జైపూర్: హోమ్ వర్క్ చేయని ఒక విద్యార్థిని ఉపాధ్యాయుడు కొట్టి చంపాడు. పైగా అతడు చనిపోయినట్లుగా యాక్టింగ్ చేస్తున్నాడని ఆరోపించాడు. రాజస్థాన్లోని చురు జిల్లా సలాసర్ గ్రామంలో ఈ దారుణం జరిగింది. కొలసర్ నివాసి ఓంప్రకాష్కు చెందిన 13 ఏండ్ల కుమారుడు ఒక ప్రైవేట్ స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్నాడు. స్కూల్ టీచర్ మనోజ్ కుమార్ తనను అకారణంగా కొడుతున్నట్లు తండ్రికి పలుమార్లు ఫిర్యాదు చేశాడు.
కాగా, బుధవారం స్కూల్కు వెళ్లిన ఆ స్టూడెంట్ను హోంవర్క్ చేయలేదన్న కోపంతో టీచర్ మనోజ్ కర్రతో పలుమార్లు కొట్టాడు. దీంతో అతడు కింద పడి అచేతనంగా ఉన్నాడు. ఆ ఉపాధ్యాయుడు విద్యార్థి తండ్రి ఓంప్రకాష్కి ఫోన్ చేశాడు. హోంవర్క్ చేయకపోవడంతో తాను కొట్టగా అచేతనంగా పడిపోయాడని చెప్పాడు. తన కుమారుడ్ని చంపేశావా అని ఆయన అడగ్గా, చనిపోయినట్లుగా నటిస్తున్నాడని ఆ టీచర్ చెప్పాడు.
దీంతో విద్యార్థి తండ్రి హుటాహుటిన స్కూల్కు చేరుకున్నాడు. అక్కడ ఉన్న భార్యతో కలిసి కుమారుడ్ని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కాగా, ఆ విద్యార్థిని టీచర్ కింద పడేసి చేతులు, కాళ్లతో పలుమార్లు గట్టిగా కొట్టాడని తోటి విద్యార్థులు ఆరోపించారు. విద్యార్థి తండ్రి ఓంప్రకాష్ ఫిర్యాదుతో టీచర్ మనోజ్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.