Nayyi Navelli | బాలీవుడ్ నటి యామీ గౌతమ్ ధర్, ఆదినాథ్ కోఠారే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా హిందీ చిత్రం ‘నయీ నవేలి’ టీజర్ తాజాగా విడుదలైంది. హర్రర్, కామెడీ, మిస్టరీ అంశాల కలబోతగా ఫాంటసీ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రానికి బాలాజీ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శక-నిర్మాత ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ సంయుక్తంగా కలర్ ఎల్లో ప్రొడక్షన్స్, అమెజాన్ ఎమ్జీఎం స్టూడియోస్ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మిస్తుండగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
మీరట్ నేపథ్యంలో సాగే ఓ విలక్షణ కుటుంబంలోకి అడుగుపెట్టే కొత్త కోడలు పాత్రలో యామీ గౌతమ్ నటిస్తున్నారు. ఆమె రాకతో ఆ ఇంట్లో చోటుచేసుకునే వింత సంఘటనలు, కొత్త కోడలు ఒక మంత్రగత్తె అయి ఉండొచ్చనే అనుమానాలు టీజర్లో ఆసక్తికరంగా చూపించారు. ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ తరహా వినోదం, ‘తుంబాడ్’ మిస్టరీ కలగలిపిన సరికొత్త అనుభూతిని ఈ సినిమా ఇవ్వనుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది.