సకల అస్త్రశస్ర్తాలను సిద్ధం చేసుకుంటే తప్ప యుద్ధరంగంలోకి అడుగుపెట్టని వీరుడు లాంటివాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన ప్రీప్రొడక్షన్కి ఎక్కువ సమయం తీసుకునేది అందుకే.. ముందు కథ పక్కాగా రావాలి. తర్వాత బౌండ్ స్క్రిప్ట్ సిద్ధం కావాలి. పాత్రధారులంతా తన పాత్రలకు సెట్టయ్యేలా అమరాలి. అప్పుడుకానీ లొకేషన్లోకి ఎంట్రీ ఇవ్వరు. ఓ విధంగా అనిల్ విజయాలకు కారణమదే. అలాగే.. సినిమా ప్రమోషన్స్ విషయంలోనూ అనిల్ దూకుడు అలాగే ఉంటుంది. ఎప్పుడూ బయటకు రాని వెంకటేష్‌తోనే ప్రమోషన్స్‌లో స్టెప్పులేయించిన ఘనుడు అనిల్. అవసరమైతే తాను డ్యాన్సులేస్తాడు.. అందరితో వేయిస్తాడు. తాను చేస్తున్న సినిమాపై ఆడియన్స్‌లో హైప్ తీసుకురావడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తాడు.
త్వరలో ఆయన చిరంజీవిని డైరెక్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవికి లవ్‌స్టోరీ ఉండదనీ, డ్యూయెట్లు అసలే వుండవనీ.. ఇది పెళ్లీడుకొచ్చిన పిల్లల తండ్రి పాత్రనీ.. అయితే.. మెగా యాక్షన్‌కి, మెగా కామెడీ టైమింగ్‌కి మాత్రం ఢోకా ఉండదని ఇప్పటికే వార్తలు వచ్చేశాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికమైన వార్త వెలుగు చూసింది. ఇందులో విక్టరీ వెంకటేశ్ కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తారట. ఆ పాత్ర నిడివి తక్కువే అయినా.. ప్రాముఖ్యత మాత్రం ఎక్కువే ఉంటుందని తెలుస్తున్నది. టాలీవుడ్ ఫోర్ పిల్లర్స్‌గా చెప్పుకునే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లలో ఏ ఒక్కరూ కూడా మిగతా ముగ్గురు సినిమాల్లో నటించిన దాఖలాల్లేవు. అనిల్ పుణ్యమా అని తొలిసారి ఈ నాలుగు పిల్లర్స్‌లో రెండు పిల్లర్స్ కలిసి స్క్రీన్‌షేర్ చేసుకోనున్నాయి. ఇదే నిజమైతే అభిమానులకు విజువల్ ఫీస్టే. మెగాస్టార్, అనిల్ రావిపూడి సినిమా ఓపెనింగ్ ఉగాది పర్వదినం సందర్భంగా నేడే జరుగనున్నది.