ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఈ నెల 6 నుంచి 24 వరకు జరిగే పరీక్షల కోసం ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలో 14,142 మంది ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాయనుండగా 34 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
ఎండల నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా సౌకర్యాలు కల్పించనున్నారు. పరీక్షల సమయంలో సమస్యలు తలెత్తితే విద్యార్థులు 9553188080, 9676590568 నంబర్లను సంప్రదించాలని డీఐఈఓ బుంగ సంజీవ తెలిపారు. భువనగిరి కలెక్టరేట్, మే 2 : ఈ నెల 6 నుంచి 24 వరకు జరుగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించి ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులకు పూర్తిస్థాయిలో ఆదేశాలు జారీ అయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్ద అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా 144 సెక్షన్ అమలు చేయనున్నారు.
14,142 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, 34 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు 7,124 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 7,018 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. 34 పరీక్షా కేంద్రాలల్లో 34 మంది డీఓలు, ఐదుగురు కస్టోడియన్లు, ఇద్దరు ఫ్లయింగ్ స్కాడ్స్, ముగ్గురు సిట్టింగ్ స్కాడ్స్ విధులు నిర్వహించనున్నారు.
34 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని వసతుల కల్పనకు అధికారులు సమగ్ర చర్యలు చేపడుతున్నారు. పరీక్ష సమయంలో తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఆరోగ్య సిబ్బంది, మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచనున్నారు. విద్యార్థులు కరోనా నిబంధనలు పాటించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
ఇంటర్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. జిల్లా వ్యాప్తంగా 34 కేంద్రాల్లో 14,142 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద మౌలిక వసతుల కల్పనతోపాటు 144సెక్షన్ అమలులో ఉంటుంది. విద్యార్థులు నేరుగా http//:tsbie.cgg. gov.in ద్వారా హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకుని దానిపై కళాశాల ప్రిన్సిపాల్ సంతకం చేయించుకుని పరీక్షలకు హాజరు కావాలి. విద్యార్థులకు ఏమైనా సమస్యలు తలెత్తితే 9553188080, 9676590568 నంబర్లను సంప్రదించాలి.
– బుంగ సంజీవ, జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి