కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం కన్నడిగులకి తీరని శోకాన్ని మిగిల్చింది. ఆయన మరణించి రెండు వారాలు అవుతున్నా కూడా ఇంకా పునీత్ జ్ఞాపకాల్లోనే కన్నడ సినీ ప్రేమికులు మరియు అభిమానులు ఉన్నారు. 26 అనాథాశ్రమాలు.. 45 పాఠశాలలు.. 16 వృద్ధాశ్రమాలు.. 19 గోశాలలు.. 1800 మంది పిల్లల చదువు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ప్రతి ఏడాది భారీ ఎత్తున ఈ సేవా కార్యక్రమాలకు గాను ఖర్చు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనపై అభిమానులు అంత ప్రేమ పెంచుకున్నారు.
పునీత్ మరణించిన కూడా సమాధిలో తమ అభిమాన హీరోని చూసుకుంటున్నారు. పునీత్ సమాధి దగ్గరికి లక్షల మంది వచ్చి దర్శించుకుంటున్నారు. తాజాగా ఓ ప్రేమ జంట పునీత్ సమాధి దగ్గర ఏకంగా పెళ్లి చేసుకున్నారు. గురు ప్రసాద్, గంగ జంట రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీళ్లకు పునీత్ అంటే ప్రాణం. తమ పెళ్లి జరిగిన తర్వాత పునీత్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకోవాలి అనుకున్నారు. కాని ఆయన మరణించడంతో పునీత్ సమాధి దగ్గర పెళ్లి చేసుకున్నారు.
ముందుగా అక్కడ పెళ్లి చేసుకోవడానికి పోలీసులు అనుమతించలేదు. తాము బళ్లారి నుంచి వచ్చామని.. పునీత్ సమాధి ముందు పెళ్లి చేసుకోవడం తమకు ఆశీర్వాదం లాంటిదని వాళ్ళు చెప్పారు. అయినా కూడా పోలీసులు నిరాకరించడంతో మీడియా ముందు తమ ఆవేదన వెలిబుచ్చారు. విషయం తెలుసుకున్న పునీత్ కుటుంబ సభ్యులు అక్కడ పెళ్లి చేసుకోవడానికి తమకెలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. దాంతో వెంటనే గంగా, గురు ప్రసాద్ అక్కడే పెళ్లి చేసుకున్నారు.