Tollywood | విజయదశమి అంటే విజయానికి చిరునామా. ఆ రోజున ఏది తలపెట్టినా జయం తథ్యమని ప్రజల ప్రగాఢ నమ్మకం. ముఖ్యంగా సెంటిమెంట్ మీద నడిచే సినిమా పరిశ్రమలో దసరా హడావిడి మామూలుగా ఉండదు. ఓ వైపు రిలీజులతో మరోవైపు ఓపెనింగులతో హంగామా ఆకాశాన్నంటుతుంది. ఓ వేళ సినిమాలు నిర్మాణ దశలో ఉంటే.. టీజర్లో, ట్రైలర్లో, పాటలో.. కనీసం పోస్టర్లో విడుదల చేసేసి, దసరా సెంటిమెంట్‌ని ఫోలో అయిపోతుంటారు మన సినిమావాళ్లు. ప్రతి ఏడాది లాగే, ఈ సారి కూడా సినీ పరిశ్రమలో దసరా సందడి దద్దరిల్లిపోయింది. కొత్త సినిమా కబుర్లతో కళకళలాడిపోయింది.
‘విశ్వాన్ని అలముకొన్న ఈ చీకటి విస్తరిస్తున్నంత మాత్రాన వెలుగు రాదని కాదు.. ప్రశ్నలు పుట్టించిన కాలమే సమాధానాన్ని కూడా సృష్టిస్తుంది.. విర్రవీగుతున్న ఈ అరాచకానికి ముగింపు పలికే మహాయుద్ధాన్ని తీసుకొస్తుంది.’ చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా టీజర్ ప్రారంభంలో వినిపించే డైలాగులివి. ‘ఈ చీకటిని అంతం చేయడానికి మునుపెన్నడూ లేని విధంగా ఓ లెజెండ్ వస్తారు..’ అనగానే.. చిరంజీవి సూపర్‌హీరోలా ఆకాశంలో ఎగిరే రెక్కల గుర్రంపై స్వారీ చేస్తూ గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు.
దసరా కానుకగా విడుదలైన ఈ టీజర్ ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతినిచ్చింది. ఆకాశంలో ఎగిరే చేపల ఆకారంలోని పక్షులు.. గర్జించే ఖడ్గమృగాలు.. ఎగిరే గుర్రాలు.. చివరికి లార్డ్ హనుమాన్ విగ్రహం.. ఓ విజువల్ వండర్‌గా దర్శకుడు వశిష్ట ఈ టీజర్‌ని రూపొందించారు. చిరంజీవి స్క్రీన్ ప్రెజన్స్, యాక్షన్ సీక్వెన్స్, కీరవాణి నేపథ్య సంగీతం టీజర్లో హైలైట్‌గా నిలిచాయి.
హైదరాబాద్‌లో ఈ చిత్రం టీజర్‌ని చిత్ర యూనిట్ గ్రాండ్‌గా విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో నిర్మాత విక్రమ్, దర్శకుడు వశిష్ట, డివోపీ చోటా కె.నాయుడు, ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాశ్, పంపిణీదారుడు శశిధర్ రెడ్డి మాట్లాడారు. తొలుత ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల సంక్రాంతి రిలీజ్ వాయిదా పడింది. విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తారు. త్రిష ఇందులో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.
సింహా, లెజెండ్, అఖండ.. ఒకదాన్ని మించిన విజయం ఒకటి. హ్యాట్రిక్ హిట్స్‌తో తిరుగులేని కాంబినేషన్‌గా అవతరించారు నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను. వీరిద్దరి కాంబినేషన్లో ‘బీబీ4’ చిత్రాన్ని బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ‘లెజెండ్’ నిర్మాతలైన రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట 14 రీల్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. బాలకృష్ణ కుమార్తె ఎం.తేజస్విని సమర్పకురాలు. ఈ నెల 16న సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో ఘనంగా జరుగనున్నట్టు మేకర్స్ దసరా పర్వదినం సందర్భంగా ప్రకటించారు.
లాంచింగ్ రోజున ఈ సినిమాకు చెందిన మరిన్ని విశేషాలు తెలియజేస్తామని వారు అన్నారు. ఇంతకీ ఇది దేనికి సీక్వెల్? ‘లెజెండ్’కా? లేక ‘అఖండ’కా? రెండూ కాక కాత్త కథా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే.. ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే. ఇదిలావుంటే.. ప్రస్తుతం కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో బాలకృష్ణ ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మక సితార ఎంటైర్టెన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నిర్ణయించే టైటిల్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వీరమాస్, సర్కార్ సీతారామ్, డాకూ మహారాజా.. ఇలా పలు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కాగా, ఈ సినిమా టైటిల్‌ను, టీజర్‌ను దీపావళి కానుకగా మేకర్స్ విడుదల చేయనున్నారు.
‘దసరా’ సినిమాతో గత ఏడాది హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చేసిన హంగామా అంతాఇంతా కాదు. వందకోట్ల వసూళ్లను రాబట్టడంతోపాటు పలు అవార్డులను కూడా ‘దసరా’ దక్కించుకుంది. శ్రీకాంత్ ఓదెలతో మరో సినిమా చేయనున్నట్టు నాని గతంలో ప్రకటించారు. దాన్ని నిజం చేస్తూ ఈ దసరా పండుగ రోజున వీరిద్దరి రెండో సినిమా గ్రాండ్‌గా మొదలైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి ఓ ప్రకటన విడుదల చేశారు. ‘దసరా’కు వందరెట్లు ఇంపాక్ట్‌ని క్రియేట్ చేసేలా, లార్జర్ దేన్ లైఫ్ కథతో, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ఈ సినిమా రూపొందనున్నదని, గతంలో చూడని విధంగా పక్కా మాస్ పాత్రలో నాని కనిపించనున్నారని నిర్మాత తెలిపారు.
గత కొంతకాలంగా యాక్షన్ చిత్రాలతో చెలరేగిపోతున్న హీరో రామ్ పోతినేని, కామెడీ బాట పట్టారు. క్లీన్ ఎంటైర్టెనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రాన్ని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలందుకున్న దర్శకుడు మహేశ్‌బాబు పచ్చిగొల్ల దర్శకత్వంలో ఆయన ఓ చిత్రం చేయనున్నారు. రామ్ 22వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక మైత్రీమూవీమేకర్స్ వారు నిర్మించనున్నారు. ఈ విషయాన్ని దసరా పర్వదినం సందర్భంగా మేకర్స్ ప్రకటించారు. రామ్ కెరీర్‌కి ల్యాండ్ మార్క్‌గా నిలిచేంత గొప్ప కథను దర్శకుడు రాసుకున్నారని నిర్మాతలు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ తెలిపారు. ప్రముఖ నటీనటులు, టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు పనిచేయనున్నారని, త్వరలోనే షూటింగ్ మొదలుపెడతామని నిర్మాతలు తెలిపారు.
సితార ఎంటైర్టెన్మెంట్స్ పతాకంపై సిద్ధూ జొన్నలగడ్డ నటిస్తున్న మూడో చిత్రం ‘కోహినూర్’. సిద్ధూ ఈ సంస్థలో చేసిన డీజే టిల్లు, టిల్లు స్కేర్ చిత్రాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు ముచ్చటగా మూడో సారి ఈ సంస్థలో నటిస్తున్నారు సిద్ధు. కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురావడం అనే సాహసవంతమైన కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్నదనీ, దర్శకుడు రవికాంత్ పేరెపు ఊహలకందని అద్భుతమైన కథను రాసుకున్నారనీ, కథే ఈ చిత్రానికి ప్రధాన బలమనీ, 2026 జనవరిలో సినిమాను విడుదల చేస్తామని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలియజేశారు.
యువ దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ నిర్మిస్తున్న కాన్సెప్ట్ ఓరియెంటెంట్ ఫిల్మ్ ‘8 వసంతాలు’. ‘MAD’ఫేం అనంతిక సునీల్‌కుమార్ హీరోయిన్. ఇందులో ఆమె ‘శుద్ధి అయోధ్య’ అనే పాత్రను పోషిస్తున్నది. ఈ సినిమా టీజర్‌ని దసరా కానుకగా మేకర్స్ విడుదల చేశారు. ట్రైనింగ్ సెంటర్లో మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్‌ని ఓ అమ్మాయి సవాలు చేయడంతో ఈ టీజర్ మొదలైంది. ఓ 19ఏండ్ల అమ్మాయికి 27 ఏండ్లు వచ్చే వరకూ.. అంటే.. ఆ అమ్మాయి ఎనిమిదేళ్ల విలువైన ప్రయాణమే ఈ సినిమా అని మేకర్స్ తెలిపారు. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తామని మేకర్స్ చెప్పారు.
నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతోన్న ‘రాబిన్‌హుడ్’ సినిమా స్పెషల్ పోస్టర్ని దసరా కానుకగా మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాతో పాటు విశ్వక్సేన్, మీనాక్షి చౌదరి జంటగా తెరకెక్కుతోన్న ‘మెకానిక్ రాకీ’, ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న ‘జాక్’, తేజా సజ్జా ఫాంటసీ థ్రిల్లర్ ‘మిరాయ్’, సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, మహేశ్‌బాబు మేనల్లుడు గల్లా అశోక్ కథానాయకుడిగా రూపొందుతోన్న ‘దేవకీ నందన వాసుదేవ’, అనన్య నాగళ్ల నటిస్తున్న కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ ‘పొట్టేల్’ చిత్రాలకు సంబంధించిన పోస్టర్లను ఈ దసరా కానుకగా విడుదల చేశారు. మొత్తంగా కొత్త సినిమాల ప్రకటనలతో, నిర్మాణంలో ఉన్న సినిమాల ప్రచార చిత్రాలతో షూటింగ్ విశేషాలతో ఈ దసరా సంబురాలు అంబరాన్ని తాకాయి.
చాలా విరామం తర్వాత పవన్‌కల్యాణ్ నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. జ్యోతికృష్ణ దర్శకుడు. నేటి నుంచి ఈ సినిమాకు సంబంధించిన పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఇదిలావుంటే.. ఈ సినిమా నుంచి తొలి పాటను త్వరలో విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఇతర భాషల్లో ఈ పాటను ఇతర గాయకులు పాడగా, తెలుగు వెర్షన్‌ను స్వయంగా పవన్‌కల్యాణ్ ఆలపించడం విశేషం. దసరా పర్వదినం సందర్భంగా ఈ విషయాన్ని మేకర్స్ తెలియజేస్తూ.. ఓ పోస్టర్ని కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్లో నిప్పులు కక్కుతున్న మూడు బాణాలను ప్రత్యర్థులపై గురిపెడుతూ పవన్‌కల్యాణ్ కనిపిస్తున్నారు. నవంబర్ 10తో ఈ సినిమా షూటింగ్ పూర్తికానుంది. వచ్చే ఏడాది మార్చి 28న ఈ సినిమా తొలి పార్ట్ విడుదల కానుంది.