హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు, మలేసియా ఖగోళ భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ విల్లీసూన్ ఇటీవల ఒక సంచలన ప్రకటన చేసి శాస్త్ర లోకంలో ప్రకంపనలు సృష్టించారు. భగవంతుని ఉనికిని గణితశాస్త్ర సిద్ధాంతాల ద్వారా నిరూపించగలమన్నదే ఆ ప్రకటన సారాంశం. హార్వర్డ్, స్మిత్సోనియన్ సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్‌తో కలిసి పనిచేసిన ప్రఖ్యాత ఖగోళ భౌతిక శాస్త్రవేత్త, ఏరోస్పేస్ ఇంజినీర్ అయిన డాక్టర్ విల్లీసూన్, ఒక గణిత సూత్రమే దేవుని ఉనికికి అంతిమ రుజువు అని పేర్కొన్నారు. టక్కర్ కార్ల్సన్ అనే ప్రఖ్యాత అమెరికన్ జర్నలిస్టు మీడియా నెట్‌వర్క్‌లో పాల్గొన్న ఈ ప్రఖ్యాత శాస్త్రవేత్త, దేవుని ఉనికికి సాక్ష్యమని తాను నమ్ముతున్న తన సూత్రాన్ని సమర్పించారు.
విశ్వంలో భౌతిక స్థిరాంకాలు చాలా పర్ఫెక్ట్గా అమరి ఉండటం వెనుక ఫైన్ ట్యూనింగ్ సిద్ధాంతమే ఆధారమని పేర్కొన్నాడు. ఈ ఫైన్ ట్యూనింగ్ దేవుని ఉనికిని ప్రకటిస్తుంది. విశ్వ భౌతిక స్థిరాంకాలు ఎంత చక్కగా అమిరాయో తెలుపుతూ విల్లీసూన్ కొన్ని ఉదాహరణలు పేర్కొన్నారు. ‘గురుత్వాకర్షణ శక్తి ఇప్పుడు ఉన్న దానికన్నా కొంచెం బలహీనంగా ఉంటే ఈ గ్రహాల ఆవిర్భావం ఉండేది కాదు. విశ్వాంతరాళంలోని విద్యుదయస్కాంత శక్తి కొంచెం ఎక్కువగా ఉంటే అణువులు ఏర్పడేవి కావు. కార్బన్ -12 కేంద్రకం రెసొనెన్స్ ఎనర్జీ కొద్దిగా భిన్నంగా ఉంటే కార్బన్ ఏర్పడేదే కాదు. అసలు జీవ సృష్టి జరిగి ఉండేదే కాదు. ఇదంతా విశ్వం ఉనికిని కాపాడే ఫైన్ ట్యూనింగ్. ఇంత గొప్ప ఫైన్ ట్యూనింగ్ యాదృచ్ఛికంగా జరిగే అవకాశం లేదని, దీని వెనుక గల అదృశ్య శక్తి భగవంతుని ఉనికిని నిరూపిస్తుంద’నేది డాక్టర్ సూన్ అభిప్రాయం.
ఐతే ఈ ఫైన్ ట్యూనింగ్ సిద్ధాంతం కొత్తదేమీ కాదు. ఇరవయ్యో శతాబ్దం మధ్యలో మొదలైంది. ఫ్రెడ్ హాయల్, బ్రాండన్ కార్టర్, స్టీవెన్ వీన్ బర్గ్ లాంటి శాస్త్రవేత్తలు ఈ సిద్ధాంతం అభివృద్ధి చేశారు. దానికే మరిన్ని అదనపు వివరాలు జోడించి డాక్టర్ విల్లీ సూన్ ఇటీవల ప్రాచుర్యం పొందారు. భౌతిక స్థిరాంకాలను విశ్వంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఒకే విలువ కలిగి ఉండే ప్రకృతి నియమాల సంఖ్యలుగా భావించవచ్చు. ఈ ఆలోచన అతడికి పాల్ డిరాక్ పరిశోధనల ప్రేరణతో వచ్చింది. డాక్టర్ పాల్ డిరాక్ బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త. ఇతను ఎర్నెస్ట్ ష్రోడింగర్తో కలిసి 1933లో నోబెల్ బహుమతి అందుకున్నారు. క్వాంటం మెకానిక్స్, ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతాన్ని కలిపి డిరాక్ ఒక అతిగొప్ప సమీకరణం రూపొందించాడు. ఇది ఎలక్ట్రాన్ల సాపేక్ష తరంగ స్వభావ సమీకరణం. ఎలక్ట్రాన్ల యాంటి మ్యాటర్ ఉనికిని ఇది నిరూపిస్తుంది. ఇది క్వాంటం ఫిజిక్స్‌లో ఆధునిక భావనలకు పునాది వేసింది. ఈ సమీకరణం అత్యంత అందమైన, అత్యంత శక్తిమంతమైన, అత్యంత సంక్లిష్టమైన సమీకరణంగా పరిగణిస్తారు. 1932లో పాజిట్రాన్ కనుగొనడంతో డిరాక్ ఊహ నిజమైంది. భగవంతుడిని గణిత శాస్త్ర హయ్యర్ ఆర్డర్ సమీకరణంగా భావిస్తూ గణిత సౌందర్యం అనే భావనకు ప్రాధాన్యం ఇచ్చిన గొప్ప శాస్త్రవేత్త డిరాక్. అంతే కాకుండా ‘మనం మన అవసరాలకు జీవించగలిగే అనుగుణ్యమైన ప్రకృతి గల విశ్వంలోనే జీవిస్తున్నాం’ అని 1973లో ఆంథ్రోపిక్ ప్రిన్సిపుల్ అనే దేవుని ఉనికి సశాస్త్రీయం అని చెప్పే భావన ప్రతిపాదించిన డాక్టర్ బ్రాండర్ కార్టర్ సిద్ధాంతాన్ని ఫ్రెడ్ హోయల్ ప్రతిపాదించిన కర్బన అణు నిర్మాణ సిద్ధాంతాన్ని ఆలంబనగా తీసుకున్నారు డాక్టర్ సూన్.
ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త ఫ్రెడ్ హోయల్ నక్షత్రాలలో కార్బన్ ఏర్పడడానికి అవసరమైన ప్రత్యేక శక్తి స్థాయిని హోయల్ రెసొనెన్స్గా పేర్కొన్నాడు. నక్షత్రాలలో సాధారణంగా రెండు హీలియం కేంద్రకాలు కలిసి బెరీలియం ఏర్పడుతుంది. ఇది అత్యంత అస్థిరమైనది. కానీ, ఇది మరో హీలియంతో కలిసి కార్బన్‌గా మారుతుంది. ఇది సెకన్లో లక్షోవంతులో జరగాలి. జరుగుతూనే ఉంది. దీనిని ట్రిపుల్ ఆల్ఫా ప్రాసెస్ అంటారు. ఇది జరగడానికి కార్బన్ అణువులో ఒక ప్రత్యేకమైన శక్తి స్థాయి (ఎనర్జీ లెవెల్) ఉండాలని ఊహించాడు హోయల్. తరువాత శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాలలో ఈ విషయం నిరూపితమైంది. ఇందులో ఏ మాత్రం తేడా వచ్చినా జీవకోటి ఉనికికి ఆస్కారం ఉండదు. అందుకే హోయల్ దీనిని యాదృచ్ఛికం అని ఒప్పుకోడు. ఇది ఫైన్ ట్యూనింగ్కు బలమైన ఉదాహరణ. ఆ తరువాత హాకింగ్ లాంటి శాస్త్రవేత్తలు విశ్వం సహజ నియమాలతోనే ఏర్పడిందని దేవుని ప్రమేయం లేదని పేర్కొన్నా.. అసంతృప్తి గల మరికొందరు మల్టీవర్స్ అనే మరో సిద్ధాంతం ప్రకటించారు. బహుళ విశ్వాలు గల సృష్టి అనేది ఈ సిద్ధాంతం. కవితాత్మకంగా చెప్పాలంటే సృష్టి ఒకే ఒక దీర్ఘ కవిత కాదు. కొన్ని విశ్వాలనే దీర్ఘ కవితలు కల ఒక సంపుటి (మల్టీవర్స్) గా దీనిని చెప్పవచ్చు.
ఐతే వేరు వేరు విశ్వాలలో భౌతిక స్థిరాంకాలు మారుతాయా ఇలాగే ఉంటాయా? అనే ప్రశ్నకు సమాధానం లేదు. ఈ సిద్ధాంతం ఏ ఒక్కరిదో కాదు. స్టీఫెన్ హాకింగ్ కూడా దీనిపై విశేష పరిశోధన చేశాడు. తన మరణానికి కొన్ని రోజుల ముందు ప్రకటించిన తన పరిశోధన పత్రంలో మల్టీవర్స్ గురించి చర్చించారు. ఈ విశ్వాల సంఖ్య అనంతం కాకపోవచ్చని, ఇవి కూడా ఒకే రకమైన భౌతిక స్థిరాంకాలనే కలిగి ఉంటాయని ఆయన ప్రకటించారు. చివరి రోజుల్లో దేవుని ఉనికికి సంబంధించిన అంశం అతనికి కుదురు లేకుండా చేసిందని అనిపిస్తుంది. ఈ ఫైన్ ట్యూనింగ్ ఒక శాస్త్రీయమైన పరిశీలనే అయినప్పటికీ శాస్త్రం ఒప్పుకొనే ప్రయోగపరమైన రుజువులు ఇవ్వలేకపోయింది. ఇక్కడే తత్త్వ శాస్త్రం, ఆధ్యాత్మికత రంగం ప్రవేశం చేస్తాయి. ఎలా? ఎందుకు? అన్న ప్రశ్నలు మనను లోతైన ఆలోచనలకు ప్రయాణింపజేస్తాయి. ఇప్పుడు జరుగుతున్నదదే. గత మార్చిలో డాక్టర్ విల్లీ సూన్ భగవంతుని ఉనికి శాస్త్రీయమే అని చేసిన ప్రకటన ఫైన్ ట్యూనింగ్ అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది. ‘ద మ్యాథమేటీషియన్ ప్రూవ్స్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్’ అనే శీర్షికతో పతాక శీర్షికలకు చేరి చర్చనీయాంశంగా మారింది.