Vidyut Jammwal | బాలీవుడ్ యాక్షన్ హీరో విద్యుత్ జమ్వాల్ మరోసారి తన ప్రతిభతో అందరినీ షాక్‌కి గురి చేశాడు. ముంబై వేదికగా జరిగిన ‘స్ట్రీట్ ఫైటర్’ సినిమా ప్రత్యేక ప్రమోషనల్ కార్యక్రమంలో ఆయన చేసిన విన్యాసం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఈవెంట్లో భాగంగా వేదికపై ఏకంగా 15 నిమిషాల పాటు ఎలాంటి కదలిక లేకుండా, శ్వాసను పూర్తిగా నియంత్రిస్తూ ఆయన చేసిన ధ్యానం అందరినీ విస్మయానికి గురిచేసింది. భారతీయ యుద్ధ కళ అయిన కలరిపయట్టు, యోగాలో తనకు గల గ్రిప్‌ను ఆయన మరోసారి ప్రపంచానికి చాటిచెప్పారు.
హాలీవుడ్లో విద్యుత్ జమ్వాల్ నటిస్తున్న ప్రతిష్టాత్మక తొలి చిత్రం ‘స్ట్రీట్ ఫైటర్’. ఇందులో ప్రపంచవ్యాప్తంగా వీడియో గేమింగ్ ప్రియులకు సుపరిచితమైన ప్రముఖ క్యారెక్టర్ ‘ధల్సిమ్’ పాత్రలో ఆయన నటిస్తున్నారు. యోగా తన ప్రధాన సూపర్ పవర్‌గా ఉండే ఆ పాత్రకు విద్యుత్ మాత్రమే సరిపోతారని ఈ ఈవెంట్ ద్వారా ఆయన మరోసారి నిరూపించారు. సినిమాలోని ధల్సిమ్ వేషధారణలో ఉన్న ప్రత్యేక కాస్ప్లేయర్ల(సినిమాలోని పాత్రలు)తో కలిసి వేదికపైకి వచ్చిన ఆయన, ఎలాంటి హడావుడి లేకుండా ప్రశాంతంగా కూర్చుని 15 నిమిషాల పాటు మౌనంగా ప్రాణాయామం, ధ్యానం నిర్వహించారు.
ఈ అద్భుత విన్యాసం తర్వాత విద్యుత్ మాట్లాడుతూ.. తాను ప్రాచీన యోగసూత్రాల్లోని ప్రత్యేకమైన టెక్నిక్‌ను అనుసరించినట్లు తెలిపారు. ఈ అద్భుతమైన యోగా విధానం వల్లే తాను 15 నిమిషాల పాటు శ్వాసను నియంత్రించగలిగానని, ఇది తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో మానసిక లక్ష్యాలను సాధించడానికి ఎంతగానో దోహదపడిందని వివరించారు. కేవలం తాను మాత్రమే కాకుండా, ఈ ప్రాచీన భారతీయ పద్ధతులను నేడు యువతకు కూడా నేర్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి విద్యుత్ మాట్లాడుతూ విలువైన సందేశం ఇచ్చారు. ‘నేటి తరానికి తాను చెప్పాలనుకుంటున్నది ఒక్కటేనని, అందరూ జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే ఉరుకులు పరుగులతో అలసిపోతున్నారని అన్నారు. కానీ, కాసేపు ఆగి ప్రశాంతంగా ఉండటం నేర్చుకోవాలని, ఏమీ చేయకుండా కేవలం మనసును ప్రశాంతంగా ఉంచుకునే ఆ ప్రశాంతతే మిమ్మల్ని జీవితంలో చాలా దూరం తీసుకెళ్తుందని హితవు పలిచారు. జీవితంలో ఏ లక్ష్యమైనా సాధించడానికి కొంత సమయం పడుతుందని, అయితే పట్టుదలతో నిలకడగా కొనసాగితే కచ్చితంగా విజయం సాధించవచ్చని’ ఆయన స్పష్టం చేశారు. పారామౌంట్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ ‘స్ట్రీట్ ఫైటర్’ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా అక్టోబర్ 16, 2026న భారత్‌లో ఇంగ్లిష్తో పాటు హిందీ, తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో అత్యంత వైభవంగా విడుదల కానుంది.