యతో ధర్మస్తతో హనుమః యతో హనుమః తతో జయః ధర్మం ఎటువైపు ఉంటే హనుమంతుడు అక్కడుంటాడు. హనుమంతుడు ఎటువైపు ఉంటే జయం అటువైపు ఉంటుంది. అంటే విజయానికి పర్యాయ పదంగా హనుమను సుందరకాండ ఆవిష్కరిస్తుంది. చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు హనుమత్ విజయోత్సవం జరుపుకోవడం ఆనవాయితీ. రామాయణంలోని సుందరకాండలో సీతాదర్శనం చేసుకుని అశోకవన విధ్వంసం, తర్వాత లంకాదహనం చేసింది చైత్ర పౌర్ణమి నాడే! అందుకే ఇది హనుమత్ విజయోత్సవ పర్వంగా మారింది.
విజయానికి ప్రతీకగా చెప్పే హనుమంతుని తత్వం ఆదర్శప్రాయం. రామకార్య సాధకునిగా ఆంజనేయుడి లక్షణాలు నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలి. ఆయనను కార్యశూరునిగా చూపించిన సుందరకాండ నిత్య పారాయణ గ్రంథం. ఇందులోని ప్రతీ శ్లోకం ఆంజనేయుడి తత్వాన్ని, ప్రధానంగా 42 నుంచి 58 సర్గల వరకు కపివీరుడి విజయ పరంపరను ఆవిష్కరిస్తాయి. ఈ ఘట్టాలు జరిగిన రోజును విజయోత్సవంగా చెప్పుకొంటారు. ఆనాడే హనుమంతుడు లంకలో సీతమ్మను చూసి, అక్షాది రాక్షసులను సంహరించాడు. రాక్షస సంహారం తర్వాత రావణుడి కొలువులో రాముడి వైభవాన్ని చాటుతాడు. దానిని సహించక లంకేశుడు హనుమ వాలానికి నిప్పు పెడితే.. లంకాదహనం చేస్తాడు. లంకా దహనం గావించిన రోజున విజయోత్సవం జరుపుకోవడం దక్షిణాది రాష్ర్టాల్లో ఆనవాయితీ. కాగా ఉత్తరాదిలో మాత్రం చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు హనుమత్ జయంతిని చేసుకుంటారు. పరాశర సంహితను అనుసరించి ‘వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే’ అనే శ్లోకం హనుమంతుడి జననం గురించి పేర్కొంది. అందుకే వైశాఖ బహుళ దశమి నాడు మన ప్రాంతంలో హనుమత్ జయంతి జరుపుకొంటారు. చైత్ర పౌర్ణమి నాడు హనుమంతుడి బలం, భక్తి, వినయం, విధేయతను చాటిచెబుతూ ఆయన సాధించిన రామకార్యం, లంకా దహనాన్ని స్మరించుకుంటూ, అంజనీ సుతుణ్ని విజయ ప్రదాతగా కీర్తిస్తూ.. ఈ విజయోత్సవం నిర్వహించుకుంటారు.
వానరులు నలుదిశలా సీతమ్మజాడ వెతకడానికి వెళ్లినప్పుడు దక్షిణ దిక్కున లంకలో అమ్మవారిని కనుగొన్నాడు హనుమ. అంతకుముందు నూరు యోజనాలు దాటడానికి తనకున్న బలం మీద నమ్మకం లేకపోతే జాంబవంతుడి ప్రేరణతో రివ్వున లంకకు పయనమయ్యాడు. ఆయన ఎన్నోచోట్ల సీతమ్మ కోసం వెతుకుతాడు. చూడరాని ఎన్నో సన్నివేశాలను చూస్తాడు. కానీ, తనకు మానసిక దౌర్బల్యం, లౌక్యం లేదని సమాధానపడి సీతమ్మ కోసం అన్వేషణ కొనసాగిస్తాడు. ఎంత వెదికినా తల్లి సీతమ్మ కనబడక ఎంతో నిరాశకు గురవుతాడు. ఆ తల్లి జాడ కనుక్కోలేకపోతే తాను అక్కడే ఉండి తపస్సు చేసుకుందామని, ప్రాయోపవేశం చేసి తనువు చాలిద్దామని కూడా భావిస్తాడు. కానీ, ఎక్కడికక్కడ సమాధానపరుచుకుంటూ ముందుకుపోతాడు. జీవించి ఉంటే ఎప్పటికైనా విజయం సాధ్యమని హనుమంతుడి ఆలోచన ద్వారా వాల్మీకి మహర్షి మనకు సందేశమిచ్చాడు.
ఎన్ని అవరోధాలు ఎదురైనా హనుమ ముందుకుసాగాడు. చివరికి సీతమ్మతల్లి దర్శనం చేసుకుంటాడు. ఎంత గొప్పవారికైనా కష్టాలు తప్పవు. కాలం బలీయమైనది. ఒక కార్యం సాధించాల్సి వచ్చినప్పుడు మనం ఎంతో ప్రయత్నం చేస్తాం. కొన్నిసార్లు ఆశించిన ఫలితం రాలేదని డీలాపడిపోతాం. కార్యదక్షుడు ఆటుపోట్లకు వెరవడు. నిరాశ ముసురుకున్నా.. అంతలోనే తేరుకొని ధైర్యాన్ని సమకూర్చుకుంటాడు. మన ప్రయత్నలోపం ఏమీ లేనప్పుడు తప్పక ఫలితం దక్కుతుంది అనడానికి హనుమకు కలిగిన సీతమ్మ దర్శనమే సంపూర్ణ నిదర్శనం.

దైవం మీద భారం వేసి త్రికరణశుద్ధిగా ప్రయత్నిస్తే తప్పక విజయం సాధిస్తాం. ఎంత ప్రయత్నం చేస్తున్నా ఫలితం రానప్పుడు సుందరకాండ పారాయణం చేయమంటారు పెద్దలు. సుందరకాండ ఘట్టాలు చదవడం వల్ల, సాధన తత్వం బోధపడుతుంది. అలుపెరగని పోరాటం చేయాలన్న సంకల్పం ఏర్పడుతుంది. బుద్ధికి పదును పెడితే తలచిన కార్యం నెరవేర్చుకునే మార్గాలు కనిపిస్తాయన్న నమ్మకం కుదురుతుంది. అందుకు సుందరకాండలోని హనుమత్ విజయమే తార్కాణం. సీతమ్మ దర్శనంతో తను లంకకు వచ్చిన పని పూర్తయింది. కానీ, రాంబంటు సామాన్యుడా?! లంక ఆనూపానూ తెలుసుకోవాలని, తన రామయ్యకు కార్య భారం తగ్గించాలన్న నిశ్చయంతో రంగంలోకి దిగాడు. అశోక వనాన్ని నాశనం చేశాడు. రావణుడి సైన్యాన్ని తునాతునకలు గావించాడు. రావణుణ్ని ప్రత్యక్షంగా చూడాలనే ఉద్దేశంతోనే ఇంద్రజిత్ బ్రహ్మాస్ర్తానికి కట్టుబడతాడు. రావణుడికి చెప్పాల్సిన నాలుగు మంచి మాటలు చెబుతాడు. లంకేశుడి ఆజ్ఞతో రాక్షసులు హనుమ తోకకు నిప్పంటిస్తారు. సీతమ్మ పాతివ్రత్య మహిమతో ఆ నిప్పు హనుమను ఏమీ చేయదు. ఇదే అదనుగా హనుమ విజృంభిస్తాడు. రావణ లంకకు నిప్పంటించి.. తన ప్రభువైన రాముడి శక్తిని చాటుతాడు. పైగా రాముడి సైన్యంలో తనకన్నా గొప్ప యోధులు ఉన్నారని చెబుతాడు. తానే ఇంత పరాక్రమిస్తే.. తనను మించిన యోధులు ఇంకెంత విక్రమిస్తారో అంచనా వేసుకోండని రావణుడికి హనుమ సవాలు విసిరినంత పనిచేశాడని ఈ సందర్భాన్ని ఆధ్యాత్మికవేత్తలు విశ్లేషిస్తారు.
అశోకవాటిక ధ్వంసం చేసే సందర్భంలో హనుమంతుడు చెప్పిన ఈ శ్లోకాలు జయమంత్రంగా లోక ప్రసిద్ధి. చేపట్టిన కార్యంలో విజయం సాధించడానికి ఈ శ్లోకాలు సాధన చేయాలని పెద్దలు చెబుతారు.
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః
రాజాజయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః॥
దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః
హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః॥
న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః॥
అర్థయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీమ్
సమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్
(సుందరకాండ, సర్గ 42, శ్లో 33-36)
ఈ శ్లోకాలను జపించడం ద్వారా విజయం, ధైర్యం, కష్టాలను ఎదుర్కొనే శక్తి లభిస్తుందని నమ్మకం.
రావణ సంహారం తర్వాత అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడైన రాముడు తన విజయానికి ఎంతగానో దోహదపడిన హనుమంతుడిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటాడు. సీతమ్మ తన ముత్యాల హారాన్ని హనుమకు బహూకరిస్తుంది. ఈ ఘట్టాన్ని స్ఫురణకు తెస్తూ భద్రాచలంలో శ్రీరాముని పట్టాభిషేకం సమయంలో ముందుగా హనుమకు పుణ్యజలాలతో అభిషేకించి, సీతమ్మవారి తరఫున హారాన్ని బహూకరించిన తర్వాతే పట్టాభిషేకం ఘట్టం ముగుస్తుంది. సీతారాములకు అత్యంత ప్రీతిపాత్రుడైన హనుమంతుడిని.. భక్తరాజుగా పట్టాభిషేకం చేయడం ఈ మొత్తం మహోత్సవం ప్రధాన ఘట్టాల్లో ఒకటిగా అభివర్ణిస్తారు. హనుమంతుడి నామాన్ని స్మరించినా, ఆయన సుందరకాండలో అనుసరించిన మార్గాలను అనుసరించినా తలచిన సత్కార్యం తప్పకుండా సిద్ధిస్తుంది. హనుమత్ విజయోత్సవ పర్వం ఇదే రుజువు చేస్తుంది.