వరుణ్‌తేజ్ కథానాయకుడిగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నేపథ్యంలో రూపొందిస్తున్న తాజా చిత్రం సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ యాక్షన్ డ్రామాను సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రెనైసెన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ద్వారా వరుణ్‌తేజ్ బాలీవుడ్ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.
ముహూర్తపు సన్నివేశానికి పద్మజా కొణిదెల కెమెరా స్విఛాన్ చేయగా, ప్రముఖ నిర్మాత దిల్‌రాజు క్లాప్‌నిచ్చారు. తొలి సన్నివేశానికి బాపినీడు గౌరవ దర్శకత్వం వహించారు. వరుణ్‌తేజ్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ పాత్రలో నటించడం అదృష్టంగా భావిస్తున్నా. భారత వాయిసేన సాహసాలను ఆవిష్కరిస్తూ వారి త్యాగాలకు నివాళిగా ఈ సినిమా కథాంశం ఉంటుంది. ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందాను’ అని చెప్పారు. యాక్షన్‌తో పాటు దేశభక్తి అంశాలతో హృదయాన్ని కదిలించే చిత్రమిదని నిర్మాత సందీప్ ముద్దా తెలిపారు. తమ సంస్థ ద్వారా నిజమైన హీరోల కథల్ని చెప్పడానికి ప్రయత్నిస్తున్నామని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ జనరల్ మేనేజర్ లాడా గురుదేవ్ సింగ్ పేర్కొన్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.