చెన్నై: కూతురుపై తండ్రి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో 8వ తరగతి చదువుతున్న బాలిక గర్భం దాల్చి ఇటీవల ఒక బిడ్డకు జన్మనిచ్చింది. తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో ఈ దారుణం జరిగింది. 13 ఏళ్ల బాలిక ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నది. ఇటీవల కడుపులో నొప్పిగా ఉందని చెప్పింది. దీంతో బంధువులు ఆమెను ప్రభుత్వ వెల్లూరు మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె గర్భవతి అని తెలిపారు. ఆసుపత్రిలో చేరిన ఆ బాలిక ఆగస్ట్ 2న మగ బిడ్డను ప్రసవించింది. దీంతో వైద్యాధికారులు ఈ విషయాన్ని పిల్లల సంక్షేమ కమిటీకి తెలుపగా, వారు వెల్లూరు మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా, మహిళా పోలీసులు ఆ బాలికను ప్రశ్నించారు. దీంతో తన తండ్రి గత పది నెలలుగా తనపై లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు ఆమె ఆరోపించింది. తల్లిదండ్రులు విడిపోవడంతో సోదరుడితో కలిసి నానమ్మ ఇంట్లో ఉంటున్నట్లు తెలిపింది. నానమ్మ వండిన భోజనాన్ని తండ్రికి తీసుకెళ్లేదానినని చెప్పింది. ఈ క్రమంలో తనపై అత్యాచారం చేసేవాడని, ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడని చెప్పింది.
మరోవైపు బాలిక స్టేట్మెంట్ ఆధారంగా ఆమె తండ్రి అయిన 44 ఏళ్ల వ్యక్తిని వెల్లూరు మహిళా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై పోక్సో చట్టంతోపాటు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టడంతో రిమాండ్ విధించింది.