లీయతే ఇతి లింగః – జగత్తు మొత్తం దేనిలో లయమై ఉన్నదో అదే లింగం.. మహాలింగం! శివుడు తొలిసారిగా సాకార లింగరూపంలో అవతరించిన రోజు.. మాఘ బహుళ చతుర్దశి అర్ధరాత్రి.. మహాశివరాత్రి. పరమేశ్వరుడు.. ఘోర రూపంలో రుద్రుడిగా, అఘోర రూపంలో శంకరునిగా లోకాలను అనుగ్రహిస్తాడు. పాపాలను పరిహరిస్తాడు.
శివరాత్ర మహోరాత్రం నిరాహారోజితేంద్రియః
అర్చయేద్వా యథాన్యాయం, యథాబలమవంచకః
శివరాత్రి పుణ్యదినాన పూర్తిగా ఉపవాసం ఉంటూ.. రాత్రి జాగరణ చేస్తూ.. శివతత్వాన్ని అర్థం చేసుకుంటూ.. పరమాత్మ చింతనలోనే కాలం గడపాలి. దీనివల్ల ఏడాదికాలం శివపూజ చేసిన ఫలం దక్కుతుందని పెద్దలు చెబుతారు. నారుద్రోరుద్రమర్చయేత్.. రుద్రుడు కానివారు రుద్రుడిని అర్చించలేడు! శివుడు అభిషేక ప్రియుడు. పనిలోపనిగా మన బుద్ధిని కూడా శుద్ధి చేసుకోమని చెబుతాడు.