Vaarasudu Movie | ‘తుపాకి’ సినిమాతో టాలీవుడ్లో మంచి మార్కెట్ ఏర్పరుచుకున్నాడు తమిళ హీరో విజయ్. ఈ సినిమా తర్వాత ఆయన నటించిన సినిమాలన్నీ తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి. ఇక ఇప్పటి వరకు డబ్బింగ్ సినిమాలతో అలరించిన విజయ్.. ఇప్పుడు నేరుగా ‘వారసుడు’ వంటి తెలుగు స్ట్రేయిట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. దిల్‌రాజు నిర్మాత కావడంతో తెలుగులోనూ భారీ ఎత్తున విడుదలకు ముస్తాభవుతుంది.
అయితే ఈ సినిమాకు తమిళ ప్రమోషన్లతో పోలిస్తే తెలుగు ప్రమోషన్లు నత్త నడకన సాగుతున్నాయి. చిత్రయూనిట్ కూడా అసలు తెలుగు ప్రమోషన్లపై ఇంట్రెస్ట్ కూడా చూపించక పోవడం గమనార్హం. కేవలం దిల్‌రాజు బ్రాండ్‌తోనే సినిమా ఆడుతుందంటే పొరపాటే. నిజానికి తెలుగులో వారసుడిపై అసలు అంచనాలే లేవు. ఇప్పటివరకు రిలీజైన ప్రచార చిత్రాలు, పాటలు, ట్రైలర్ ఏది కూడా సినిమాపై అంచనాలు పెంచడంలో విఫలం అయ్యాయి. సినిమా కూడా రొటీన్ కథతోనే వస్తున్నట్లు ట్రైలర్‌తోనే స్పష్టం అయింది. పైగా ఇటీవలే రిలీజైన ‘వీరసింహా రెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ ట్రైలర్లతో ఈ సినిమాపై ఉన్న కాస్త బజ్ కూడా పోయింది. నాన్ వెజ్లాంటి రెండు సినిమాల మధ్యన వెజ్ వంటి వారసుడు గట్టెక్కడం అసాధ్యంగానే అనిపిస్తుంది.
ఇప్పటి వరకు తెలుగులో ప్రమోషన్ల ఊసే లేదు. తమిళంలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ జరిపిన.. తెలుగులో కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. తమిళ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏకంగా స్టేజ్ పైనే స్టెప్పులేసిన విజయ్.. ఇక్కడ ప్రమోషన్లకు మాత్రం పెదవి విరుస్తున్నాడట. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాకు ప్రమోషన్లు చాలా అవసరం. ఎంత పెద్ద హీరో అయినా సరే తన సినిమా కోసం ప్రమోషన్లు చేయకపోతే మొదటికే మోసం వస్తుంది. ‘విక్రమ్’ కోసం కమల్ అంతటి వారే ఇక్కడ రెండు, మూడు సార్లు ప్రెస్మీట్లను పెట్టాడు. అది కూడా డబ్బింగ్ సినిమాకు. ఇక ‘పొన్నియస్ సెల్వన్’ సినిమాకైతే ఏకంగా టీమ్ మొత్తం ఇక్కడికి తరలి వచ్చింది. కార్తి, సూర్య వాళ్ల సినిమాలు రిలీజవుతున్నాయంటే చాలు.. తమిళ ప్రమోషన్లకు ఏమాత్రం తీసిపోకుండా ఇక్కడ కూడా భారీ ప్రమోషన్లు చేస్తుంటారు. వీరే కాదూ ఇప్పుడున్న తమిళ యంగ్ హీరోలందరూ కాస్తో కూస్తో తెలుగులోను వాళ్ల సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారు.
కానీ విజయ్ మాత్రం తెలుగు ప్రమోషన్లకు నో చెప్తూ ఉన్నాడట. ప్రస్తుతం వారసుడు సినిమాకు బజ్ రావాలంటే విజయ్ చేయందించిడం అవసరం. నిజానికి సినిమాకు భారీ రేంజ్లో బిజినెస్ ఏం జరగలేదు. కానీ రెండు మాస్ సినిమాలతో పోటీ పడుతుండటంతో వీలైనంత బజ్ లేకపోతే మొదటి రోజే గాడీ తప్పుతుంది. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందించాడు.