తిరుమల : తిరుమల ( Tirumala ) లో బ్రహ్మోత్సవాలకు ( Brahmotsavams ) ముహూర్తం ఖరారయ్యింది . అధికమాసం కారణంగా ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తు న్నారు. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ప్రణాళికలు రూపొందించి నిర్దేశిత సమయంలోపు పూర్తి చేయాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి( Venkaiah Chowdary ) సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
గురువారం నిర్వహించిన సమీక్షలో తిరుపతి జేఈవో డాక్టర్ ఏ.శరత్, సీవీఎస్వో మురళీకృష్ణ, అధికారులతో సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 8 నుంచి 23వ తేదీ వరకు జరిగే ఉత్సవ వివరాలను వెల్లడించారు. 8వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 14 బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, 15న ధ్వజారోహణం, 19న గరుడ వాహనం, 22 రథోత్సవం, 23న చక్రస్నానం కార్యక్రమాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేయాలన్నారు.
ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయని వివరించారు. బ్రహ్మోత్సవ రోజుల్లో భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నామని వెల్లడించారు. వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐ, దాతల దర్శనాలు కూడా రద్దు చేసినట్లు తెలిపారు.