Allu Arjun- Atlee | పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాలతో రూపొందుతోన్న అల్లు అర్జున్- అట్లీ కాంబినేషన్ మూవీ పై రోజుకో ఆసక్తికర సమాచారం బయటకి వస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో క్రేజీ అప్డేట్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. హాలీవుడ్ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో తమిళ్ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నాడు అని సమాచారం. పుష్ప 2 తరువాత అల్లు అర్జున్ కెరీర్లోనే అతి పెద్ద ప్రాజెక్ట్‌గా నిలవనున్న ఈ సినిమా హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన సాంకేతిక నిపుణులతో రూపొందుతోంది. టైమ్ ట్రావెల్, వారియర్ కాన్సెప్ట్‌ల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాకు రూ. 800 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
తమిళ మీడియా రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్‌గా లేదంటే ఇతర పవర్ఫుల్ రోల్లోనో కనిపించనున్నారు. గతంలో అట్లీ దర్శకత్వం వహించిన షారుక్ ఖాన్ చిత్రం జవాన్ లో విజయ్ సేతుపతి విలన్‌గా తనదైన నటనతో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అట్లీ – విజయ్ సేతుపతి మధ్య ఉన్న స్నేహం వల్లే ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ముంబైలో ఈ సినిమాకు సంబంధించిన వర్క్‌షాప్ కూడా జరిగింది. ఇందులో అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ, మరియు ప్రధాన తారాగణం పాల్గొన్నారు. హీరోయిన్గా దీపికా పదుకోన్ ఫిక్స్ కాగా, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, జాన్వీ కపూర్ వంటి స్టార్ హీరోయిన్లు కూడా కీలక పాత్రల్లో నటించనున్నారని సమాచారం.
దీపికా పదుకోన్ డేట్స్ క్లియర్ కావడంతో ఈ చిత్రం నవంబర్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభం కానుంది. 2027లో ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అట్లీ దర్శకత్వంలో వచ్చిన తెరివు, మేర్సల్, బిగిల్ వంటి సినిమాలు కమర్షియల్ గా కూడా విజయం సాధించాయి. అల్లు అర్జున్‌తో తొలిసారిగా చేస్తున్న ఈ పాన్ ఇండియా మల్టీ లాంగ్వేజ్ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. హాలీవుడ్ టేకింగ్, మల్టీ స్టార్స్ క్యాస్టింగ్, సూపర్ బడ్జెట్ ఈ మూవీ ఇండియన్ సినిమా స్టాండర్డ్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్తుందన్నమాట.