గోల్నాక : మూసీ పరివాహక ప్రాంతాల్లో బఫర్ జోన్‌పై ఎట్టకేలకు స్పష్టత లభించింది. మూసీకి ఇరు వైపుల బఫర్ జోన్ సరిహద్దుల వివరాలను అంబర్‌పేట మండల తాశీల్దార్ వేణుగోపాల్ బుధవారం వెల్లడించారు.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారటీ మార్గదర్శకాలకు అనుగుణంగా చెరువులు, నదులు, నాలాల పరిరక్షణలో భాగంగా హెచ్ఎండీఏ యాక్టు 2008 ప్రకారం సంబంధిత శాఖల సమన్వయంలో అంబర్‌పేట మండల పరిధిలోని అంబర్‌పేట, మలక్‌పేట మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇరువైపుల 9 మీటర్ల వరకు బఫర్ జోన్ సరిహద్దులుగా గుర్తించి నట్లు ఆయన తెలిపారు.
బఫర్ జోన్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని ఆయన కోరారు. ఇది వరకే బఫర్ జోన్ పరిధిలోని నిర్మాణాల వివరాల నోటీసును అంబర్‌పేట మండల కార్యాలయంలో అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు. ఎలాంటి ఆక్షేఫణలు ఉన్నా ఫిబ్రవరి 9 మధ్యాహ్నం 3గంటల లోపు నాంపల్లిలోని ఆర్డీవో కార్యాలయంలో సంప్రదించాలని తాశీల్దార్ వేణుగోపాల్ కోరారు.