అవుతున్నది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే బీజేపీ టికెట్‌పై గెలిచిన 240 మంది ఎంపీల్లో ఒక్కరంటే ఒక్క ముస్లిం కూడా లేకపోవడం కొట్టొచ్చినట్టు కనిపించే అంశం. కాంగ్రెస్ తరఫున అత్యధిక సంఖ్యలో ఏడుగురు గెలిస్తే.. ఆ తర్వాతి స్థానాల్లో తృణమూల్ (5), ఎస్పీ (4) ఉన్నాయి. ఈ మూడూ సాంప్రదాయికంగా లౌకిక పార్టీలే. ఇక మిగిలినవారు ఇస్లామిక్ రాజకీయ పార్టీలుగా పేరొందిన ఐయూఎంఎల్ (3), నేషనల్ కాన్ఫరెన్స్ (2), ఎంఐఎం (1) తరఫున, ఇద్దరు ఇండిపెండెంట్లుగా గెలిచారు. ఈశాన్య రాష్ర్టాల్లో ముస్లింలు ఎంపీలుగా గెలిచిన సందర్భాలు లేవు. దీనికి అసోం మినహాయింపు అయినప్పటికీ అక్కడ కూడా ఈసారి పరిస్థితి సానుకూలంగా లేదని ఫలితాలు తెలియజేస్తున్నాయి. కేరళలోనూ ముస్లిం ఎంపీ సీట్లు తగ్గిపోయాయి. బెంగాల్లో తృణమూల్ 29 స్థానాల్లో గెలిస్తే అందులో ఐదుగురు ముస్లింలు ఉండటం విశేషం.
దేశంలో మైనారిటీ ప్రాబల్యం క్రమంగా తగ్గుతూ పోవడానికి దేశంలో మతవిద్వేష ప్రచారం పెట్రేగడం ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. ఇటీవలి ఎన్నికల్లో పాలక బీజేపీ నేతల ప్రసంగాలు, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు ఈ ధోరణికి పరాకాష్ఠగా నిలిచాయి. ఎన్నికల సంఘానికి దీనిపై ఫిర్యాదులు కూడా అందాయి. తీవ్రమైన మతోన్మాద వాతావరణంలో అల్పసంఖ్యాక వర్గాలు ఒత్తిడికి గురవుతూ క్రమంగా ఎన్నికలకు దూరం అవుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. సంప్రదాయిక ఇస్లామిక్ రాజకీయ పార్టీలు వెనుకతట్టు పట్టడం, ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలూ ముస్లింలను నిలబెట్టేందుకు వెనుకాడటం కూడా దీనికి దోహదం చేస్తున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా ప్రశంసలు అందుకునే దేశానికి ఇది ఏ మాత్రం శోభించే విషయం కాదు. సర్వమత సమభావనతో ఎన్నికలు జరిగితేనే భారతదేశ కీర్తికాంతులు మరింతగా విస్తరిస్తాయి.
Read Today's Latest Editorial News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి.. పాదయాత్ర చేసి కలిసిన యువకుడు
10 voters listed as Same Name | యూపీలో ‘వికాస్ యాదవ్’ పేరుతో 10 మంది ఓటర్లు.. 9 మంది అధికారులపై చర్యలు
PV Sindhu | ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో పీవీ సింధు ఓటమి.. టైటిల్ గెలుచుకున్న వరల్డ్ నెంబర్ వన్ అన్ సె యంగ్
KTR | రాహుల్‌గాంధీకి తెలంగాణ ఒక ఏటీఎంగా మారింది : కేటీఆర్
Health Tips | ఇంట్లో నాఫ్తలీన్ బాల్స్ వాడుతున్నారా..? అయితే ఈ ప్రమాదాల గురించి తెలుసుకోవాల్సిందే..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

