ఒక యువ పత్తి రైతును భజన బృందంలో చేరాలని పక్క ఊర్లోని ఆలయ నిర్వాహకులు కోరారు. ‘చేరుదామా వద్దా’ అని ఆలోచనల్లో పడ్డాడు రైతు. ఎలాగైతే అలాగవుతుందని ఒకరోజు భజనకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చాక బంధువులు, స్నేహితుల వెక్కిరింతలు మొదలయ్యాయి. ‘అప్పుడే ముసలివాడివైపోయావా? సంసారం వదలి సన్యాసంలో చేరిపోతావా?’ అని వెటకారంగా మాట్లాడారు. వారికి ఏం సమాధానం చెప్పాలో రైతుకు తెలియలేదు. అప్పుడే ఊర్లోకి ఒక బూడిద రంగు ఏనుగు వచ్చింది.
ఏనుగు చుట్టూ పిల్లలు చేరి ఎగురుతూ ఉన్నారు. ఏనుగు వెంట గుబురు మీసాల మావటివాడు ఉన్నాడు. అతని చేతిలో అంకుశం కూడా ఉంది. ఊర్లోకి వచ్చిన ఏనుగును చూసి వీధి కుక్కలు గట్టిగా అరవసాగాయి. కుక్కల అరుపులను ఏమాత్రం పట్టించుకోలేదు ఏనుగు. పెద్దపెద్ద చెవులను ఆడిస్తూ మావటితోపాటు ముందుకు సాగింది. ఏనుగు వాలకం చూసి ఆశ్చర్యపోయాడు రైతు. పరుగెత్తుకు వెళ్లి మావటివాడిని- ‘ఏనుగు బలమైన జంతువే కాకుండా సున్నిత స్వభావం కలిగినదని చెబుతారు. అన్ని కుక్కలు మొరుగుతున్నా ఏనుగుకు చీమ కుట్టినట్లుగా కూడా లేదు, ఈ ఏనుగుకు చెవులు పని చేయవా?’ అని అడిగాడు. మావటివాడు ముసిముసి నవ్వులు నవ్వాడు. ‘మంచి వినికిడి శక్తి కలిగినది ఈ ఏనుగు.
చిన్న చిన్న శబ్దాలు కూడా దీనికి చక్కగా వినబడతాయి. కుక్కలు మొరగడం సహజం. కొత్త జంతువు తమ ప్రాంతంలోకి వస్తే అవి తమ ఉనికిని చాటుకోవడానికి మొరుగుతాయి. అయినా కుక్కలు మొరగడం లాంటి చిన్నచిన్న విషయాలు పట్టించుకుంటే అది ముందుకు ఎలా వెళ్లగలుగుతుంది? నాతోపాటు గమ్యం ఎలా చేరుకుంటుంది?’ అని బదులిచ్చాడు. రైతుకు మావటివాడి మాటలు స్పష్టంగా అర్థమయ్యాయి. ‘వంద మంది ఉంటే వంద రకాల ఆలోచనలు పుట్టుకొస్తాయి. ఎవరి అభిప్రాయం వారిది. మన మనసుకు మంచిదనిపించిందే మనం చేయాలి. భజన చేస్తే మంచిదే కదా. భక్తికి భక్తి, ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది’ అనుకుంటూ యువరైతు భజనకు వెళ్లడం కొనసాగించాడు.
-ఆర్సీ కృష్ణస్వామి రాజు, 93936 62821