బుధవారం 27 జనవరి 2021
Editorial - Dec 02, 2020 , 01:15:00

చిత్తశుద్ధితో కాలుష్య నియంత్రణ

చిత్తశుద్ధితో కాలుష్య నియంత్రణ
  • నేడు జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవ సందర్భంగా

కరోనా వైరస్‌ మరో దఫా ఈ చలి కాలంలో విజృంభిస్తుందని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనికి వాయు కాలుష్యం కూడా హేతువుగా ఉంటుందన్నది మరింత ఆందోళన కలిగిస్తున్నది. ప్రధానంగా ఉత్తరాది రాష్ర్టాల్లో వాయుకాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొవిడ్‌ కేసులు పెరుగనున్నట్లు శాస్త్రజ్ఞులు వెల్లడిస్తున్నారు. ఏటా వాయు కాలుష్య సమస్య పెరుగుతూ శ్వాసకోశ వ్యాధి పీడితులకు కరోనా వైరస్‌ సోకితే అది అత్యంత ప్రమాదకారిగా పరిణమిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ ఉన్నది. ఇటీవల ఢిల్లీలోని ఎయిమ్స్‌ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశోధనలో చలికాలంలో శ్వాసకోస వ్యాధులతో ఆస్పత్రులకు వచ్చే చిన్న పిల్లల సంఖ్య ఏటా పెరుగుతోందని తేలటం గమనార్హం. 

దేశంలో అన్ని రాష్ర్టాల్లో వాయు కాలుష్య పరిస్థితి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల కంటే ఎన్నో రెట్లు హీనంగా ఉన్నట్లు ప్రపంచ ప్రఖ్యాత వైద్య విజ్ఞాన పత్రిక లాన్సెట్‌ 2017లో తన పరిశోధన పత్రంలో తెలిపింది. ఆ పత్రం ప్రకారం.. దేశవ్యాప్తంగా ఒక్క ఏడాదిలోనే 12.5 లక్షలమంది వాయు కాలుష్యానికి బలయ్యారు. కాలుష్య మరణాలు ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, బీహార్లో అత్యధికంగా ఉన్నాయని తెలియజేసింది. చికాగో విశ్వవిద్యాలయ నివేదిక ప్రకారం భారతీయ పౌరుని సగటు ఆయుర్దాయం దీర్ఘ కాలం పాటు కాలుష్యానికి గురి కావటం వలన నాలుగేండ్లు తగ్గుతున్నదని తేలింది. గత అక్టోబర్‌ నెలలో అమెరికాకు చెందిన హెల్త్‌ ఎఫెక్ట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ నివేదిక ప్రకారం 2019లో వాయు కాలుష్య మృతుల సంఖ్య 17లక్షలకు చేరుకున్నది. 

గత నవంబర్‌లో బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా వెలువరించిన తాజా నివేదికలో ప్యారిస్‌ ఒప్పందంలో పేర్కొన్న కర్బన ఉద్గారాల లక్ష్యాలను చేరుకోలేకపోయిన ప్రపంచ పది నగరాల్లో మనదేశంలో తొమ్మిది ఉన్నాయని పేర్కొన్నది. ప్రపంచవ్యాప్తంగా గాలి, నీరు, శబ్ద కాలుష్యంలో భారతదేశం అత్యంత అధ్వాన్నంగా ఉన్నదని తెలిపింది. ఇటీవలికాలంలో చైనా ప్రభుత్వం తీసుకున్న కాలుష్య నివారణ చర్యల వలన ఈ ఐదు ఆరు ఏండ్లలోనే కాలుష్య తీవ్రత 30 శాతం తగ్గింది. ఒకప్పుడు డిల్లీ కంటే అధ్వానంగా ఉన్న బీజింగ్‌ మెక్సికో నగరాలు ఇప్పుడు ఎంతో మెరుగుపడ్డాయని తెలుస్తున్నది.

దేశంలో మొత్తం వాయు కాలుష్యంలో 51శాతం పారిశ్రామిక కాలుష్యం, 27శాతం వాహన కాలుష్యం, 17 శాతం వ్యవసాయ వ్యర్థాల దహనం, ఐదు శాతం బాణసంచా కాల్చడం లాంటివి ముఖ్యమైనవి. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి జాబితా ప్రకారమే 65 రకాల ప్రమాదకర, అతి ప్రమాదకర పరిశ్రమలు ఉన్నాయి. పరిశ్రమలు వెదజల్లే రసాయన వాయు, నీటి కాలుష్యాల వలన వ్యవసాయ భూమి పనికిరాకుండా పోతున్నది. దేశంలో ఐఎల్‌ఓ అంచనా ప్రకా రం.. ఏటా వృత్తి సంబంధిత వ్యాధుల వలన 4.5 లక్షల మంది కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు.

భారత ప్రభుత్వం నాలుగు దశాబ్దాల క్రితమే 1981లో వాయు కాలుష్య నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత కాలంలో అనేక కాలుష్యసంబంధిత చట్టాలు వచ్చాయి. ఎన్ని చట్టాలు చేసినా కాలుష్యం తగ్గిన సూచనలు కనిపించటం లేదు. పైగా 2020 పర్యావరణ పనితీరు సూచికలో ప్రపంచంలోని 180 దేశాలలో భారతదేశం 168వ స్థానంలో ఉందని ఏల్‌, కొలంబియా విశ్వవిద్యాలయాల పరిశోధకులు తెలుపటం గమనించదగినది 

మన పర్యావరణ చట్టాలు పేలవంగా అమలు జరగడానికి కారణాలు అనేకం. పాలకుల్లో లోపించిన చిత్తశుద్ధి, అవినీతి, బంధుప్రీతి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. కాలుష్య నియంత్రణ ఆశించిన స్థాయిలో ఉండాలంటే.. ప్రభుత్వ జోక్యం లేని స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలి. చట్టాలను ఉల్లంఘించిన సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజల్లో అవగాహన పెంచాలి. ఈ చర్యలన్నీ ప్రభుత్వం అమలు చేసినప్పుడు మాత్రమే ఆశించిన ఫలితాలు వస్తాయి. 

(వ్యాసకర్త: రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి మాజీ సభ్యులు)

పి. నారాయణరావు 


logo