ఇల్లు సర్దాలంటే గంటలకు గంటలు ప్లాన్ చేయనవసరం లేదంటున్నారు ఇంటీరియర్ డిజైనింగ్ థీమ్‌తో ఓ వీడియో గేమ్‌ను సృష్టించిన శిఖాశర్మ, అర్పిత్ బన్సాల్. ఇంటీరియర్ డిజైనింగ్ కోసం లక్షల్లో ఖర్చుపెట్టేవారు చాలామందే ఉన్నారు. అంతా అయ్యాక అసంతృప్తిగా అనిపిస్తే, ఇంకొన్ని లక్షలు పోసి మళ్లీ మార్చేవారూ ఉన్నారు. ఈ ఇబ్బందిని అధిగమించడానికి ఫోన్లో మ్యాజిక్ కార్పెట్ రైడ్స్ గేమ్ ఆడుతూ.. ఇంట్లో ఏ వస్తువును ఎక్కడ సర్దితే బాగుంటుందో ఊహించుకోవచ్చు. ఇంటికి ఏ రంగు పెయింట్ వేస్తే ఎలా కనపడుతుందో ఓ అంచనాకు రావచ్చు. ఏ టైల్స్ ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తాయో, ఏ వస్తువులు ఎబ్బెట్టుగా కనపడతాయో ఆకళింపు చేసుకోవచ్చు. అలా ముందే అన్నిటినీ ప్లాన్ చేసుకుని.. ఆ లిస్ట్ ప్రకారం ఇంట్లోకి కావాల్సిన వస్తువులు తెచ్చుకుంటే సరిపోతుంది. అంతేకాదు, ఈ గేమ్ ద్వారా ఇతరుల సలహాలూ అభిప్రాయాలూ తీసుకోవచ్చు. భలే ఐడియా కదూ!