రెండున్నర వేల సంవత్సరాల కిందట భారతదేశంలో వెలసిన వైద్యవిజ్ఞానం, నేడు ప్రపంచంలోని అత్యున్నత శస్త్రచికిత్సా సంస్థల నివాళులందుకుంటున్నది. స్కాట్లాండ్లోని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడిన్బర్గ్లో భారతీయ ప్రాచీన రుషి, వైద్యుడు సుశ్రుతుడి విగ్రహాన్ని ఈ నెల 19న ఆవిష్కరించారు. 90 కిలోల ఈ కాంస్య విగ్రహాన్ని తమిళనాడులోని స్వామిమలై స్థపతులు భారతీయ శిల్ప సంప్రదాయానికి అనుగుణంగా రూపొందించారు. కొన్నేళ్ల కిందట ఆస్ట్రేలియాలోని రాయల్ ఆస్ట్రేలేషియన్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ప్రాంగణంలో కూడా ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక శస్త్రచికిత్సా సంస్థలలో రెండు ఒకే భారతీయ మహర్షిని ఈ విధంగా గౌరవించడం అత్యంత అరుదైన విషయం. ఆ ప్రాచీన సంపదకు వారసులైన భారతీయులందరికీ గర్వకారణం కూడా.
పూర్వం ప్రాచీన భారతదేశం, మధ్య ఆసియా ప్రాంతాలలో కొన్ని నేరాలకు ముక్కు ఖండించడం శిక్షగా అమలులో ఉండేది. అరణ్యవాసంలో ఉన్న సీతకు అపకారం చేయబోయి, లక్ష్మణుడి చేతిలో శూర్పణఖ తన ముక్కు-చెవులను కోల్పోయిన ఘటన రామాయణంలో ప్రసిద్ధమే. ‘అయోముఖి’ అనే మరో రాక్షస స్త్రీ కూడా లక్ష్మణుని చేతిలో ముక్కును పోగొట్టుకుంది. అంతేకాదు, యుద్ధాలు, ప్రమాదాలు, అడవి మృగాల దాడులు లాంటి అనేక కారణాల వల్ల కూడా ముక్కు, చెవులు వంటి శరీర భాగాలు ఛిద్రమయ్యేవి. అందువల్ల నాసికను పునర్నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది. ఆ సమస్యకు శాస్త్రీయ పరిష్కారాన్ని అందించిన మహర్షే సుశ్రుతుడు. నేడు ప్రపంచవ్యాప్తంగా రైనోప్లాస్టీగా ప్రసిద్ధి చెందిన నాసికా పునర్నిర్మాణ శస్త్రచికిత్సను వ్యవస్థీకరించడమే కాకుండా, సుశ్రుతుడు దానిని శాశ్వతంగా గ్రంథస్థం చేశాడు.
క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దంలో వారణాసి ప్రాంతంలో సుశ్రుతుడు విద్య అభ్యసించినట్లు చెబుతారు. ఆయనకు సంబంధించిన సమాచారం పరిమితంగానే ఉంది. కానీ, సుశ్రుతుడు రచించిన ‘సుశ్రుత సంహిత’ భారతీయ వైద్యవిజ్ఞాన చరిత్రలో మైలురాయిగా నిలిచింది. సహస్రాబ్దాల కాలగమనాన్ని తట్టుకొన్న ఈ గ్రంథం నేటికీ లభ్యమవుతుండటం భారతీయ సాంస్కృతిక-వైద్య వారసత్వానికి సజీవ సాక్ష్యం.
ఆయుర్వేద సంప్రదాయం ప్రకారం.. క్షీరసాగర మథనంలో ఆవిర్భవించిన ధన్వంతరి.. తరువాత కాశీరాజు దివోదాసు రూపంలో అవతరించి, మానవాళికి వైద్యవిద్యను బోధించినట్లు భావిస్తారు. సుశ్రుతుడు ఆ ఆచార్య పరంపరకు చెందినవాడిగా ఆయుర్వేద గ్రంథాలు పేర్కొంటాయి. దివోదాసు ఆయుర్వేదాన్ని అధ్యయన సౌలభ్యం కోసం అష్టాంగ ఆయుర్వేదమనే ఎనిమిది శాఖలుగా విభజించాడు. అవి శల్యతంత్రం, శాలాక్యతంత్రం, కాయ చికిత్స, కౌమార భృత్యం, అగద తంత్రం, రసాయన తంత్రం, వాజీకరణం, భూతవిద్య అనే పేర్లతో ప్రసిద్ధికెక్కాయి. పేర్లు ప్రాచీనమైనవైనా, వాటి అధ్యయన పరిధిని పరిశీలిస్తే అవి నేటి అల్లోపతీ విధానంలోని శస్త్రచికిత్స, నేత్ర-కర్ణ-నాసిక, సాధారణ, శిశు, విషం విరుగుడు, వృద్ధాప్య, పునరుత్పత్తి, మానసిక వైద్య విభాగాలకు సమాంతరమైన అధ్యయన రంగాలుగా ఉన్నట్లు గోచరిస్తుంది. రెండున్నర వేల ఏళ్ల అంతరంతో, వేర్వేరు
ఖండాలలో రూపుదిద్దుకున్న ఈ రెండు వైద్య విధానాలలో కొట్టొచ్చినట్లు కనిపించే భావసారూప్యత విస్మయాన్ని కలిగిస్తుంది.
భారతీయ వైద్య సంప్రదాయంలో చరక సంహితకు ఔషధ చికిత్సలో ఎంతటి ప్రాధాన్యం ఉందో, శస్త్రచికిత్సా రంగంలో సుశ్రుత సంహితకు అంతటి విశిష్ఠ స్థానం ఉంది. చరకుడు కాయ చికిత్సకు మార్గదర్శకుడైతే, సుశ్రుతుడు శస్త్రచికిత్సకు దిశానిర్దేశం చేసిన మహర్షి. అయితే అన్ని శాఖలలోనూ శల్యతంత్రాన్నే అత్యున్నత శాఖగా సుశ్రుతుడు పరిగణించాడు. ఇతర చికిత్సల ఫలితాలు కాలక్రమంలో వెల్లడవుతాయి; శస్త్రచికిత్స మాత్రం తక్షణ ఫలితాలనిస్తుందని ఆయన విశ్వసించాడు. ఆ భావన నేటికీ సజీవంగానే ఉంది.
సుశ్రుత సంహిత కేవలం శస్త్రచికిత్సల జాబితాగా మాత్రమే కాకుండా; శల్యతంత్రానికి సంబంధించిన విజ్ఞాన సర్వస్వంగా రాణిస్తున్నది. ఇందులో మూడు వందలకు పైగా శస్త్రచికిత్సా విధానాలు, నూట ఇరవైకి పైగా వివిధ ధాతువులతో తయారైన శస్త్ర పరికరాల నిర్మాణం, వాటి వినియోగం గురించి ప్రస్తావించి ఉంది. వాటిలో కరపత్రం, మండలాగ్రం, వృద్ధిపత్రం వంటి అనేక పరికరాలను నేటి శస్త్ర పరికరాలకు పూర్వరూపాలుగా భావిస్తుంటారు. నేత్ర శస్త్రచికిత్స, ఎముకలను జోడించటం, గర్భసంబంధ అత్యవసర చికిత్సలు, మూత్రాశయ రాళ్ల తొలగింపు, చెవి-పెదవుల పునర్నిర్మాణం, గాయాల చికిత్స, చర్మ మార్పిడి వంటి అనేక వైద్య ప్రక్రియలను ఈ గ్రంథం వివరిస్తుంది. అంతేకాదు, శరీర నిర్మాణ శాస్త్రం, శవపరీక్ష, వైద్యుని నైతిక బాధ్యతలు, వైద్య విద్యార్థుల శిక్షణ, వైద్యశాలల నిర్వహణ వంటి అంశాలూ ఇందులో పొందుపర్చడం విశేషం.
సుశ్రుత సంహితలో వివరించిన నాసికా పునర్నిర్మాణ విధానం నేటికీ వైద్య చరిత్రకారులను ఆశ్చర్యపరుస్తున్నది. ఈ పద్ధతిలో ముందుగా రోగి ముఖాన్ని పరిశీలించి, ముక్కు అసలు ఆకారం, పరిమాణాన్ని అంచనా వేస్తారు. తరువాత నుదుటి చర్మాన్ని ఒక ప్రత్యేక పద్ధతిలో కత్తిరించేవారు. అయితే చర్మాన్ని పూర్తిగా వేరు చేయకుండా, దాని ఒక చివరను నుదుటికి అనుసంధానం గానే ఉంచడంతో – రక్తప్రసరణ నిరంతరంగా కొనసాగి, చర్మ కణజాలం సజీవంగా ఉండేది. అనంతరం దానిని ముక్కు ఆకారంలో అమర్చి కుట్టేవారు. ముక్కు రంధ్రాలు మూసుకుపోకుండా చిన్న గొట్టాలను అమర్చడం, ఔషధ లేపనాలు, సంక్రమణ నివారణ వంటి అంశాలను కూడా ఆయన నిశితంగా వివరించాడు. శరీర నిర్మాణం, రక్తప్రసరణ, కణజాలం గురించి లోతైన అవగాహనతో రూపొందిన ఈ శాస్త్రీయ విధానం, తరువాతి కాలంలో ‘భారతీయ విధానం’గా విశ్వవిఖ్యాతమైంది.
సుశ్రుత సంహిత అనేక శతాబ్దాల క్రితమే అరబ్బు విద్వాంసుల దృష్టిని ఆకర్షించడంతో, అది అరబ్బీ భాషలోకి అనువాదమై పశ్చిమాసియాకు చేరింది. ఆపై అరబ్బు వైద్యుల రచనల ద్వారా ఐరోపాకు పరిచయమయ్యాయి. ఆధునిక సమాచార సౌకర్యాలు లేని కాలంలోనే… భారతదేశంలో రూపుదిద్దుకున్న వైద్యవిజ్ఞానం భాషలను, సముద్రాలను, నాగరికతలను దాటి ఖండాంతరాలకు ప్రయాణించడం మానవ విజ్ఞాన చరిత్రలో విశేషమైన ఘట్టం.
నేడు ప్రపంచ వైద్య చరిత్రలో హిప్పోక్రటీస్, గాలెన్ వంటి మహనీయులను ఎంత గౌరవంగా స్మరిస్తారో, అదే గౌరవంతో సుశ్రుతుడి పేరును కూడా తలచుకుంటున్నారు. రెండున్నర వేల సంవత్సరాల క్రితం సుశ్రుతుడు వ్యవస్థీకరించిన శల్యతంత్ర విధానం ఖండాంతర ప్రస్థానాన్ని గమనిస్తే, ప్రపంచంలోని అనేక వైద్య చరిత్ర గ్రంథాలు ఆయనను ‘శస్త్రచికిత్స పితామహుడు’, ‘నాసికా పునర్నిర్మాణ శస్త్రచికిత్సకు ఆద్యుడు’గా పేర్కొనడం యాదృచ్ఛికం కాదని స్పష్టమవుతుంది. రెండున్నర వేల సంవత్సరాల క్రితం వారణాసిలో ప్రారంభమైన ఆ విజ్ఞాన యాత్ర ఇంకా కొనసాగుతూ; ఎడిన్‌బర్గ్‌లోని కాంస్యవిగ్రహం రూపంలో, ప్రపంచ వైద్యచరిత్రపై భారతదేశం వేసిన చెరగని ముద్రకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నది.
‘శాస్త్రజ్ఞానం మాత్రమే ఉండి ఆచరణలో నైపుణ్యం లేనివాడు, ఆచరణలో ప్రవీణుడైనా శాస్త్రజ్ఞానం లేనివాడు – ఇద్దరూ వైద్యవృత్తిలో రాణించలేరు’ అన్న సుశ్రుతుడు చెప్పిన ఒక సూత్రం నేటికీ సమయోచితంగానే ఉంటుంది. పుస్తక పరిజ్ఞానం, వృత్తి నైపుణ్యం రెండూ సమపాళ్లలో రంగరించినప్పుడే నిజమైన వైద్యుడు రూపుదిద్దుకుంటాడన్న ఈ భావన ఆధునిక వైద్య విద్యకు కూడా మార్గదర్శకమే.