అగ్ర కథానాయకుడు వెంకటేష్‌కు సంక్రాంతి సీజన్ బాగా కలిసొచ్చింది. గత ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’తో బ్లాక్‌బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు. తాజాగా ‘మనశంకర వరప్రసాద్‌గారు’ చిత్రంలో వెంకీగౌడగా అతిథి పాత్రలో అదరగొట్టారాయన. ప్రస్తుతం వెంకటేష్ సక్సెస్ట్రాక్లో దూసుకుపోతూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది ఆయన కాల్షీట్స్ మొత్తం ఫుల్ అయిపోయాయి. ప్రస్తుతం త్రివ్రిక్రమ్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం’ చిత్రీకరణ జరుగుతున్నది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయింది.
ఇది పూర్తయ్యాక అనిల్ రావిపూడితో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్లో వెంకీ జాయిన్ అవుతారని టాక్ వినిపిస్తున్నది. తాజా సమాచారం ప్రకారం ఆయన లైనప్‌లో ‘దృశ్యం-3’ కూడా చేరినట్లు సమాచారం. ఈ సినిమా తెలుగు వెర్షన్ ఆగిపోలేదని ఇటీవల నిర్మాత సురేష్‌బాబు క్లారిటీ ఇచ్చారు. అక్టోబర్‌లో ‘దృశ్యం-3’ పట్టాలెక్కుతుందని తెలిపారు. అదేగనుక నిజమైతే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్‌తో పాటు ‘దృశ్యం-3’ చిత్రాలు సమాంతరంగా షూటింగ్‌ను జరుపుకుంటాయి. మొత్తానికి ఈ ఏడాది మూడు భారీ చిత్రాలతో బిజీబిజీగా గడుపబోతున్నారు విక్టరీ వెంకటేష్.