Viratapalem: PC Meena Reporting | ‘రెక్కీ’ వంటి థ్రిల్లింగ్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన దర్శకుడు కృష్ణ పోలూరు, ఇప్పుడు ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ అనే మరో ఉత్కంఠభరితమైన సూపర్ నేచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌తో మన ముందుకు వస్తున్నారు. అభిజ్ఞా వూతలూరు, చరణ్ లక్కరాజు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్, జూన్ 27న ZEE5లో ప్రత్యేకంగా ప్రసారం కానుంది. ఈ సందర్భంగా, గురువారం నాడు జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ప్రముఖ నటుడు నవీన్ చంద్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా నవీన్ చంద్ర మాట్లాడుతూ…విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్ పోస్టర్ నాకు చాలా నచ్చింది. అభిజ్ఞ పోలీస్ ఆఫీసర్‌గా చాలా చక్కగా కనిపించారు. ‘రెక్కీ’ నాకు ఎంతో ఇష్టమైన సిరీస్, అదే దర్శకుడు మళ్లీ ఈ సిరీస్‌తో వస్తున్నారు. అభిజ్ఞ, చరణ్ అద్భుతంగా నటించారనిపిస్తోంది. చాయ్ బిస్కెట్ నుంచీ అభిజ్ఞ నాకు తెలుసు, ఆమె అద్భుతమైన నటి. దివ్య వంటి రచయితలకు మంచి గుర్తింపు రావాలి. ఈ సిరీస్‌లో నాకు కూడా అవకాశం ఇస్తే బాగుండేది. ఈ సిరీస్ అద్భుతమైన విజయం సాధిస్తుంది. ఈ ట్రైలర్లో ఆసక్తికరమైన ఇన్వెస్టిగేషన్తో పాటు మూఢ నమ్మకాల కాన్సెప్ట్‌ను కూడా స్పృశించినట్లు కనిపిస్తోంది. జూన్ 27న ZEE5లోకి వస్తున్న ఈ సిరీస్‌కు మంచి విజయం రావాలని కోరుకుంటున్నట్లు నవీన్ తెలిపాడు.
నిర్మాత శ్రీరామ్ మాట్లాడుతూ.. మా సిరీస్ ట్రైలర్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర గారికి ధన్యవాదాలు. మా టీమ్ అంతా కలిసి మంచి విజయం ఇవ్వబోతోంది. అను గారు నాపై నమ్మకంతో నాకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చారు. ‘రెక్కీ’ తర్వాత పదిహేను కథలు విన్నాను, కానీ ఏదీ నచ్చలేదు. అయితే, దివ్య గారి ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ కథ ZEE5 వద్దకు వచ్చింది. అను మేడమ్ నన్ను రిఫర్ చేశారు. దివ్య గారు చెప్పిన నరేషన్ విన్న తర్వాత ఆ కథ నన్ను చాలా వెంటాడింది. అభిజ్ఞ సైతం ఈ కథ విన్న తర్వాత చాలా ఎగ్జైట్ అయ్యారు. కృష్ణ గారు మొదట ఈ ప్రాజెక్ట్‌లో లేరు, కానీ నా మాట కోసం వచ్చి దర్శకత్వం వహించారు. నా స్నేహితుడు ప్రవీణ్ ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో శ్రమించారు. 80వ దశకం వాతావరణాన్ని చూపించడానికి ఆర్ట్ డైరెక్టర్ ఉపేంద్ర, కాస్ట్యూమ్ డిజైనర్ అంజలి చాలా కష్టపడ్డారని శ్రీరామ్ తెలిపాడు.
దర్శకుడు కృష్ణ పోలూరు మాట్లాడుతూ.. నేను ZEE5లో ఇదివరకే ‘రెక్కీ’ చేశాను, అది అద్భుతమైన విజయం సాధించింది. ఇప్పుడు మళ్లీ ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ చేశాను. ఈ ప్రాజెక్ట్‌కి దివ్య గారు కథను అందించారు. ‘రెక్కీ’ లాగానే ఈ ప్రాజెక్ట్‌ను కూడా ఎంజాయ్ చేస్తూ చేశాను. ఈ సిరీస్ కూడా అందరినీ ఆకట్టుకుంటుందని అన్నారు.
హీరోయిన్ అభిజ్ఞ మాట్లాడుతూ.. విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ ట్రైలర్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంత మంచి కథను రాసిన దివ్య గారికి ధన్యవాదాలు. మూఢ నమ్మకాల మీద పోరాడే ఈ కథ అద్భుతంగా ఉంటుంది. ఈ కథను నాకు శ్రీరామ్ గారు చెప్పారు. అద్భుతమైన కథ అని నాకు అప్పుడే అర్థమైంది. ఇలాంటి కథలు, పాత్రలు చాలా అరుదుగా వస్తుంటాయి. దర్శకుడు కృష్ణ గారితో పని చేయడం ఆనందంగా ఉంది. ఇంత మంచి కథలను ప్రోత్సహిస్తున్న ZEE5 టీమ్‌కు ధన్యవాదాలు. జూన్ 27న మా సిరీస్ వస్తోంది, అందరూ చూడండని హీరోయిన్ అభిజ్ఞ చెప్పుకోచ్చింది.
చరణ్ లక్కరాజు మాట్లాడుతూ.. కాస్టింగ్ మేనేజర్ సతీష్ వల్లే ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చాను. నన్ను ఓకే చేసిన శ్రీరామ్ గారికి ధన్యవాదాలు. కృష్ణ గారి లాంటి దర్శకుడితో పని చేయడం నా అదృష్టం. ఆయనకు ప్రతీ సీన్‌పై ఎంతో క్లారిటీ ఉంటుంది. కృష్ణ గారు, మహేష్ గారు చాలా వేగంగా పని చేస్తుంటారు. అభిజ్ఞ గారితో పని చేయడం సంతోషంగా ఉంది. జూన్ 27న ZEE5లో వస్తున్న మా సిరీస్ అందరినీ ఆకట్టుకుంటుంది.
కెమెరామెన్ మహేష్ కే స్వరూప్ మాట్లాడుతూ.. రెక్కీ’ తర్వాత మళ్లీ మంచి కంటెంట్‌తో వస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ కూడా అందరికీ నచ్చుతుంది. శ్రీరామ్ గారికి ఇదొక బహుమతి అవుతుందన్నాడు.
కథా రచయిత్రి దివ్య మాట్లాడుతూ.. విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ కథ 80వ దశకంలో జరుగుతుంది, కానీ ఇప్పటి తరానికి కూడా కనెక్ట్ అవుతుంది. మూఢ నమ్మకాల వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చూపించబోతున్నాం. కో-రైటర్ విక్రమ్‌తో కలిసి కథను రాయడం ఆనందంగా ఉంది. ZEE5లో జూన్ 27న మా సిరీస్ వస్తోంది, అందరూ చూసి ఎంజాయ్ చేయండి.
ZEE5 కంటెంట్ హెడ్ సాయి తేజ్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ZEE5లో ‘రెక్కీ’ అగ్రస్థానంలో ఉంది. ఆ రికార్డును ‘విరాటపాలెం’ బ్రేక్ చేయబోతోంది. దీనికి ఫ్రాంచైజీలు కూడా తీసుకురాబోతున్నాం. కథను రాసిన దివ్య మా మాజీ ఉద్యోగి. శ్రీరామ్ గారు ఈ ప్రాజెక్ట్ కోసం చాలా కష్టపడ్డారు. కృష్ణ గారు ఈ ప్రాజెక్ట్‌ను హ్యాండిల్ చేయడం ఆనందంగా అనిపించింది. విక్రమ్‌తో మళ్లీ పని చేయాలి. అభిజ్ఞ అద్భుతంగా నటించారు. సిరీస్‌ను స్టార్ట్ చేస్తే చివరి వరకు చూస్తూనే ఉంటారు. ట్విస్టులు, టర్న్‌లతో అందరినీ ఆకర్షిస్తుంది. ZEE5 లోగో మారింది కానీ కంటెంట్ మాత్రం అద్భుతంగానే ఉండబోతోందని తెలిపాడు.