Puri Jagannadh – Tabu | టాలీవుడ్ అగ్ర దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రస్తుతం తమిళ నటుడు విజయ్ సేతుపతితో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు బ్లాక్ బస్టర్లతో పాటు ఇండస్ట్రీ హిట్లను అందించిన పూరి ప్రస్తుతం సరైన విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలోనే విజయ్ సేతుపతితో చేతులు కలిపాడు. పూరిసేతుపతి అంటూ ఈ ప్రాజెక్ట్ రాబోతుండగా.. ‘పూరి కనెక్ట్స్’ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ నటి టబు ముఖ్య పాత్రలో నటించబోతున్నట్లు ఇప్పటికే చిత్రబృందం వెల్లడించింది.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ లో ప్రారంభంకానుండగా.. తాజాగా ఈ ప్రాజెక్ట్‌పై స్పందించాడు విజయ్. ఫ్లాప్‌లతో సతమవుతున్న పూరితో సినిమా ఎలా ఓకే చేశారు అనే ప్రశ్నకు సేతుపతి సమాధానమిస్తూ.. పూరి జగన్నాథ్‌తో నేను చేయబోతున్న సినిమా షూటింగ్ జూన్‌లో మొదలవుతుంది. దర్శకులను వారి గత సినిమాల ఫలితాలతో జడ్జ్ చేయను. స్క్రిప్ట్ నచ్చితేనే సినిమా చేస్తాను. పూరి చెప్పిన కథ నాకు చాలా నచ్చింది, అందుకే ఒప్పుకున్నాను. ఇలాంటి కథను ఇప్పటివరకూ చేయలేదు. నేను ఎప్పుడూ కొత్తదనానికి ప్రాధాన్యం ఇస్తాను. గతంలో చేసిన కథలను పునరావృతం కాకుండా జాగ్రత్తపడతాను అంటూ చెప్పుకోచ్చాడు.