లక్నో : యూపీలోని ఫిలిబిత్‌లో ఓ మహిళా కళాశాల కేంద్రంగా సాగిన అరాచక పర్వం వెలుగుచూసింది. రాంలుభి సహాని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఓ ప్రొఫెసర్ సెక్స్ రాకెట్ నిర్వహిస్తూ విద్యార్ధినులచే డ్రగ్స్ వాడకాన్ని ప్రేరేపిస్తూ శారీరక సంబంధాలు కొనసాగించమని వారిపై ఒత్తిడి తెస్తున్న ఉదంతం కలకలం రేపింది.
కాలేజ్‌లో మ్యాధ్స్ ప్రొఫెసర్ కమ్రాన్ ఆలం ఖాన్ విద్యార్ధినులను స్మోకింగ్, డ్రగ్స్ వాడేలా ప్రేరేపించడంతో పాటు వారికి అశ్లీల సాహిత్యం, సెక్స్ టాయ్స్ ఇచ్చి లైంగిక సంబంధాలు కొనసాగించాలని ఒత్తిడి తెచ్చేవాడని అదే కాలేజ్‌కు చెందిన బీఎస్సీ విద్యార్ధిని ఆరోపించింది. కమ్రాన్ విద్యార్ధినులను తన ఇంటికి తీసుకువెళ్లి వారిని తన కోరికలు తీర్చాలని బెదిరిస్తాడని వాపోయింది. కీచక ప్రొఫెసర్ తన పట్ల దురుసుగా ప్రవర్తించాడని, చేతబడితో తాను అందరినీ తన గుప్పిట్లో పెట్టుకుంటానని చెప్పాడని ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించాడని వెల్లడించింది.
కాగా ఇనిస్టిట్యూట్‌లో కొందరు విద్యార్ధినులు కమ్రాన్‌కు సహకరిస్తున్నారని ఆమె ఆరోపించారు. కమ్రాన్ భార్య కూడా ఈ అరాచకానికి వత్తాసు పలుకుతోందని తెలిపింది. విద్యార్ధిని సోదరుడి ఫిర్యాదు ఆధారంగా కొత్వాలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడు ప్రొఫెసర్ కమ్రాన్ పరారీలో ఉన్నాడని అతడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.