మమ మాయా దురత్యయా!
‘పుట్టిన వానికి ఎట్టకేలకు గిట్టుట తప్పదు కదా!’ అనుకొంటూ పిరికితనంతో నిట్టూరుస్తూ ఉండరాదు. మానవులకు బేలతనం పనికిరాదు. ఎప్పటికైనా కాలమే బలవంతమన్నమాట ఉన్నప్పటికీ, దిట్ట తనం- ధైర్యంతో బుద్ధిబలం కొలది, అపాయం తొలగే ఉపాయం ఆలోచించాలి అని నిశ్చయించాడు.
పరమర్షి శుకయోగి పరీక్షిత్తుతో.. వసుమతీశా (రాజా)! కసి పూనిన కంసుడు దేవకిని ఒడిసిపట్టి అసి-కత్తి దూసి తెంపు- సాహసం చేసి చంపబోగా చూసి, ఎలాగైనా ఒప్పించి తప్పించాలని వసుదేవుడు మనసులో ఇలా తలపోశాడు…
కం॥ ‘ఎందును గాలము నిజమని
పందతనం బునను బుద్ధిఁ బాయక ఘనులై
యెందాఁక బుద్ధి నెగడెడి
నందాఁకఁ జరింప వలయు నాత్మ బలమునన్’
‘పుట్టిన వానికి ఎట్టకేలకు గిట్టుట తప్పదు కదా!’ అనుకొంటూ పిరికితనంతో నిట్టూరుస్తూ ఉండరాదు. మానవులకు బేలతనం పనికిరాదు. ఎప్పటికైనా కాలమే బలవంతమన్నమాట ఉన్నప్పటికీ, దిట్ట తనం- ధైర్యంతో బుద్ధిబలం కొలది, అపాయం తొలగే ఉపాయం ఆలోచించాలి అని నిశ్చయించాడు. వసుదేవుడు.. బావా! దేవకిని చంపితే నీకు దివ్యత్వం- అమరత్వం అబ్బుతుందా? అసలు నీ చావుకు కారణం ఆమె సంతానమే కాని ఆమె కాదు కదా! కంసుడు.. అవును, ఐతే ఏమిటంట? వసుదేవుడు.. ఈమె అపత్యం- సంతానాన్ని చంపడానికి తప్పక నీకే అప్పగిస్తా. ‘ఈ ఒప్పందం చాలా ఒప్పిదం- అందంగా ఉంది. ఇలా అయితే స్త్రీ హత్యా పాపపు ముప్పు నుంచి కూడా తప్పుకుంటా’ అని తలచి కంసుడు చప్పున చెల్లెలి కొప్పు విడిచి వెళ్లిపోయాడు.
‘బతుకు జీవుడా’ అనుకొంటూ వసుదేవుడు సుందరి- భార్యతో మందిరానికి చేరి ఇందిరావరుని స్మరిస్తూ ఆనందంగా ఉన్నాడు. అంత కొంత కాలానికి ఆ ఇంతి దేవకి, కంసుడు నిరంతరం పెట్టే వంతలు- కష్టాలు సహిస్తూ సంతసంతో సమస్త దేవతల భావాన్ని పొంది ఏడాదికి ఒకరు చొప్పున ఎనమండుగురు కొడుకులను, ఏకైక కుమార్తె- సుభద్రను కన్నది. ‘బతకని బిడ్డ బారెడు’ అన్న చందాన దేవకి కన్న ప్రథమ పుత్రుని పేరు ‘కీర్తిమంతుడు’. ‘అపత్య- పుత్ర రక్షణ కన్నా సత్యరక్షణే మిన్న’ అని అనుకొన్న ఆనక దుందుభి (భగవంతునికి తండ్రి కాబోతున్నాడని ఈ భాగ్యవంతుని జన్మకాలంలో భేరీ మృదంగాలు మోగినందున అతనికి ఈ నామం)- వసుదేవుడు, తాను అన్నమాట ప్రకారం దేవకి మున్నుగా కన్న బిడ్డను ఖిన్నుడవక- కలత చెందక కంసునికి విన్నవించాడు. శుక ఉవాచ…
ఆ॥ ‘మానవేంద్ర! సత్యమతికి దుష్కరమెయ్య
దెరుక గలుగువాని కిష్టమెయ్య
దీశభక్తిరతుని కీరాని దెయ్యది
యెరుక లేనివానికేది కీడు’
‘రాజా! సత్యవంతునికి కష్టమనేది ఉంటుందా? జ్ఞానికి ఇష్టమనేది, ఈశ్వర భక్తునికి ఇవ్వరానిది, అజ్ఞానికి ‘మంచి-చెడు’ అను విజ్ఞానమూ ఉంటుందా? తన మొదటి మగబిడ్డను ఏమాత్రం వగవక- దుఃఖించక పగవానికి చంపగ సమర్పించిన వాడు- ‘ఇల వసుదేవుండు తక్క నితరుడు కలడే?- సత్యమతి అయిన వసుదేవుడు తప్ప వసుమతి- జగతిలో ఇట్టి సుమతి ఇతరుడున్నాడా? వసుదేవుని సమబుద్ధికి, సత్యనిష్ఠకు కంసుని కరకు మనసు కూడా కరిగింది. వాడన్నాడు… ‘బావా! ఈ పసివానిని, కసుగందు- లేతబిడ్డను నీవే తీసుకొనిపో. వీనివలన నాకు వెరపు- భయం లేదుగా! నా పాలిటి కాలుడు- యముడైన నీ ఆలి ఎనిమిదవ చూలిని మాత్రం మీరెంత బతిమాలినా జాలి చూపక వెంటనే వధిస్తా. వసుదేవా! అంతవరకు నిన్నిక ఎంతమాత్రం విసిగించను.’ కంసుడు ఇలా పలకగానే వసుదేవుడు తన నందనుని- బిడ్డను వెనకకు తెచ్చుకున్నా, అనుమానంగానే కాని ఆనందంగా మాత్రం లేడు. వాని అలుక- ద్రోహ చింతన తలచి ‘ఎప్పుడేమో’ అని లోలోపల ఉలికిపడుతూనే ఉన్నాడు.
ఇలా ఉండగా ఒకనాడు నారద మహర్షి కంసుని వద్దకు పనికట్టుకొని వచ్చి ఏకాంతంగా అతని చెవిలో ఇలా ఊదాడు… ‘కంసా! మంద- వ్రేపల్లెలోని నందాదులు, మథురలోని వసుదేవాది యాదవులు, వారి భార్యలు అందరూ సురులు- దేవతలే కాని నరులు కారు. నీవు కూడా గత జన్మలో కాలకాలుడైన నారాయణుని చేతిలో విగత జీవుడవైన ‘కాలనేమి’ దానవుడవు. దేవదేవుడు శ్రీహరి, శిష్టయగు దేవకీ మాత అష్టమ గర్భంలో అవతరించి భూతలాన్ని అతలాకుతలం గావించే నీవంటి దుష్టులందరినీ సంహరిస్తాడు. జాగ్రత్త పడు’. ‘దేవకి అష్టమ గర్భం కదా నాకు అరిష్టం. ఇప్పటినుంచే ఈ రొష్టు ఎందుకు దేవర్షీ’ అన్నాడు కంసుడు. నారదుడు- ‘అమాయకుడా! దేవమాయనా నీవు నమ్మేది? రెండవ దాని నుంచి లెక్కవేస్తే మొదటిది ఎనిమిదవది అవదా? కంసా! మాయ అనిర్వచనీయం. అది ‘అఘటన ఘటనా పటీయసి’- అసంభవాన్ని సుసంభవం చేయగలది. ఇందులో ఒకటి ఎమిదవుతుంది. ఎనిమిది ఒకటవుతుంది.
ఆలోచించుకో’ అని హెచ్చరించి దేవలోకానికి వెళ్లిపోయాడు. ఈ లెక్కవిని కంసుడు అవాక్కయ్యాడు. పెచ్చరిల్లిన కచ్చతో తిన్నగా వెళ్లి దేవకీ వసుదేవులను ఉన్నపళంగా చెరసాలలో బంధించాడు. వారి ఆరుగురు కుమారులను మారజనకుని- విష్ణుని రూపాలుగా భావించి ఒకేమారు క్రూరంగా వధించాడు. నిగ్రహం కోల్పోయి ఆగ్రహించి తండ్రి ఉగ్రసేనుని కూడా కారాగృహంలో నిర్బంధించి తనను తాను ప్రభువుగా ప్రకటించుకొన్నాడు. దేవకికి పుట్టిన ఆరుగురు పుత్రులూ గతంలో మరీచి సంతానం. పుట్టగానే గిట్టునట్టి శాపం మూటగట్టుకొని పుట్టినవారు. ఈ గుట్టు తెలిసిన నారదుడు కంసుని పాపం త్వరగా పొందడానికి వానిలోని కోపాన్ని- హింసను తట్టిలేపాడు. జీవుల పాపపుణ్యాలతో దేవునికి ప్రమేయం ఉండదు. ఈశ్వరుడు తారకుడు- తరింపజేసే ఉద్ధారకుడే కాని, మారకుడు కాదు. పరమాత్మ ఎవరినీ చంపడు. మనిషి పాపమే అతనికి మారకం. కాన, నిరంతరం పాపానికి భయపడాలి.
శుక ఉవాచ- రాజా! ఇలా రాజ్యం కైవసం చేసుకొన్న కంసుడు బాణ, నరక, జరాసంధ, ధేనుక, కేశి, ప్రలంబ, తృణావర్త, చాణూర, ముష్టిక, అరిష్ట, అఘ, బక, పూతనాది జగత్ జెట్టీలైన అసురులను జయించి తన అనుచరులుగా కూడగట్టుకున్నాడు. అంతఃకరణంలోని కామ, క్రోధాది అశుభ వాసనలే అసుర విసరం- సమూహం! ఇది పరమార్థం! అనంతరం ఆదిశేషుడనబడే అంశతో విశ్వగర్భుడు- విష్ణుమూర్తి తేజస్సు దేవకీదేవి గర్భాన ఏడవ అర్భకుని- శిశువుగా నిలిచింది. అప్పుడు మాయాపతి- మాధవుడు యోగమాయను పిలిచి ఇలా ఆదేశించాడు… ‘దేవీ! దేవకి కడుపులో ఉన్న శేషుడనే నా తేజస్సును సంకర్షించి- బయటికి తీసి ఒడుపుగా గోకులంలో తలదాచుకొంటున్న ఉత్తమురాలైన వసుదేవుని భార్య రోహిణి గర్భంలో ప్రవేశపెట్టు. తదుపరి నేను నా పూర్ణాంశతో దేవకికి అష్టమగర్భంగా అవతరిస్తా. కల్యాణీ! నీవు కూడా గోకులంలో నందరాణి యశోదకు బిడ్డవై పుట్టు’.
యోగమాయను ఆశ్రయించక పరబ్రహ్మ అవతారం గ్రహించలేడు. శబల బ్రహ్మకు- మాయతో కూడిన భగవంతునకు తప్ప శుద్ధబ్రహ్మకు అవతారం లేదు. చొక్కపు- శుద్ధమైన అపరంజి- బంగారులో రాగి కలవనిదే సింగారానికి, మక్కువ గల చక్కని ఆభరణం ఏర్పడదు కదా! యోగమాయ పరబ్రహ్మ చెప్పుచేతలలో మెలిగే శక్తి. స్వామి అప్పజెప్పిన పని చకచక చేసేసింది. తెల్లవారే సరికల్లా మథురాపుర ప్రజలెల్లరూ దేవకికి గర్భస్రావం జరిగిందని గొల్లుమంటూ గగ్గోలుపెట్టారు. పిమ్మట రోహిణికి కుమారుడు కలిగాడు. భాద్రపద శుద్ధ ఏకాదశిన బలరామావతారం. బలరాముడు వేదశాస్ర్తాది రూపమైన శబ్ధబ్రహ్మ స్వరూపం. అవని పైకి కాని, అంతఃకరణంలోకి కాని శబ్ధబ్రహ్మ రాక తరవాతే పరబ్రహ్మ- కృష్ణుని ఆగమనం! పరిపూర్ణంగా కలిగిన పరోక్ష జ్ఞానం అపరోక్షమవుతేనే పరబ్రహ్మ అనుభవం. స్వానుభవం లేని కేవల వాచా (బుకిష్) జ్ఞానం అజ్ఞానంతో సమానం. కాంతుని- భర్తను ఎడబాసి నందుని ఇంట ఏకాంతంగా ఉంటున్న వసుదేవ పత్ని రోహిణి ఎలా అంతర్వత్ని- గర్భవతి కాగలిగిందన్న వింతను గురించి లోకానికి ఆవంత కూడా శంక కలగకపోవడం పంకజాక్షుని కింకరి, సర్వజీవ వశంకరి అయిన మాయాదేవి ప్రభావం!
(సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ 98668 36006
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

