Genelia Deshmukh | 2012లో ‘నాఇష్టం’ సినిమా తర్వాత నితేష్ దేశ్‌ముఖ్‌ని పెళ్లాడేసి, సినిమాలకు పుల్‌స్టాప్ పెట్టేసింది జెనీలియా. ఇద్దరు పిల్లలకు తల్లి అయినా కూడా జెనీలియాలోని ఆ అల్లరి హాసిని మాత్రం ఇంకా అలాగే ఉందని తన భర్తతో కలిసి ఆమె చేసే ఇన్‌స్టా రీల్స్ చెప్పకనే చెబుతుంటాయి. నితేష్, జెన్నీ కలిసి చేసే రీల్స్‌ని ఇష్టపడేవాళ్లు లక్షల్లో ఉంటారు. రీసెంట్గా భర్తతో కలిసి సొంతంగా చిత్ర నిర్మాణం కూడా మొదలుపెట్టిన జెనీలియా.. తన భర్త రితేష్‌తో కలిసి మరాఠీలో ‘వేద్’ అనే సినిమాలో నటించింది. తెలుగులో వచ్చిన ‘మజిలీ’.. ఈ ‘వేద్’కు మాతృక కావడం విశేషం. ‘మజిలీ’లో సమంత పాత్రను ‘వేద్’లో జెనీలియా చేసి, మరాఠీ ప్రేక్షకుల కితాబులందుకుంది.
ఇక అసలు విషయానికొస్తే, మంచి పాత్ర దొరికితే తెలుగులోనూ నటించడానికి రెడీ అని స్టేట్మెంట్ ఇచ్చేసింది జెనీలియా. అయితే.. తను తెలుగులో హీరోయిన్గా చేస్తుందా? లేక ప్రత్యేక పాత్రలు చేస్తుందా? అనేది తెలియాల్సివుంది. నిజానికి జెనీలియా కంటే సీనియర్లయిన త్రిష, నయనతార నేటికీ హీరోయిన్లుగా చలామణీ అవుతున్నారు. వీరిలో నయన్ కూడా ఇద్దరు పిల్లల తల్లే. అలాంటప్పుడు ఇప్పటికీ అందంగానే ఉన్నా జెనీలియా హీరోయిన్గా ఎందుకు చేయకూడదని ఆమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు. చూద్దాం.. ‘హాసిని’ తెలుగు ఎంట్రీ ఎలా ఉంటుందో..