విజయ్ సేతుపతి, సూరి, భవానీ శ్రీ, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ సినిమా ‘విడుతలై-1’. పీరియాడిక్ పోలీస్ క్రైమ్ థ్ల్రిల్లర్ కథతో దర్శకుడు వెట్రిమారన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇటీవలే కోలీవుడ్‌లో విడుదలై మంచి విజయాన్ని సాధించిందీ సినిమా. ఈ సినిమాను ‘విడుదల- పార్ట్1’ పేరుతో గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా నిర్మాత అల్లు అరవింద్ ఈ నెల 15న తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దర్శకుడు వెట్రి మారన్ మాట్లాడుతూ…‘ధనుష్‌తో ‘అసురన్’ మూవీ రూపొందించిన తర్వాత ఓ చిన్న బడ్జెట్ మూవీ రూపొందించాలని అనుకున్నాను.
సూరి ప్రధాన పాత్రలో చిన్న చిత్రంగా మొదలుపెట్టాం. కానీ అది అనుకున్న బడ్జెట్‌కు దాదాపు ఇరవై రెట్లు పెరిగింది. నా గత చిత్రాల్లాగే ఇందులోనూ స్థానికత, సాధారణ ప్రజల జీవితం, సామాజిక పరిస్థితులు కనిపిస్తాయి. గీతా సంస్థ ద్వారా తెలుగులో మా సినిమా విడుదలవడం సంతోషంగా ఉంది’ అన్నారు. నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ…‘ఇవాళ లోకల్ అనేది గ్లోబల్ అయ్యింది. మన స్థానికత ఉన్న చిత్రాలే అంతటా ఆదరణ పొందుతున్నాయి. ఈ సినిమా చూసినప్పుడు కథలో, పాత్రల చిత్రణలో ఆ స్థానికత, సహజత్వం కనిపించాయి’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటి భవానీ శ్రీ, నటుడు సూరి తదితరులు పాల్గొన్నారు.